వశిష్ఠుని వనం
వనం
బాల్యం...
పక్షులకి పుట్టిన చెట్లకి తల్లిని నేను
రవి కిరణాల చప్పుడుకి నే రోజూ నిద్ర లేస్తాను
పశుపక్షాదులకి పూటకూళ్ళ పెద్దమ్మని నేను
రవికి,శశికి ఒక్కోలా కనిపించే వనాన్ని నేను..
పల్లం అనే లోతు గాయన్ని నీటి కుంటగా మార్చి దప్పిక తీర్చుతున్న వనాన్ని నేను
సెలయేటి అడుగులకి ఒంపులు తిరిగిన దేహం నా అందం
గాలులకి ఎగిరినది దుమ్మూధూళి అయి నా పైట
నా నగ్నసోయగం వెన్నెలకి మాత్రమే సొంతం
బుసలు,ఊలలు,ఈలలు,రంకెలు,కిచ కిచలు, గిట్టల సవ్వళ్ళు, వడ్రంగి పిట్టల టుకు టుకులు,రెక్కల టప టపలు,తరువు శాఖముల రెప రెపలు,
రంపం రపరపలు, గొడ్డలి వేటుల టక టకల శబ్దాలతో నిండిన సంగీత సామ్రాజ్యం నేను...
అయినను శశికిరణాల చప్పుడు వినగలిగే నిశ్శబ్దం నా సొంతం.
ఒక్క మాటలో చెప్పాలి అంటే సమస్త జీవరాసులన్నిటికీ సరోగసీ చేస్తున్న తల్లిని నేను.
రేయింబవళ్ళు నన్నే చూస్తూ ఉంటుంది ఆకాశం... మా మధ్యన వచ్చిందో వెర్రి మేఘం..
అందనంత ఎత్తులో ఉన్నానని విర్రవీగిన మేఘాలని సోన లాగా నా దగ్గరకే దించింది కాలం. దించుతున్నప్పుడే అందాన్ని కోల్పోయిన ఆకాశానికి ఇంద్ర ధనస్సుని ఇచ్చింది.
అగ్నికి నేనంటే ప్రేమ... అందుకే నాకు దూరంగా ఉంటుంది.
కాలాలన్నీ చూస్తూ గడిపేస్తున్నా నా కాలం...
వృద్ధాప్యం
ఉన్నోడి ఆలాపనలు...పోయేవాడి ప్రేలాపనలు... ప్రేమ పక్షుల ప్రణయగీతాలు...అనాథల ఆకలి కేకలు..గుర్రపు సకలింపులు.. మనుషుల ఈసడింపులు... వనాన్ని పావనం చేసేసారు..
చంపితే రక్తం ఆనవాళ్ళే ఉండవు కదా అని చెట్లని నరికేస్తున్నారు.
నే జాలిపడ్డ మనిషే ఇప్పుడు నన్ను చూసి జాలిపడుతున్నాడు.
మందుల మోతాదుకి మాడిపోయి మెరిసింది నా పచ్చని గడ్డి గెడ్డం..
బీడు వారగా పగుళ్ళు పడినది నా అందమైన శరీరం..
నీళ్ళు లేక,తిండి దొరకక నన్ను వదిలిపోయాడు నా పక్షి పెనిమిటి.
సేద్యం ఖాద్యము కాకుండా పోతుంది.
యంత్రాల రోదనలో నా వేదన మూగబోయింది.
నే కదిలిపోతాను యాడ ఉన్నదో తెలుసుకుని ఆ మానస సరోవరం... లేదా కలిసిపోతాను నన్ను నిలిపిన ఈ భూమిలో...
నేను ఈ భూమికి భారము కాదు...అయినను అర్ధాంతరంగా విడుస్తున్నా...
వశిష్ఠ (వంశీకృష్ణ బాజారు)
Comments
Post a Comment