విచిత్ర కుటుంబం
మాదొక విచిత్ర కుటుంబం.
సూర్యుడు మా నాన్న. పొద్దున అవ్వగానే పనికి వెళ్ళి సాయంత్రానికి ఎప్పుడో ఇల్లు చేరుతాడు. నాన్న తెచ్చే, ఇచ్చే భరోసా ఎంతో అవసరం.
మా అమ్మ, ఎంతో ఓర్పు గల శక్తి.
ఎప్పుడు తవ్వారో తెలియదు కానీ, మా ఇంటి పక్కనే పెద్ద ఉప్పు నీటి మడుగులు, అవే సముద్రాలు, మా ఇంటి గుండా పారే నీటి ప్రవాహాలు, నదులు.
ఇంక మా అన్నలు, పెద్ద పెద్ద గుబురు మీసాలు, గడ్డాలు పెంచుకునే జీవులు. వారే అడవులు, చెట్లు, పుట్టలు.
మా అక్కలు, మా అమ్మ లాగే ఉంటారు. ఒకరు నల్లగా, మరొకరు ఎర్రగా, ఇంకొకరు బంగారపు వర్ణంలో మరియు చామనఛాయ రంగులో ఉంటారు. చూడటానికి ఎంతో అందంగా ఉంటారు.
మా ఇంట్లో అందమంతా వాళ్ళదే. మా ఇంట్లోనే కాదు, ఎక్కడైనా అందం అంటే ఆడవారే కదా!!
మాకు ఏ లోటూ లేదు, మేమంతా ఒకటే, మాదంతా ఒకటే.
మా నాన్నకి కోపం ఎక్కువ. ఆయన తీవ్రతను తగ్గించడానికి అన్నట్టు మా తాతలు, బామ్మలు మమ్మల్ని కాపాడుకుంటూ ఉంటారు... వాళ్ళే ఓజోన్ పొరలు.
ఆయన కొన్నిసార్లు అలిగి రావడం మానేస్తారు కూడా. మా అమ్మ కూడా... అప్పుడప్పుడు కోపంతో ఊగిపోతుంది. అవి సర్వసాధారణం.
ఇంక మా బంధువులు కొంచెం ప్రత్యేకం... వేసవి వెళ్ళిన తర్వాత వస్తారు. మా ఉప్పు మడుగుల నుండి తోడుకున్న నీటికి వడ్డీగా ఉప్పును తీసి మంచి నీటిని తిరిగి ఇస్తారు. వారే రుతుపవనాలు, మా అమ్మ వైపు చుట్టాలు.
మా తొలికరి చుట్టాలు నేలకు చేరినప్పటి క్షణం ఎంతో ఆహ్లాదంగా, సువాసనభరితంగా ఉంటుంది. సున్నిపిండిలో వేడి వేడి నెయ్యి కలిపినట్లు!
తన పుట్టింటి వారు రాగానే అమ్మ, మా నాన్న వేసవి తాపం నుండి విముక్తి పొందినట్టుగా అయిపోతుంది. వారు ప్రేమతో మా అమ్మని చుట్టేసి ఆప్యాయతలో ముంచేస్తారు. అప్పుడు అలిగినట్టుగా అమ్మకి నాన్న కొన్నిరోజులు కనపడటమే మానేస్తారు.
మా అమ్మకి రైతు నాగళ్ళు చేసే చిన్న చిన్న గాయాలు ఎంతో ఇష్టం. ఏమి కోరితే అది, ఎంత చేస్తే అంత ఇస్తుంది. అమ్మ అన్నపూర్ణ అవుతుంది.
మేమంతా బంధువులం, మాదంతా ఒక కుటుంబం.
మళ్ళీ... మాలో మాకు చాలా గొడవలు కూడా ఉంటాయి.
జూన్‌లో మంచిగా ఉండే మా చుట్టాలు, కొన్ని కొన్నిసార్లు ఆగస్టు-సెప్టెంబర్‌లో ఏదో ఆస్తి గొడవలు ఉన్నట్టు తుఫానులుగా మా మీద విరుచుకుపడతారు. మా ఉప్పు నీటి మడుగులు వాళ్ళ అడుగులకి మడుగులు ఒత్తుతాయి అప్పుడు.
తుఫానులు, వరదలు (ఫ్లాష్ ఫ్లడ్స్) అప్పుడు మా అన్నలు కొన్నిసార్లు ఇబ్బంది పడతారు.
మా అక్కలు భయపడిపోతారు. మా అన్నలు అనగా మహా వృక్షాలు, పచ్చిక బయళ్ళు... ఎన్నో అడుగుల లోతుగా వేళ్ళను పెనవేసుకుని ఉండి, వాళ్ళు ఎటూ పోకుండా కాపాడతారు,సాయిల్ ఎరోషన్ అవ్వకుండా.
కాపాడుకోవాలి, అన్నపూర్ణలు కదా!!
ఎవరి ఇంట్లో ఉండవు ఈపాటి గొడవలు? మళ్ళీ మామూలు అయిపోతాం.
అప్పుడే మాకు తమ్ముడు పుట్టాడు... మార్పు రాసాగింది. వాడు పుట్టడంతోనే మా అమ్మకి కష్టాలు మొదలయ్యాయి. పురుడు పోసుకునేటప్పుడు వచ్చిన కష్టాలు కావివి, పెరిగి పెద్దవాడు అయిన తర్వాత వచ్చిన కష్టాలు.
ఈ మధ్య తరచుగా అమ్మకి జబ్బు చేస్తోంది. కుర్రాళ్ళు మూతిలో మొలిచిన కాలే సిగరెట్టుతో లంగ్స్ (ఊపిరితిత్తులు) పాడుచేసుకుంటున్నట్టుగా, మా అమ్మ ఒంటిని చీల్చుకు వస్తున్న ఫ్యాక్టరీల పొగ గొట్టాలు, వాహనాల పైపుల పొగ మా పర్యావరణాన్ని పాడు చేస్తోంది.
మా తమ్ముడి పనుల వల్ల, మా ఇంట్లో మా ఓజోన్ అవ్వ తాతలు మంచాన పడ్డారు. ఇంక మా నాన్న కోపానికి అడ్డు అదుపు ఇంకేముంటుంది?
మా అన్నలని,అడవులని విచ్చలవిడిగా నరకడం మొదలు పెట్టాడు, ఆధిపత్యం కోసం.
మా చుట్టాలు (వర్షాలు) రావడం తగ్గించేస్తున్నారు కొన్ని కొన్నిసార్లు. వాళ్ళు రాకపోతే పంటలు ఎలా పండుతాయి? అప్పుడు ఎంతో అందంగా ఉండే మా అమ్మ, కొన్నిసార్లు బీడు వారుతుంది. చూడాలంటే ఎంత కష్టం!
ఇన్ని శిక్షలు తప్పవు అన్నట్టు, మా అమ్మ గుండె లోతుల్లో ఉన్న నీటిని, కన్నీటిని మోటార్లు వేసి మరీ తోడుతున్నాడు. మా అమ్మ ఎండిపోతోంది.
ఇవ్వడం మాత్రమే తెలిసిన మా అమ్మకి భయపెట్టడం తెలియదా!? తెలుసు, కొన్నిసార్లు ప్రకంపనలు సృష్టిస్తుంది, కొన్నిసార్లు అగ్నిపర్వతాలై పేలుతుంది, కొన్నిసార్లు తన బంధువులతో చేరి ప్రళయాలని పుట్టిస్తుంది.
దారి తప్పిన తమ్ముడిని హెచ్చరిస్తూ ఉంటుంది. అయినా వాడు మారట్లేదు. తప్పులు మానట్లేదు...
తమ్ముడూ... ఓ మారని మానవ తమ్ముడూ... మీకే ఇది...
మమ్మల్ని మాలాగ బతకనివ్వండి... అప్పుడు మిమ్మల్ని మీలాగ బతకనిస్తాం.
ఎన్ని యుగాలైనా అమ్మ శాశ్వతం ఇక్కడ. మనము పుడుతూ ఉంటాము, పోతూ ఉంటాము. తను మాత్రం నాన్నను అంటిపెట్టుకుని తిరుగుతూ ఉంటుంది.
ఇదే మా విచిత్ర కుటుంబ కథ.
ధన్యవాదాలు,
వశిష్ఠ 🖋
Comments
Post a Comment