జలవేదన

జలవేదన

ఆదిగా గర్భాశయాన జీవిని లాలించినది నేనే కదా!! నీరే కదా!!భారతావనికి ప్రాగ్దిశ,పశ్చిమాన నడుమ పరుచుకున్నది భూమి అయితే...పశ్చిమాన నుండి తూర్పునకు చుట్టుముట్టినది నేనే కదా!!

నా కోసం జరగక్కర్లేదు ఏ క్షీరసాగర మథనం..సరిపోతుంది  ఎద మథనం
పరమశివునికే నే కాదా శిరోభారం!! కానీ జీవికి మాత్రం నేనే ఆధారం..
కడలి నీరే వేడెక్కి...మేఘాలై ఢీ కొట్టి...గాలిని చీల్చుకుంటూ,కోసుకుంటూ నేలరాలనా!!
భూమి దాచుకుని ధాన్యమిస్తుంది...కడలి దాచుకుని స్వాతిముత్యాలనిస్తుంది...
పిరికివాడిని నే ఏడుపునై వీడిపోనా!! కష్టజీవికి స్వేదమై కండ కి ఆభరణమై మెరిసిపోనా!!చల్లదనమై ఊరటనివ్వనా?
ధైర్యవంతుడికి కష్టాల్లో కన్నీళ్ళై నేనే కదా తోడు!!
అంత సులభంగా దొరకను...ఉంటే భూమి లోతుల్లో...లేకుంటే గుండె లోతుల్లో...
తిండి కోసం పొలం తడవాలన్నా నేనే..తినేటప్పుడు పొలమారినా నేనే కావాలి..
నే ఉప్పు సంద్రంలో కలిసిపోతానని తెలిసీ పారుతున్న ఆత్మహత్యాపాతకుడిని..
ఓ మనిషీ విర్రవీగుతున్నావా?? నా పరుగుని వారధి అయి ఆపివేసానని!! ఓపిక నా సొంతం.. ఒత్తిడి నాకాహారం..
చేతులతో నన్ను ఒడిసిపట్టగలవా?? ఏదీ!! పట్టుకో చూద్దాం. నే ప్రచండపవనాలతోటి సందించిన లక్ష బింధువలై నీ వైపుకే దూసుకొస్తున్నా!! నే ముంచేయనా నిన్నూ నీలోని అహాన్ని..
నీది కట్టలు తెంచుకునే కోపమా? మరి నాది ఏంటి? అసలు నీకా పేరు వచ్చిందే నా నుండి కాదా?

నే గాలిలో ఉన్నాను...మేఘమై పోగలను ఆకాశపు మాడవీధుల్లోకి..

నాకోసం ఎదురు చూస్తున్నాయి అరుణ,బుధ,కుజ గ్రహాలు.. వందలాది చందమామలు..వెతుకుతున్నాయి పదుల సంఖ్యలలో ఉపగ్రహాలు... వెళ్ళిపోతాను ప్రళయకాలపు రుద్రుడి వలె గగనవీధుల్లో నర్తించుకుంటూ... తెంచుకుంటాను ఇక భగీరధునితో నా బంధం... బోళాశంకరునికే నే వరాలివ్వనా??ముక్తినివ్వనా??
నువ్వూ నీ ప్రగల్భాలు!! నవ్వొస్తుంది మనిషీ!!
నువ్వు ఓటరువైతే నే వెక్కిరించనా సిరా చుక్కనై!!
ఇంతకన్నా నే నిన్ను తిట్టలేను...

ఓ మనిషీ
నువ్వు నా పక్కగా పోతుండగా నే నీమీద పడితే అవి చల్లని నీటి తుంపర్లు అనుకోకు...తుంపర్లు కావవి నే నీ మీద ఉమ్ముతున్నాను...
తుడుచుకుపో..నీకలవాటే కదా!!

నా పేరు జలం..నా పేరు తిప్పితే పుట్టే స్వభావంగలవారు ఎక్కువైపోయారు మనుషుల్లో!!

నన్ను కాపాడుతూ నీ విలువలని కాపాడుకో...


వశిష్ఠ(వంశీ కృష్ణ బాజారు)



Comments

Post a Comment

Popular Posts