జన్మాష్టమి - Story 1

  జన్మాష్టమి - Story 1


* This story was not true. Partly real & partly Fictional.

వివాహమయ్యి పుట్టినింటిని వీడి మెట్టినింటికి పయనమయ్యే ఏ ఆడపిల్ల అయినా తండ్రి,తల్లి,తోబుట్టువులకి దూరమవుతున్నామని దుఃఖ పడతారు..దేవకి కూడా అలానే దిగులు పడుతుంది. ఎందుకంటే తనకి వ్రిష్ని రాజ్యానికి  రాజు అయిన వసుదేవునితో వివాహం చేయదలచారు.. చెల్లెలి దిగులు గురించి తెలుసుకున్న అన్న కంసుడు దేవకి వద్దకి వచ్చి వసుదేవుని గురించి గొప్పలు చెప్పడం ఆరంభించాడు. వసుదేవుని శూరత్వం, చదరంగంలో విశిష్ట ప్రావీన్యత వంటివి  చెల్లెలికి చెప్తూ తనే స్వయంగా వసుదేవునిని చదరంగంలో ఓడించలేకపోయానని చెప్పి చెల్లెలు తన మాట వినకపోయేసరికి వెళ్ళిపోయాడు. వసుదేవుని గురించి వీసమెత్తు కూడా ఆలోచించని దేవకి అహంభావి అయిన తన సోదరుడే అన్ని గొప్పలు చెప్పేటప్పటికి ఆలోచించడం మొదలుపెట్టింది. అనుంగు చెలికత్తెలు ఆ రాత్రివేళ దేవకికి వసుదేవుని అందచందాలలను గురించి చెప్పడం మొదలు పెట్టారు. ఆజానబాహుడు,అందగాడు,తెలివైనవాడు,అంత శరీర ధారుడ్యం కలిగిన వాడి కౌగిలిలో మీరు తాళగలరా తల్లి అని కవ్వించసాగారు.పరాయి మగవారి గురించి అలా మాట్లాడటానికి సిగ్గు లేకపోతే సరి అని వాళ్ళని కోప్పడుతూ తను నిద్రకి ఉపక్రమించింది.

తెల్లవారి నిద్ర లేవగానే ఒక ఆలోచన చేసి చెలికత్తెతో ఆ విషయాన్ని తన అన్నకి కబురు పంపింది.మధ్యాహ్నవేళకి కంసుడు దేవకి మందిరంలో అడుగు పెడుతూనే వాహ్.. మధురకి యువరాణివి,క్రూరసేనుడి కుమార్తేవని, ఈ కంసునికి సోదరివి అనిపించావు దేవకీ .. చూపించినవాడిని తలవంచి పెళ్ళి చేసుకోకుండా ఈ   పోటీ ని అడిగావు.. నేను సిద్ధం అని అన్నాడు..పందెం ఏంటి అంటే... దేవకి వసుదేవునితో చదరంగమాడటం కుదరదు కనుక..తన అన్న అయిన కంసునితో ఆడి...ఒకవేళ కంసుడు గెలిస్తే వివాహం చేసుకుంటానని, తానుగెలిస్తే చేసుకోనని షరతు పెట్టింది. ఒక ఆడపిల్ల అంత సామాన్యంగా ఒప్పుకోదు కదా!!పైగా తను యువరాణి.

అన్నాచెల్లెళ్ళు బంగారపు చదరంగ పటం ముందు ఆటకి కూర్చున్నారు. రాజు గారికి కబురు వెళ్ళింది. ఆయన కూడ తన కొడుకు,కూతురి ఆటని చూడాలని ఉత్సాహంతో వచ్చి కూర్చున్నారు. ఇరువురి సైన్యానికి పేర్లు ఉండాలని తనది మధుర అని, చెల్లలని వేరే పేరు ఏమైన  ఎంచుకోమని కోరగ...అక్కడ ఉన్న అందరూ దేవకి ఏ రాజ్యాన్ని ఎంచుకుంటదా!! అని ఎదురు చూడసాగారు. తన అన్న తన నుండి ఏం ఆశిస్తున్నాడో తను గ్రహించకపోలేదు. ఏమి ఎరుగని దానిలా నాకు మధుర కావాలని పట్టుబట్టి మరీ మధుర తీసుకుంది. కంసుడు చెల్లెలు అడిగిన తర్వాత చెసేదేమి లేక వసుదేవుని రాజ్యమైన వ్రిషిని రాజ్యాన్ని ఎంచుకున్నాడు. చెలికత్తెలు,రాజ పరివారం, రాజు గారు ఫళ్ళున నవ్వారు..వారి వైపు చూసి ఒక ఉరుము ఉరిమింది. నిశబ్దం.. ఆట మొదలయ్యింది. దేవకి మధురవి నల్లపావులు, కంసుని వ్రిష్ని రాజ్యానివి తెల్ల  పావులు.

ఆట నిదానంగా మొదలయ్యి ఎత్తులు, పైఎత్తులు,తప్పొప్పులతో గంటలకోద్దీ రసవత్తరంగా సాగుతుంది. ఇరు సైన్యాలు సమాన స్థాయిలోనే పోరాడుతున్నాయి, భటులు,ఏనుగులు,గుర్రాలు,శకటాలు ఒకదాని తర్వాత ఒకటి పడిపోతున్నాయి.రసవత్తరంగా సాగుతుంది. తన రాజుని జరుపుతుండగా కంసుని బొటని వేలికి గాయమయ్యి బయటకి రక్తప్రసరణ అవుతుంది.పటం అంతా రక్తపు చుక్కల మయం అయ్యింది. రక్తార్పణం అయినట్టు వ్రిష్ని రాజ్యపు తెల్ల పావులు కంసుని గాయం వలన ఎర్రగా మారాయి.  అయినా ఆట ఆపలేదు..అప్రహితంగా సాగుతూనే ఉంది. అంత లీనమయ్యారు ఇద్దరు.అసలు ఆట ఎందుకు ఆడుతున్నారో కూడా మరచిపోయి ఇద్దరూ గెలుపు కోసం రెండు సైన్యాలు చంపుకుంటున్నాయి.   ఎవరూ కన్నార్పట్లేదు. ఆట తెలియని వాళ్ళు కునిపాట్లు  పడుతున్నారు. ఆట ఆఖరి అంకానికి చేరుకుంది. ఇద్దరికి సమానావకాశాలే ఉన్నాయి. దేవకి వేసిన ఎత్తుకి కంసుడు వేసిన పైఎత్తు వల్ల ఇద్దరూ చిక్కుల్లో పడ్డారు...కానీ దేవకి గ్రహించలేకపొయింది. కంసుడు మెల్లగా నవ్వాడు. తన అన్న నవ్వులో ఎదో ఉందని గ్రహించి పటాన్ని తీక్షణంగా చూసి వేయాల్సిన ఎత్తు పట్టేసింది.  ఆనందంతో ఎత్తు వేయడానికి సిద్ధపడి పావుని కదపబోతుండగా "వ్రిష్ని రాజు అయిన వసుదేవుడిని చంపేస్తావా సోదరీ?" అన్న కంసుని మాటలు విన్న దేవకి పావుని పట్టుకోబోతు ఆగిపోయింది.చుట్టూ అంత మంది ఉన్నా కూడా తన శ్వాస తనకే వినపడుతోంది. లేదు తను చంపలేదు. తన వల్ల అవ్వదు.ఎందుకు? ఇంక నేను ఆటని కొనసాగించను అని చెప్పి లేవబోతుండగా అలా మధ్యలో వెళ్ళిపోవడం రాజ వంశీకుల లక్షణం కాదని అనుకుని వేరే పావుని కదపగా కంసుడు తన చెల్లెలి రాజ్యమైన  మధురా రాజుని చంపి ఆట గెలిచాడు. అలా ఆట అవ్వకముందే దేవకి వసుదేవునిపై ఇష్టాన్ని తెలుపుతూ పెళ్ళికి  అంగీకరించి సిగ్గుతో లోపలి మందిరంలోనికి వెళ్ళిపోయింది.తనని చెలికత్తెలు వెంబడించారు. కంసుడు తానెందుకు వ్రిష్ని రాజ్యాన్ని ఎంచుకున్నాడో అర్ధం చేసుకున్న క్రూరసేన రాజు తన కొడుకు యుక్తికి గర్వపడుతూ తన కూతురు వివాహానికి అంగీకరించినందుకు ఆనందంతో అక్కడినుండి వెళ్ళిపోయాడు.తన తెలివికి తానే ఆనందపడి కంసుడూ కూడా నిష్క్రమించాడు. అన్నాచెల్లెళ్ళ ఆటని చూసిన అందరూ ఇరువురి తెలివితేటలని చూసి ఆనందపడ్డారు. 

ఇలా అందరూ ఆనంద సంతోషాలలో ఉండగా ఒక్కరు మాత్రం ధీర్ఘంగా ఆలోచనలో పడ్డారు. ఆ వ్యక్తికి ఏదో కీడు సంకిచింది. ఆయనే మహా మంత్రి.కంసునికి గాయమవ్వడం, చదరంగ పటం రక్తసిక్తమవడం,ఆయన దీన్ని ఆటలా చూడలేదు నిజంగా యుధ్ధంలానే చూశాడు. మధుర రాజుకి వ్రిష్నిరాజుని చంపే అవకాశం ఉన్నా చంపక తనే ప్రాణాన్ని కోల్పోవడం ఏ ఆపద వస్తుందో అని భయపడ్డాడు.ఈ విషయాన్ని రాజు వద్ద  ప్రస్తావించగా వ్రిష్ని రాజుచేతిలో మధుర రాజు ఒడిపోవడం మంత్రికి నచ్చలేదేమో అని అనుకుని పట్టించుకోలేదు. 


వివాహ మహోత్సవం

ఉగ్రసేన మహారాజు, కంసుని ఆతిధ్యాన మథురానగరాన ఒక సుముహుర్తాన దేవకీవసుదేవుల వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. తెలియనిదేమిటి అంటే అదే ముహూర్తానికి దేవకీవసుదేవులు, కష్టాలు ఒకటయ్యాయి అని.

ఈసారి నారదమహర్షి వేషం మార్చి అశరీరవాణి రూపంలో కంస సంహారం గురించి పలకగా కోపోద్రిక్తుడు అయిన కంసుడు తన చెల్లెలిని, ఆమె భర్త ని వదింపతలచినా విధిని మార్చలేడు కదా!! కంసునికి జరిగిన చదరంగం ఆట గుర్తొచ్చింది. తనే తన శత్రువుని ఎదురు వెళ్ళి మరీ ఆహ్వానించాడా!! అని కోపంతో ఊగిపోయాడు.


దేవకీవసుదేవులకి కారాగారమే అంతఃపురం అయ్యింది. దేవకి ముందు కోరుకున్నట్టే ఇప్పుడు పుట్టింటిలో ఉండిపోయింది. కానీ కారాగారంలో!!!

రోజులు గడుస్తూనే ఉన్నాయి...పుట్టే వాళ్ళు పుడుతున్నారు, గిట్టే వాళ్ళు గిడుతున్నారు.

వాళ్ళు పెట్టే ఆహారం సరిపోక వసుదేవుడు భటులచే రహస్యంగా ఫల వృక్షాల విత్తనాలు తెప్పించుకుని వెలుతురు పడే చోట వాటిని నాటి వచ్చిన పళ్ళను భార్యకి పెడుతున్నాడు.

దేవకి మొదటిసారి గర్భం దాల్చింది. పంచభూతాలలో ఒకటైన వాయువు, గుణాలలో ఒకటైన కామము కలిసి మొదటి శిశువుగా ఉదా రంగులో జన్మించింది. కంసునిచే కిరాతకంగా బండరాతికి బాది మరణించింది.

రెండవసారి ఆకాశం, క్రోద గుణం కలిసి రెండవ శిశువుగా  ఒకలాంటి నీలము రంగులో పుట్టి గిట్టింది.

మూడవ బిడ్డ నీరు, మదము కలిసి నీలం రంగులో,

నాల్గవ బిడ్డ భూమి, మోహం  కలిసి పచ్చ రంగులో,

ఐదవ బిడ్డ అగ్ని, మాత్సర్య(ఈర్ష్య) గుణం కలిసి ఎర్రని రంగులో,

ఆరవ బిడ్డగా కాలము, లోభము కలిసి శిశువు పసుపు రంగులో పుట్టిన మరుక్షణమే చావడానికి జన్మించారు. చంపబడ్డారు!!!

అన్నిసార్లు వసుదేవుడే పురుడుపోశాడు.

ఏడవ బిడ్డగా ఆదిశేషుడు అరుణ వర్ణంలో దేవకి గర్భం నుండి రోహిని గర్భంలోనికి మార్చివేయబడ్డాడు.

ఆదిశేషుడు వచ్చేసాడు.  కామ క్రోద లోభ  మద మోహ మాత్సర్య గుణాలన్ని చంపబడ్డాయి. తాను పుట్టక ముందే ఆ గుణాలన్నిటిని హరించడం(జయించడం) వలన దేవకీసుతుడు వాటికి అతీతుడు.

ఇక మిగిలింది అచ్యుతుని అవతరణమే.

అవతరణం -  The Incarnation

మాఘ మాసాన దేవకి గర్భాన మధుసూదనుడు జీవం పోసుకున్నాడు. నెలల లెక్క కోసం దేవకి సంఖ్యని బట్టి ఒక్కొక్క కాలి వేలి గోరుని పెంచుతుంది.నెల గడిచిన తర్వాత ఆ గోరుని తీసి జాగ్రత్తగా దాచి పెడుతుంది.అలా ఇప్పటివరకు ఏడూ గర్భాలకి గాను 56 గోర్లని దాచింది. బలరాముడు ఐదవనెలలోనే గర్భవిచ్చిన్నమయ్యాడు కదా!! 

దేవకి ఎనిదవసారి గర్భం దాల్చిన విషయం కంసునికి తెలిసింది. అహంకారికి భయంవేయదు కదా!! పుట్టిన వెంటనే కడాతేర్చి శత్రుశేషం లేకుండా చేసుకుంటాను అని బీరాలు పలుకుతున్నాడు. 

పక్షులు,పశువులు ఇత్యాది జీవాలు అన్ని మధురని వీడీ వెళ్ళిపోతున్నాయి. చావిడీలో కట్టి ఉన్నవి కూడా తెంపుకుని వెళ్ళిపోతున్నాయి.

చూస్తూఉండగానే ఏడు నెలలు గడిచిపోయాయి.భాద్రపద మాసమొచ్చేసింది.ఎనిదవనెలల గర్భవతి తను. ఎనిమిదవ నెల మొదలవ్వగానే దేవకీవసుదేవులకి ఆహారంలేకపోతే బిడ్డకి చావే గతి అని తలచి కంసుడు ఆహారం పెట్టడం ఆపేసాడు. 

మాదవుడిని ఎప్పుడెప్పుడు చూద్దామా అని భూమి వేగంగా తిరుగుతుంది. శుక్ల పక్షమైపోయింది. తదుపరి పక్షం మొదలయ్యింది. పాడ్యమి,విధియ,తధియ.....అష్టమి రోజు వచ్చింది.

తిండి లేకపోవడం వల్ల దేవకి సృహలో ఉందా లేదా అన్నట్టుగా ఉంది. సాయంకాల సమయం..చల్లనిగాలి మొదలయ్యింది.సుమారు 7 గంటలు అవుతున్నా ఇంకా చీకటి పడలేదు. 8 అవుతున్నా అదే తీరు.. తన పిల్లలని కోల్పోయినా కన్నీరు పెట్టని వసుదేవుడు బార్య అవస్థలు చూడలేక మొదటి సారి భాదతో, ఈ అష్టమ శిశువు జననంతో తమ కష్టాలు తీరుతాయి అని కన్నీరు పెట్టాడు. సరిగ్గా ఆరు చుక్కలు నేలరాలగా ఒక్కసారిగా ప్రకాశవంతమైన వెలుగు వచ్చి వెనువెంటనే చీకట్లు కమ్మేసాయి,భయంకరమైన గాలి మొదలయ్యింది. ఆ ధాటికి పళ్ళ చెట్ట్లు నేలకూలాయి. దేవకి సైగ చేయగా వసుదేవుడు 63 దేవకి గోర్లని చిన్న మూట కట్టి తన నడుముకి కట్టుకున్నాడు. గాలి ఇంకా ఇంకా ఇంకా ఇంకా ఇంకా పెరిగిపోతూనే ఉంది. వసుదేవుడు ఆ గాలికి వెళ్ళి చెరసాల గోడలకి తగులుతున్నాడు. ఎంత బలమైన గాలి అంటే వసుదేవుడు కాలు కింద మోపలేనంత గాలి ఆ చెరసాలలో అటూ ఇటూ ఎగిరిపోతున్నాడు.ఒక్కసారిగా గాలి ఆగిపోగా 20 అడుగుల పైనుండి పడి మూర్ఛపోయాడు. చైతన్యని తనలో కలిగిన దేవకి మాత్రం నిబ్బరంగా అలానే అచేతనంగా పడి ఉంది. మధుర అంతా మాయ కమ్మేసింది. ఆదిశేషుడు తన సహజమైన పాము రూపం దాల్చి ఆ చెరసాలలోనికి వచ్చి దేవకి కాళ్ళని పెనవేసుకున్నాడు. పెనవేసుకుని దేవకితో పాటు గాలిలో పైకి పాకడం మొదలుపెట్టాడు. ఆసాంతం పైకి చేరిన ఆదిశేషుడు ఆగి కిందకి చూడగా దేవకి తల క్రిందులగా వేలాడూతుంది. గది పైన ఉన్న ఆదిశేషుడు ఆమె కాళ్ళని పెనవేసి ఒకదాని నుండి వేరొకటిని దూరం చేసాడు. ఆమె వివస్త్ర అయ్యింది. చేతులను జాపినట్టుగా ఆమె కాళ్ళని ఆదిశేషుడు జాపాడు. ఆమె వివస్త్రగా,తల క్రిందులుగా, కాళ్ళు దూరంగా చేయబడి ఆదిశేషుడినే తాడుగ చేసుకుని వేలాడుతుంది. ఆమె స్పృహలో లేదు. మబ్బులు వీడి ఆమె మీద చంద్రకిరణాలు పడుతుండగా ఆమె మర్మస్థలంలోనుండి బాలుడు మెల్లమెల్లగా పైకి వస్తున్నాడు. ప్రకృతి విళయంగా స్వాగతం చెప్తుంది.మళ్ళీ కారు మబ్బులు కమ్మేసాయి. సాంతము బయటకి వచ్చిన గోపాలుడు ఆమె మర్మ స్థలం పైనే కళ్ళు మూసుకుని నిల్చుని ఉన్నాడు. తన అన్నలు ఒక్కొక్కరూ ఇంద్రదనస్సులోని ఒక్కో రంగులో పుట్టగా గోవర్ధనధారి మాత్రం కారు మబ్బు రంగులో అవతరించాడు.

ఆ సమయానికే వసుదేవుడికి స్పృహలోనికి వచ్చాడు. చుట్టూ అంతా చీకటి. ఏమి కనిపించట్లేదు.చిమ్మ చీకటిగా ఉంది. దేవకి అని పిలిచాడు. ఏం సమాదానం రాలేదు. మళ్ళీ పిలిచాడు..నిశబ్దం. ఆ చీకట్లోనే దేవకిని వెతుకుదామని పాకుతూ గది అంతా వెతికినా ఎక్కడా దేవకి జాడ తెలియలేదు.ఈసారి భాద,భయంతో దేవకి అని గట్టిగా అరిచాడు. ఎందుకు నాన్న అలా అరుస్తారు? అమ్మ నిద్రపోతుంది అన్న సమాదానం మదురమైన స్వరంలో తిరిగి వచ్చింది.ఎంత తియ్యగా ఉందా ఆ స్వరం. వసుదేవునికి ఏం అర్దం కాలేదు. ఎవరిదా స్వరం? నాన్న అని పిలిచాడు అంటే తన అష్టమ సంతానమా? అని అనుకుంటూ ఉండగా మళ్ళీ ఇంకోసారి "నాన్న" అన్న మాట వినపడింది. వసుదేవుని ఆనందానికి అంతులేదు. ఆరుగురు పిల్లల్లు కలిగినా తండ్రి యోగం మాత్రం కలగలేదు. నాన్న అనే పిలుపు వినగానే ఇన్ని రోజులు పడిన బాధలన్ని మర్చిపోయాడు. ఎక్కడున్నావయ్య కన్నయ్య? నేను వస్తున్నాను అని వసుదేవుడు అనగా నా అనుకున్న వాళ్ళ దగ్గరకి నేనే వస్తాను నాన్న అని చెప్పాడు. ఆ స్వరం వినిపించిన వైపు తిరిగి చూడగా చిన్ని కృష్ణుడు మొట్టమొదటిసారిగా కళ్ళు తెరిచాడు. ఆ చిమ్మ చీకట్లో ఆ కళ్ళు ఒకటి సూర్యుని వలె,ఇంకొకటి చంద్రునివలే మెరుస్తున్నాయి. ఆ కళ్ళు తప్ప అ గదిలో ఇంక ఏం కనిపించట్లేదు. చంటిపిల్లాడు అంత ఎత్తులో ఎందుకు ఉన్నాడో అర్ధంకాలేదు. ఒక్కసారిగా పెద్ద మెరుపు వచ్చింది. ఒక్కసారిగా వసుదేవుడు నిస్తేజం చెందాడు.వెన్నులో వణుకు పుట్టి స్వేదం చిందింది.ఎంటి తను చూసింది?? మళ్ళీ మెరుపు వచ్చింది.ఈసారి వెలుగు ఎక్కువసేపు నిలబడింది. గుండె చేతిలోకి వచ్చినట్టు అయ్యింది. ఆదిశేషుడు తాడూలాగ మారి తన దేవకి తలక్రిందులుగా భయంకరంగా వేలాదుతూ ఉండగా ఆమె మర్మస్థలం పైన నల్ల మేఘం రంగులో చిన్ని కృష్ణుడు మురళి వాయిస్తూ నాట్యం చేస్తున్నాడు. భయంకరంగా ఉందా దృశ్యం!! గోవిందుడు నాట్యాము ఆపి తన తల్లి కాలి పైన పైకి పాకడం ప్రారంబించాడు. వసుడికి ఇంకా భయం పెరిగింది. పాకుతూ పైకి వెళ్లిన యదునందనుడు దేవకి కాలికి ఉన్న గోరుని తన పంటితో తీసి కింద ఉన్న వసుదేవునికి ఇచ్చి మొత్తం 64 అని అన్నాడు.

చేయవలసిన తక్షణ కర్తవ్యం తెలిపాడు. ఆదిశేషుడు తన కుబుసం విడువగా ఆ కుబుసంలో మురారిని చుట్టి వసుదేవుడు యశోదానందుల వద్దకి పయనమయ్యాడు.చెరసాల ద్వారబంధనముగ ఉన్న తలుపుని కాలితో తన్నగా ఆ ఊచలు ఆరు ఊడి పడ్డాయి. వసుదేవుడు ముందుకు నడూస్తూ ఉండగా ఊడిన ఒక్కొక్క ఊచ వసుదేవుని చుట్టూ చేరి పహారా కాస్తున్నట్టుగా అంగరక్షకులుగా వేంట నడవసాగాయి. వసుదేవుడు అడుగువేస్తున్న ప్రతీసారి అతని కాలికి ఉన్న బంగారపు గండపిండేరం, చుట్టూ ఉన్న ఇనుప ఊచలు ఘల్ ఘల్ ఘల్ అని శబ్దం చేస్తున్నాయి. 

అలా కోటలోనుండి బయటపడిన వసుదేవుడు యమునా నది వైపు నడవసాగాడు. ద్వారకానాధుడు కోట బయటికి రాగానే ఈదురు గాలులు వీయనారంభించాయి. పెద్ద పెద్ద చెట్ట్లు సైతం నల్లనయ్యని ముద్దాడ తలచి ఈదురుగాలుల సహాయం తీసుకుని చిటారు కొమ్మ సైతం భూమిని తాకేలా భయంకరంగా ఊగుతున్నాయి. యమునానది ఒడ్డుకి చేరుకున్నారు. యమున ప్రళయ గంగలా భయంకరంగా ప్రవహిస్తుంది. వరదని సైతం లెక్క చేయక వసుదేవుడు యమునానది ఒడ్డుకి చేరుకున్నారు. యమున ప్రళయ గంగలా భయంకరంగా ప్రవహిస్తుంది. వరదని సైతం లెక్క చేయక వసుదేవుడు యమునలోపలికి నడవసాగాడు. యమున నీరు ఆ ఊచలకి తాకగా ఒక్కొక్క ఊచ చనిపోయిన ఒక్కొక్క కొడుకుగా మారాయి. అలా తన ఆరుగురి కొడుకులు తన చుట్టూ చేరి నడవగా వసుదేవుడు తన ఆష్టమ సంతానాన్ని ఎత్తుకుని ముందుకు సాగుతున్నాడు. నడిచే కొలది నీటి మట్టం పెరుగుతూ పోతుంది. పాదాలు,మోకాళ్ళు అతర్వాత నడుము అలా అలా పైపైకి పెరుగుతూ వస్తుంది. ఇంకొక ప్రక్క వాన మొదలయ్యింది.నీటి మట్టం చాతిని దాటి మెడవరకు వచ్చేసాయి. వసుదేవుడు బిడ్డను తలపైన పెట్టుకుని సాగుతున్నాడు. యమున కూడా వెన్నదొంగని చూడాలని,తాకాలని ఎగసి ఎగసి పడుతుంది. వాన కాస్తా కుండపోతగా మారింది. పిల్లలు తడిచిపోతున్నారు. ఒక్కసారిగా ఆదిశేషుడు యమునని చీల్చుకుంటూ వచ్చి తన పడగను విప్పి గొడుగుగా పట్టాడు.కన్నయ్యని తాకిన ప్రతీ వాన చినుకు తర్వాత కాలంలో పదహారు వేల గోపికలుగా జన్మించారు. యమున పాండురంగడుని తాకిన యమున వెంటనే రెండుగా విడిపోయి దారి ఇచ్చింది. ఒకపక్క వర్షం,ఇంకో ప్రక్క చంద్ర కాంతి పడి అర్ధరాత్రి వేళ ఆకాశంలో ఇంద్ర ధనస్సు(చంద్ర ధనస్సు) విరిసింది. ఒడ్డుకి చేరగానే ఆరుగురు కొడుకులు అంతర్ధానమయ్యారు. గోళ్ళను లక్ష్మీదేవిలా చూస్తారు.అందుకే దేవకి గోళ్ళని పోగు చేసి తన కొడుకుకి ఇవ్వాలని అనుకుంది. అలా దేవకి లక్ష్మీదేవిని, విష్ణుమూర్తిని కలిపింది.వసుదేవుడు వాసుదేవునితో నందుని రాజ్యానికి వెళ్ళిపోయాడు.

సమాప్తం...

To Krishna from Vamsikrishna

Thanks for reading.......

Vamsikrishna Bazaru.


Comments

  1. కృష్ణం వందే జగద్గురుమ్ __/\__

    ReplyDelete
    Replies
    1. పరమానంద కృష్ణం వందే జగద్గురుం😍

      Delete
  2. Great one Vamsi..meticulous and subjective..loved your perspective..keep them coming.!👍🏼😊

    ReplyDelete
  3. Really a good writing style😍loved it vamsi

    ReplyDelete
  4. Really a good writing style😍loved it vamsi

    ReplyDelete

Post a Comment

Popular Posts