ముఖ్యపాత్రలో శ్రీదేవి - Episode 2
Location: Benz Circle
కలకత్తా హైవే,బందర్ రోడ్డు రహదారులు కలిసే చోటు. ఒకప్పుడు అక్కడ రోడ్డు ప్రక్కనే ఉన్న బెంజ్ కంపెనీ వల్ల దానికి ఆ పేరు.
పక్కవాడి పేరు కొట్టేసి పైకి వచ్చినా బెంజ్ సర్కిల్ అంటే ఎవరికి ద్వేషం లేదు.
ఆ సర్కిల్లో పగలు,రాత్రి,ఎండావాన,దుమ్ము,ధూళి,ధ్వని అన్నిటికి ఒకేలా స్పందించే ఒక పెద్దాయన విగ్రహం. చుట్టూ
పొల్ల్యూషన్ వల్ల ఆరోగ్యం పాడైపొతుంది అని ఆ పెద్దాయన్ని రోడ్డు విస్తరణ పేరు చెప్పి అక్కడి నుండి పంపేసారు. బెంజ్ కార్ లానే ఆ ఏరియా కూడా చాలా COSTLY. సెంటు దున్నితే లక్షలు పండేంత COSTLY. ఏవైపు వెళ్ళినా 100 అడుగుల్లో ఒక ఇంటర్ కాలేజ్ ఉంటుంది. గర్ల్స్ క్యాంపస్ లు కూడా ఉండటం వల్ల అమ్మాయిలు..వాళ్ళని చూడటానికి వచ్చే అబ్బాయిలతో ఈనాడు నుండి కాంధారి వరకు రోడ్డు అంతా బర్డ్స్ శాంగ్చూరిలా (Sanctuary) ఉంటుంది.
కొన్నేళ్ళ క్రితం Time 0750
రెండవ శనివారం,నిన్న సోమవారం పండుగ శెలవు అవ్వడం వల్ల క్రాంతి మిథునని చూసి నాలుగు రోజులయ్యింది. మిథున వాళ్ళ ఊరి బస్సులో వస్తుంది. బస్సు ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తున్నాడు క్రాంతి. ఒకవైపు ఆకలి ఇంకా భయంకరంగా వేస్తుంది. తెలిసిన వాళ్ళు కళ్ళతో పలకరిస్తూ నవ్వుతున్నారు,తిరిగి నవ్వుతున్నాడు ఆశగా సిగ్నల్ కి అవతల వైపు ఆగిఉన్న బస్సులని చూస్తున్నాడు.
ఒకటి..రెండు..సిగ్నల్స్ పడ్డాయి తన బస్సు మాత్రం రాలేదు. దిగులు పెరుగుతోంది. ఒక్కసారిగా పెద్ద శబ్దం....
యాక్సిడెంట్...ఒక పెద్దాయన్ని కాలేజ్ బస్సు గుద్దేసింది. ప్రమాదమేమి లేదన్నారు.బస్సు వెళ్ళిపోతుందేమో అని చూడటానికి కూడా వెళ్ళలేదు.అన్ని వైపులా ట్రాఫిక్ ఆగిపోయింది. కొంచెం సేపటికి వాహనాలు పెళ్ళికూతురులా నెమ్మదిగా కదులుతున్నాయి.
ఒక్క క్షణం దీర్ఘశ్వాస విడిచి తల పైకెత్తి చూసేలోపు మిధున వాళ్ళ బస్సు వచ్చి ఆగింది. తను బస్సు దిగింది. దిగేటప్పుడు తను ఎవరిని వెతకలేదు. దిగి నడుచుకుంటూ క్రాంతి దగ్గరకి వచ్చి 500 రూపాయల నోటు ఇచ్చింది. క్రాంతి షాక్ అయ్యాడు. ప్రతీనెలా ఒకటో తారీఖున వందే ఇస్తుంది..ఈసారి 500 ఇచ్చేసరికి ఏం మాట్లాడాలో తెలియట్లేదు. ఈరోజు నా పుట్టిన రోజు అని నవ్వింది. ఆశీర్వదించాలని ఉన్నా యాచకుడు దీవెనలు చిన్నపిల్లకి ఎందుకులే అని ఆగిపోయాడు...
ఎందుకు ఇస్తుందో, ఎప్పుడు నుండి ఇస్తుందో గుర్తులేదు కానీ ఇలానే తన దగ్గర మిగిలిన డబ్బులు,చిల్లర అంతా క్రాంతి కి ఇస్తుంది. క్రాంతి అసలు పేరు క్రాంతిలాల్. అదే బెంజ్ సర్కిల్లో యాచిస్తూ ఉంటాడు. పేరులోనే క్రాంతి..జీవితంలో కాదు...
ప్రతీ వ్యక్తికి ఒక గతం ఉంటుంది. అదే వ్యక్తిగతం. మనం పుట్టిన మరుసటి క్షణం నుండి మొదలయ్యి మనం చనిపోయేవరకు మన గతం ఉంటుంది. క్రాంతికి గతం ఉంది..కానీ పెద్దగా గుర్తులేదు.
క్రాంతి గతం...
బుందేల్ ఖండ్...పదైదు నదులున్న ఉత్తర్ ప్రదేశ్ లో కరువుకి కరువు రాని ప్రాంతం.తాగడానికి నీళ్ళులేక , బాలింతలకి పాలు రాక పసికందులు,పశువులు,పండు ముదసలి వాళ్ళతో ఊరే ఈశాన్య భూమిగా మారింది. కాల్చడానికి కట్టే లేదు,కొట్టడానికి చెట్టు లేదు. గుంత తవ్వి పూడుస్తున్నారు. తల్లులు భాదతో ఆ సమాధులని, తండ్రులు వాన పడి అ సమాదులపైన మొక్క మొలుస్తుందేమో అని చూస్తున్నారు.
వారణాసి విడిచి నైరుతిన నడిచి పరమశివుడు ఇక్కడే ఈ బుందేల్ ఖండ్ లో
విలయ నృత్యం చేస్తున్నాడు.
వింత ఏమిటంటే కరువుకి పంట పొలాల్లో మొక్క మొలవకపోయినా గంజాయి మాత్రం తెగ దొరికేస్తుంది. కొన్ని ఊళ్ళళ్ళో తిండి లేక ఆడ,మగ గంజాయి కొట్టి ఆకలి తీర్చుకుంటున్నారు. వానొస్తే నదులూ కొలనులు నిండుతాయి..లేకుంటే ఆకలికి కడుపులు ఎండుతాయి కదా!! పోయేవాళ్ళు పోతూనేఉన్నారు, పుట్టేవాళ్ళు పుడుతూనే ఉన్నారు. అది మాత్రం ఆగట్లేదు.కరువు దేశానికే కానీ దేహానికి కాదు అన్నట్టు జనాభా పెరుగుతుంది. జనాభాతో పాటు భారం కూడా!!! ప్రగతికి వ్యతిరేకం ఈ మినీ ఫాక్టరీలు(కుటుంబాలు) అన్నాడో వ్యక్తి. అలా ఒక ఫాక్టరీలలో పుట్టినవాడే క్రాంతిలాల్.వీళ్ళ పూర్వీకులు బుందేల్ ఖండ్ సైన్యంలో పనిచేసేవారు.వయసొస్తే తండ్రికి తోడుగా డబ్బులు సంపాదిస్తే కష్టాలు తీరుతాయి అని ఆలొచించే అమాయకులు. అంత మందిని ఎలా పోషిస్తారు అంటే? నారు వేసినవాడు నీరు పోయడా? అన్నిటికి దేవుడు ఉన్నాడు అని అంటారు!! అసలు ఇక్కడ విత్తనాలు జల్లి నాటు వేసింది ఎవరు?
ఇక్కడే ఉంటే తన ఏడుగురి సంతానానికి తిండి పెట్టలేనని తట్టబుట్టా సర్దుకుని లఖ్ నవ్ వలస వెళ్ళాడు క్రాంతి తండ్రి. క్రాంతి,తన చిన్న చెల్లి, ఇద్దరు అన్నలు మాత్రం గయ దగ్గర తమ అమ్మమ్మవాళ్ళ ఊరు వెళ్ళారు. ఐదవ తరగతి వరకు చదువుకున్నాడు.అక్కడే మిఠాయి చేయడం కూడా నేర్చుకున్నాడు. తర్వాత భవన నిర్మాణ కూలీగా మారి క్రాంతి మరోసారి దక్షిణభారత దేశానికి...తన ఇద్దరి అన్నలు,చెల్లెలితో బెజవాడకి వలస వచ్చాడు.
ముందు కష్టాలు పడ్డారు...అవి పోవడానికి కష్టపడ్డారు..
శ్రీదేవి చిత్రసీమలోకి వచ్చిన సమయంలో వీళ్ళ జీవితాల్లోకి శ్రీదేవి రావడం మొదలయ్యింది.
వీళ్ళతో పని చేయించడం చాలా తేలిక. తక్కువ కూలీకే వస్తారు, నచ్చకపోతే వేరే చోట పనికి వెళ్లలేరు..బాష ఇబ్బందులు.. కావాల్సిందంతా రోటి, కపడా, మఖాన్, దారు(షరాబ్)..ఇవే వాళ్ల మౌలిక అవసరాలు.
డబ్బూ వస్తుంది,తెలుగు కూడా వస్తుంది. కృష్ణతో, కనకదుర్గతో అనుబంధం పెరిగింది. అక్కడే ఇంద్రకీలాద్రికి వెనుక వైపు ఒక ఇంట్లో బాడుగకి ఉంటున్నారు అన్నాచెల్లెళ్ళు.
ఖాళీ దొరికితే కృష్ణకి ఈతకి, తనతో పాటు తెచ్చుకున్న సత్తు ఖడ్గంతో సాదన చేస్తున్నాడు క్రాంతి. పనికి వెళ్లడం..రావడం..ఇల్లు,పని ఇదే...అంతకన్నా ఏం ఆశించట్లేదు..
ఒక వర్షాకాలం...తుఫాన్ అంటున్నారు..మూడు రోజుల్లో కావలి-కాకినాడ మధ్యలో తీరం దాటచ్చు అని వార్తల్లో చెప్పారంట..కొన్ని రోజులు పని లేనట్టే..ఇంట్లోనే ఉండచ్చు అనుకున్నాడు. వెళ్ళేటప్పుడు దినుసులు, సరుకులు తీసుకుని వెళ్ల్తూ ముసిరేసిన వాతావరణంలో కృష్ణని చూడటానికి వెళ్లారు.చాలా అందంగా ఉంది.. రాత్రి వాన మొదలయ్యింది..వాన కాస్తా జోరు వాన..వరుణ దేవుడికి వాయుదేవుడు తోడయ్యాడు ..పెను గాలి...పోటి పడి మరీ గేర్లు మార్చుతున్నారు ఇద్దరు.. తెల్లవారే వరకు కురుస్తూనే ఉంది..కొండ మీద ఇల్లు కదా!! కారిపోతూనేఉంది. వెళ్లిపోదాం అన్నా సరే ఆగట్లేదు.తలా ఒక మూల నక్కి కూర్చునారు. బయట తుఫాను కుమ్మేస్తుంది.
క్రాంతి అలానే కూర్చుని వర్షాన్ని చూస్తున్నాడు. వయసులో ఉన్నాడు..ఊరు వెళ్ళి పెళ్ళి చేసుకోవాలి...చిన్న మామ కూతురే ఉంది...ఏం చేస్తుందో అనుకుంటూ సిగ్గుపడుతున్నాడు.తన చేతికి గాయమయ్యిన విషయం కూడా తెలియకుండా మెలికెలు తిరిగిపోతున్నాడు. ఒక్కసారిగా ఇంటి పైకప్పు కూలి పడింది.తర్వాత ఏం జరిగిందో కూడా తెలీదు..గుర్తులేదు...అలా అలా అలా అలా తేరుకుని తేరుకుని ఏడు ఏళ్లయ్యాక తను మనిషిని అని తెలుసుకున్నాడు. తను మానసిక స్థితి సరిగ్గా లేని వాళ్లు ఉండే ఆసుపత్రిలో ఉన్నాడు. అర్ధమయ్యేలా చెప్పాలి అంటే పిచ్చాసుపత్రిలో ఉన్నాడు. పైకప్పు కూలి తల మీద పడి స్థిమితం కోల్పోయాడు. ట్రీట్ మెంట్ కి స్పందిస్తున్నాడు.అలా అలా ఊరు,పేరు,తన వాళ్ళు అన్ని గుర్తొస్తున్నాయి. పన్నెండేళ్లు పట్టింది మాములు మనిషి అవ్వడానికి.ప్రతి రోజు వ్యాయామం తప్పనిసరి. పౌష్టికాహారం తప్పనిసరి.. హిందీ పేపర్ వచ్చేది కేవలం క్రాంతి ఒక్కడి కోసం..భయానకమైన వార్తలు ఉంటే ఆ పేజీలు తీసేసేవారు ఆసుపత్రి వాళ్ళు.మాటలు కూడా సగం స్పష్టంగా వస్తున్నాయి. అతి కష్టం మీద తన తోబుట్టువులు ఆ రోజే చనిపోయారు అని నిపుణులు తెలిపారు.తను మతి స్థిమితం కోల్పోవడం,తన వాళ్ళు అదే సమయానికి చనిపోవడం వల్ల అతనికి అ విషాదం గుర్తులేదు.తట్టుకోలేకపోయాడు. కొన్ని నెలలు ఏడ్చాడు.
సైకియాట్రిస్ట్ లతో వివిధ దశల్లో పరీక్షలు చేయించి ఇంక బయటి ప్రపంచంలోకి వెళ్లడానికి అన్ని విధాలా అర్హుడు అని నిర్ధారించుకున్నారు. ఆసుపత్రి నుండి బయటకి పంపించే ఆరు నెలలు ముందు క్రాంతిని రీహాబిలిటేషన్ సెంటెర్ కి, జనాల్లో కలిసేలా చిన్న చిన్న సెషెన్స్ కి తీసుకువెళ్లేవారు.సైకియాట్రిస్ట్ సెషన్స్, పేపర్, కొన్ని పుస్తకాలు చదివిన తర్వాత క్రాంతి బుర్ర బాగా పని చేస్తుంది.వాళ్ళ ఊరికి ఉత్తరం రాయగా క్రాంతి పెద నాన్న కొడుకు నుండి జవాబు వచ్చింది. అతను తనతో పాటు తీసుకు వెళ్ళేలాగా ఏర్పాటులు జరుగుతున్నాయి. ప్రభుత్వాసుపత్రి అయినా ఆ డాక్టర్ కమలాకర రావు గారికి ముందు నుండి క్రాంతి అంటే గురి. అయన క్రాంతిని తిరిగి మనిషిగా మార్చడానికి విపరీతంగా కష్టపడ్డారు. ఈ మధ్యే అయన స్వర్గస్తులయ్యారు. అయన ఉండి ఉంటే ఒక పక్క ఆనందంగాను, క్రాంతి వెళ్ళిపోతున్నాడు అని ఇంకో వైపు బాధ పడుతూ ఉండేవారు. పోలీసుల నుండి, ఆసుపత్రి నుండి, సైకియాట్రిస్ట్ ల నుండి ఆఖరిసారిగా అనుమతులు వచ్చేసాయి. ఆధార్ కార్డ్ కూడా వచ్చేసింది. ఆసుపత్రి కార్డ్, పెద్ద డాక్టర్ తన వివరాలతో కార్డ్ ఇచ్చారు. అందరూ వచ్చి క్రాంతికి వీడ్కోలు చెప్పారు.
ఇంత జరిగినా క్రాంతి కొండపైన ఉన్న అమ్మవారిని మర్చిపోలేదు... తనకి బాగా ఇష్టమైన గుడికి వెళ్ళాలని అనుకున్నాడు..ఎవరు డిస్చార్జ్ అయినా స్టేషన్లో దింపే ప్రకాశం ఆటోలో వైజాగ్ రైల్వే స్టేషన్ కి బయలుదేరారు..కానీ వాళ్ళు రైల్వే స్టేషన్ వైపు వెళ్లలేదు...
************************************
రెండు రోజుల తర్వాత క్రాంతి ఒక్కడే విజయవాడ వచ్చాడు. కానీ దుర్గ గుడికి వెళ్లలేదు. సరాసరి వాళ్ళు ఇది వరకు ఉన్న ఇంటి దగ్గరకి వెళ్ళాలని నిశ్చయించుకున్నాడు. చాలా మారింది ఊరు 13 యేళ్ల క్రితం దానితో పోలిస్తే. ముందు కృష్ణకి వెళ్దాము అనుకుని అడుగు అటు పడినా వెళ్ళలేకపోయాడు. తన ఇంటి వైపు ప్రయాణమయ్యాడు.చూచాయగా చూసినట్టే ఉన్నాయి..లీలగా గుర్తున్నాయి.ఆ బస్తీ మాత్రం మారలేదు. ఇళ్ళకి రంగులు మారాయి అంతే!! తిన్నగా వాళ్ళు ఉన్న వీధిలోకి వెళ్ళాడు. ఏం మారలేదు. కొండపైనున్న ఇళ్ళు కదా!! వాళ్ళు ఇదివరకు ఉన్న ఇంటి స్థలంలో ఇంకో ఇల్లు కట్టారు.
సందు చివరి బడ్డీలో దమ్ము కొడుతూ ఉండగా ఒక కూలీల గుంపు వెళ్తూ కనిపించింది. వెంటనే వాళ్ల చిన్న మేస్త్రి గుర్తొచ్చాడు. ఇల్లు కూడా కొండ కిందే..పైగా సొంతిల్లు..దొరుకుతాడేమో అని ప్రయత్నిద్దాం అనుకున్నాడు. కానీ ఎంత ఆలోచించినా పేరు మాత్రం గుర్తు రావట్లేదు.నడుచుకుంటూ ఆ ఏరియాకి వచ్చాడు. రెండు వీధుల్లో ఏ వీధో తెలియక సతమతమవుతున్నాడు. పిల్లల్లు రోడ్డు మీదే ఆడుకుంటున్నారు. వాళ్లు టెలిఫోన్ డైరెక్టరీ లాంటోళ్ళు అడిగిన దాని కంటే ఎక్కువ సమాచారమే ఇస్తారు కదా!! ఒక పిల్లోడిని పిలిచి క్రాంతి మేస్త్రి మేస్త్రి అనె అంటున్నాడు కానీ పేరు తెలియక పూర్తి చేయలేకపోతున్నాడు..తడ బడుతున్నాడు...ఈలోపు ఆ పిల్లోడే సుబ్బయ్య మేస్త్రి ఇల్లు కావాలా అన్నాడు? క్రాంతికి అదే పేరు అనుకుంట అనిపించింది కానీ ఖచ్చితంగా చెప్పలేకపోతున్నాడు..ఈలోపు ఆ పిల్లోడు నేను చూపిస్తా అని చెయ్యి పట్టుకుని తీసుకుని వెళ్ళిపోతున్నాడు. తీసుకువెళ్లి ఇదే ఇల్లు అని ఒక ఇంటి ముందు ఆపి ఒరేయ్ ముసలి సుబ్బయ్య తాత అని కేక వేసి పారిపోయాడు. ఒక ముసలాయన తెల్లటి గడ్డంలో బయటకి వస్తూనే క్రాంతిని చూసి ఆగిపోయాడు.క్రాంతికి పోలికలు తెలుస్తున్నాయి. ఒక్క నిమిషం పాటు మౌనంగా చూస్తూ ఉండు చొక్కా వేసుకుని వస్తాను అని లోపలికి వెళ్ళి చొక్కా వెసుకుని వచ్చాడు.గొంతు కూడా తెలిసినదానిలానే ఉంది కానీ ఇంతకు మునుపు తెలుసేమో అన్నట్టే ఉంది కానీ ఖచ్చితంగా చెప్పలేకపోతున్నాడు.ఒకటి మాత్రం స్పష్టం..అతనికి క్రాంతి తెలుసు. బండి మీద ఇద్దరూ వెళ్తున్నారు. సుబ్బయ్య ఒక్క మాట కూడా మాట్లాడట్లేదు. చిన్న గుడి దగ్గర ఆగి ఆ అరుగు మీద కూర్చున్నారు...
సుబ్బయ్య మాట్లాడటం మొదలు పెట్టాడు...
సు.: ఎప్పుడు వచ్చావు?
క్రా.: ఇప్పుడే..
సు.: రాజమండ్రి నుండేనా?
క్రా.: కాదు! వైజాగ్ నుండి.
సు.: పద్నాలుగు యేళ్ళు అయిందా? పదమూడవ సంవత్సరాలే అయినట్టు ఉందే!!
క్రాంతికి అర్ధం అవ్వట్లేదు...
సుబ్బయ్య చెప్తూ పోతున్నాడు...
అందరూ నమ్మలేకపోయారు నువ్వు అలా చేసావు అని.. అప్పటివరకు చూసిన నువ్వేనా అని..అప్పుడూ అడగలేదు..ఇప్పుడూ అడగను..ఆ దుర్గాదేవి దేవెనలు ఉంటే చాలు.. జైలు తిండి బాగా వంటపట్టినట్టు ఉందిగా..పుష్టిగా తయారయ్యావు అని నవ్వాడు.
మతి పోయింది..నేను ఏంటి?? జైలు ఏంటి అని??
అదే అడిగాడు..ఆశ్చర్యంతో..క్రాంతి ఆశ్చర్యం చూసి సుబ్బయ్య కి ఇంకా ఆశ్చర్యమేసింది... నేను పిచ్చాశుపత్రి నుండి వస్తున్నాను...జైలేంటి అన్నాడు... అంటే అది నిజమేనా అన్నట్టు సుబ్బయ్య అడిగాడు. పిచ్చోడిలా నటిస్తున్నావు అన్నారు..మేము అదే అనుకున్నాము..
అసలేం జరిగింది అని అడగగా...సుబ్బయ్య నీళ్లు నములుతూ నమ్మకం కుదిరాక చిన్న గొంతుతో నువ్వు మీ అన్నాచెల్లెళ్లని చంపేసావని నిన్ను అరెస్ట్ చేసారు కదా!!
ఒక్కసారిగా భయంతో వణికిపోయాడు. ఏం అర్ధం అవ్వట్లేదు.మోడులా మొద్దు బారిపోయాడు. ఆ రాత్రి మధ్యలో ఆగిపోయిందనుకున్న తుఫాను మళ్లీ కుదిపేసినట్టు అయ్యింది. కృష్ణా నది లాగిపెట్టి కొట్టినట్టు ఉంది.పాతాళంలోకి పడిపోతున్నట్టుగా ఉంది.
ఆ రోజు జరిగింది ఏంటి అంటే...
తన తల మీద భవనం పెచ్చులు పడి మతి స్థిమితం కోల్పోయాడు... అదుపు తప్పిన వాడిలాగా ఆ పిచ్చిలో తన పక్కనే పడి ఉన్న ఖడ్గంతో తన తోబుట్టువులని తెగ నరికాడు.. పిచ్చిలో చేసాడు.తనకి తెలియకుండా చేసాడు
ఎందుకు పుట్టిందో మరి ఆ ఆలోచన...
తుఫాన్ తగ్గిన తర్వాత ఈ వార్త దావాలనంగా వ్యాపించింది.. పోలిసులు క్రాంతిని అరెస్ట్ చేసి కోర్ట్ లో హాజరు పరచగా యావజ్జీవ శిక్ష పడింది. తర్వాత మతి స్థిమితం లేదు అని గ్రహించి వైజాగ్ ఆసుపత్రికి పంపించారు.. ఈసారి నిరాశ,నిస్పృహ, అసహ్యం అన్నీ ఆవహించేసాయి.. సుబ్బయ్య చెప్తూనే పోతున్నాడు..లేచి సుబ్బయ్యని చూసి అలా నడుచుకుంటూ వెళ్లిపోతున్నాడు...అలా అలా నడుచుకుంటూ పోతూ పి.డబల్యూ గ్రౌండ్స్ లో ఒపిక లేక పడిపోయాడు. కొన్ని రోజుల పాటు తిండి లేక బాధతో అలా పడి ఉన్నాడు... బట్టలు దుమ్ము కొట్టుకుపోయాయి..గెడ్డం పెరిగింది..అచ్చం బిచ్చగాడిలానే ఉన్నాడు...అదే దారిలో వెళ్తున్న చిన్న పిల్ల లంచ్ బాక్స్ తినకపోతే వాళ్ల అమ్మ తిడుతుంది అన్న భయంతో క్రాంతిని చూసి ఆ అన్నం పడేసి వెళ్లగా...అది తిని ప్రాణం నిలుపుకున్నాడు...ఆ అమ్మాయే మిధున..
వైజాగ్ నుండి తన పెదనాన్న కోడుకుతో బయల్దేరిన క్రాంతి ఒంటరిగా ఎందుకు వచ్చాడు? ముందు గుడికి వెళ్లకుండా ఇంటిని ఎందుకు వెతుక్కుంటూ వెళ్ళాడు..... తరువాయి భాగంలో....
ధన్యవాదములుతో
వంశీకృష్ణ బాజారు.
Comments
Post a Comment