God of Gods - Chapter 3

God of Gods - Chapter 3

మంటలు..ఆతర్వాత పెద్ద వర్షం పంపించి తన తల్లిని తీసుకువెళ్లిపోయావని ఆ పిల్లవాడు నిన్ను అంతం చేయాలనుకుంటున్నాడు. అప్పుడప్పుడు మాత్రమే నీ చెట్టు దగ్గరకి వచ్చేవాడు ఆరోజు నుండి ప్రతీపూట నిన్ను చూడటానికి వస్తున్నాడు. ఎప్పుడూ ఆలోచిస్తూ కూర్చుంటున్నాడు.నీటిలో పడిన నూనెలాగ ఎవరితో కలవట్లేదు. ఇది చూసి వీడు ఏం చేయబోతున్నాడో అని నీకు ముచ్చట వేసింది. అందుకని పగలు సూర్యుడిని..రాత్రి చంద్రుడిని వీడికి కాపలాగా పెట్టావు.


ఎప్పుడూ వినని కొన్ని మాటలు వినిపించడం మొదలయ్యాయి. భయంకరమైనవి. రాత్రిళ్ళు నిద్రలోకూడా అవే మాటలు కొంతమంది మనుషులకి నిద్రలేకుండా చేస్తున్నాయి. అప్పటివరకు ఉన్న శక్తులని భయపెట్టేవి. ఆ మాటలు ఎంత ప్రమాదకరమైనవి అంటే అప్పటివరకు ఉన్నవి పునాదులు నుండి కూలిపోతాయి. ఆ మాటలు "ఎవరు?" "ఎందుకు?" ఆ రెండు మాటలు ఓంకారం అంత శక్తివంతమైనవి.  ఆ మాటల వెనుక ఆలోచన "తెలియకపోవడం-తెలుసుకోవాలని అనుకోవడం". ఆ అలోచనలే ఒక రూపంగా సంతరించుకుంది...ఆ రూపమే "ప్రశ్న".
సూర్యుడు ఎవరు? చంద్రుడు ఎవరు? చెట్లకి ప్రతిరోజు తిండి పెట్టేది ఎవరు?చెట్లు ఎందుకు కదులుతున్నాయి? ఎవరు కదుపుతున్నారు? ఎవరు?ఎవరు?? ఈ ప్రశ్న రేపో మాపో నీ దగ్గరకి కూడ వస్తుంది. నువ్వు ఎవరు? అని.
'ఎలా' అన్న సందేహం ఇంకా రాలేదు.


ఇలాంటి పరిస్థితులు ఆ ఊరిలో ఉన్న పెద్దలకి కొత్త కాదు. కొన్ని ప్రశ్నలకి సమాధానం చెప్పకపోతే ప్రస్తుతం ఉన్న ప్రశాంతతని చెడగొడతాయని వాళ్లకి తెలుసు. ఏం సమాధానం చెప్పాలో కూడ వాళ్ళకి తెలుసు.వెనకటితరం వాళ్ళు ఆ ప్రశ్నలకి జవాబులు ముందు తరాలవారికి కథల రూపంలో ఉంచారు.
ఈ తరానికి ఆ కధల ద్వారా సమాధానాలు చెప్పడానికి పెద్దలు సరైన కాలం కోసం ఎదురుచూస్తున్నారు.



వానాకాలం రాగానే పుట్టగొడుగులు,నేల రాలిన పువ్వులు, తేనె తీసుకురావడం కోసం ఆ ఊరిలో ఉన్న యువతీయువకులను అడవికొండకి పంపడం ఆనవాయితీ. ఆ అడవికొండకి పోవాలంటే వాగుదాటి పోవాలి.అడవికి పోయెటప్పుడు వాగు చిన్నగానే ఉంటుంది. వచ్చేటప్పుడు మాత్రం పడిన వర్షాలకి ఉదృతంగా ప్రవహిస్తుంది. అయితే వాగు అయిన దాటిపోవాలి లేక ప్రాణమైన పోవాలి. విడి విడిగా వెళ్ళిన కొంతమంది యువతీయువకులు వచ్చేటప్పుడు జంటగా వస్తారు.
వర్షాకాలం మొదలయ్యి తొలకరి పడి ఆగిన మూడురోజులు తర్వాత యువకులు నేలకొరిగిన తాటి,కొబ్బరి చెట్లలో కుళ్ళిపోని వాటిని పోగు చేయసాగారు. చెట్లబెరళ్ళతో తాడు తయారుచేసారు. తాటిబుట్టలు,సూదికర్రలు,తాళ్లు,మత్తుపళ్లు,వేటకుక్కలు,ఉడుములు వంటివాటిని సిద్ధం చేస్తున్నారు.


ఆ రోజు రానే వచ్చింది..ఆహారం కోసం అడవికి వెళ్తున్న వారికి ఆశీస్సుల కోసం నీదగ్గరకి తీసుకువచ్చారు. నీకు పూజలు చేసి ఫలహారం పెట్టి ఒక్కొక్కరుగా వచ్చినిన్ను ప్రార్దించడం మొదలు పెట్టారు. జాగ్రత్తగా తిరిగిరావాలని,ఎక్కువ ఆహారం దొరకాలి, పాములు ఇబ్బంది రాకూడదని కొందరు, నీకు కొన్ని రోజులు పూజ చేయలేకపోవచ్చు అని ఇంకొదరు,పిల్లలు క్షేమంగా రావాలని తల్లిదండ్రులు,పెద్దలు పూజ చేసి సహపంక్తిగా తండ్రిపక్కన కొడుకు వచ్చేలాగా వరుసలో కూర్చున్నారు.

పెద్దమనుషుల తరపున ఊరి పెద్ద జాగ్రత్తలు  చెప్పడం మొదలుపెట్టాడు.అందరూ ఐకమత్యంగా ఉండండి. ఒకరినొకరు సహాయం చేసుకోండి.అందరూ ఒకేసారి నిద్రపోవద్దు. పాములగుట్ట వైపుకు పోవద్దు. అన్నిటికన్నా ప్రమాదమైన పంతాలకి పోవద్దు. అలా వెళ్లే ఒక వానాకాలం వేటకి వెళ్లిన 58 మందిలో ఇద్దరు మాత్రమే మిగిలారు. ఆ ఇద్దరికి తరువాత ఏం అయ్యిందో మీ అందరికి తెలిసిందే.  ఎవరు కూడా తనకి మించిన,తలకి మించిన భారం మోయవద్దు. బరువు అనిపిస్తే తోటివాడినైనా విడిచి పెట్టడానికి ఆలోచించవద్దు. అవకాశం ఉంటే ఒక్కడినైన చావకుండా కాపాడండి. అవసరం అనుకుంటే చావడానికి అయినా వెనకాడవద్దు.ఇదే పని మీ తాతలు చేసారు,తండ్రులు చేసారు,మీరు చేస్తున్నారు,మీ తర్వాత తరాలు కూడా చేస్తాయి. కార్యం సిద్ధించుగాక!!


నిన్ను శత్రువుగా చూస్తున్న పిల్లవాడు ఆశగా ఉన్నగుంపులో వాళ్ళ అమ్మ ఉన్నదేమో అని వెతుకుతున్నాడు. వాడికి నిరాశ తప్ప ఏం మిగలలేదు. భాద,కోపం మాత్రం మెండుగా ఉన్నాయి. నీకు మాత్రం నువ్వు చేసిన పనికి నవ్వుతున్నావు..ఆ పిల్లవాడికి తన తల్లి ఎలా ఉంటుందో గుర్తులేకుండా చేసేసావు. వాడు చూసే ప్రతీ మహిళ ముఖం ఒకేలాగా ఉండేలాగా చేసేసావు..ఆ ముఖం చూసినప్పుడల్లా వాడికి ఎక్కడో చూసిన అనుభూతి కలుగుతుంది. ఎవరిదో అర్ధం అవ్వట్లేదు.గుర్తురావట్లేదు. గుర్తురాకుండా నువ్వే చేసావు.
ఇప్పుడు ఆ ముఖంలాంటి వంద ముఖాలు వాడి చుట్టూ చేరి ఇంకా అయోమయం,చిరాకు,భయం కలిగిస్తున్నాయి.వాడికి చుట్టూ ఏం జరుగుతుందో ఏమి పట్టట్లేదు,తెలియట్లేదు. నీకు జాలి వేసి వాడికి ఆ విచిత్ర స్థితి తొలగించావు.

నీకు జాలి వేసి వాడికి ఆ విచిత్ర స్థితి తొలగించావు. భారం తగ్గిన అనుభూతి కలుగుతుంది.ప్రశాంతత వైపు నడుస్తున్నాడు.నడుస్తున్నాడు..నడుస్తూనే ఉన్నాడు. మళ్లీ ఏవేవో అరుపులు,శబ్దాలు వినపడుతున్నాయి..నీ ప్రశాంతత మళ్లీ తగ్గిపోతున్న భయం వేస్తుంది.ఆ ముఖం ఈసారి మళ్ళీ ఇంకా గట్టిగా నవ్వుతుంది.అందుకని ఆ భయానికి ఇంకా దూరంగా వాయువేగంతో వెళ్లిపోతున్నాడు. ఒక్కసారిగా ఆ పిల్లవాడిని ఎవరో తుఫాను వేగంతో గట్టిగా లాగినట్టు లాగగా ఒక్కసారిగా పిల్లవాడు కళ్లుతెరిచి చూస్తూనే ఆశ్చర్యంతో తెరిచిన కళ్లు ఇంకా పెద్దవి చేసి భయంతో తన ముందు అర అడుగు అంత దూరంలో ఉన్న దేవుడి విగ్రహాన్ని చూస్తూ బిగుసుకుపోయాడు. వాడిలో అంతటి అశాంతిని రేపుతున్న ముఖం నీదే! వాడికి ఇంకా కోపం వచ్చింది. కానీ...

నడుస్తూ గాలిలోకి లేపిన కాలు ఇంకా దేవుడి విగ్రహానికి దారపుపోగు అంత దూరంలో ఆగిపోయింది. పిల్లవాడికి,దేవుడివైన నీకు మధ్యలో గాలి కూడా దూరటానికి వీలులేనంత,వెంట్రుకలో వెయ్యవ వంతు కన్నా తక్కువ చోటు మాత్రమే ఉంది. నీకు,పిల్లవాడికి మధ్యన ఇంకెవరూ ఉండటం నీకు ఇష్టం లేదు. పిల్లోడిని వెనక్కిలాగిన వ్యక్తి లాగలేక పడిపోయాడు. ప్రజలు అంతా ఆశ్చర్యంతో ఏం జరగబోతుందా అని అర్ధం కానట్టు మాయకి, నిజానికి మధ్య పడిపోయారు. కాలం చాలా నెమ్మదిగా కదులుతుంది.
దేవుడివైన నువ్వు నవ్వుతూ ప్రశాంతంగా పిల్లవాడి కాలునే చూస్తున్నావు. పిల్లవాడు భయంభయంగా వణికిపోతున్నాడు,అతి కష్టం మీద ఊగుతూ కాలుని నియంత్రించుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు. సహాయం చేయనా అని అడిగావు...వాడికి అహం అడ్డొచ్చింది.వద్దు అన్నాడు. ఇప్పుడు నీకు అహం వచ్చింది..సరదాగా!! ఈదురుగాలిని రప్పించావు.. వాడికి ఇంకా పంతం పెరిగింది.పోరాడుతూనే ఉన్నాడు. గాలికి నిలబడలేకపోతున్నాడు. ఇంక నువ్వే దిక్కు అన్నట్టు నీకళ్లలోకి చూసాడు. నువ్వే గెలిచావు అన్న ఆనందం తో గట్టిగా నవ్వావు. ప్రపంచం స్తంబించింది. మనుషులు,పక్షులు,జంతు,సమస్త జీవరాశి స్తంబించింది. నీకు పిల్లవాడి కాలి మద్యగా సన్నటి కాంతిరేఖ ప్రవహిస్తుంది. కాలం ఇంకా  నెమ్మదిగా కదులుతుంది. నువ్వు అమితానందంతో నీ ఎడమకాలుని ఒక అడుగు వేసావు. నీకు,పిల్లవాడి కాలి మధ్య ప్రసరిస్తున్న కాంతిరేఖ ఆగిపోయింది. పిల్లవాడి కాలు నీకు తగిలింది.కాదు కాదు..నువ్వే వెళ్లి పిల్లవాడి కాలికి తగిలావు...

To be continued...

Thanks
Vamsikrishna Bazaru


Link for God of Gods Chapter4 https://blogofviwo.blogspot.com/2020/06/god-of-gods-chapter-4.html?m=1



Comments

Post a Comment

Popular Posts