ఆలస్యం అమృతం అమృతం....

గోడగడియారం మూడో గంట కొట్టింది. ఆఫీసులో అందరూ కాశీ విశ్వనాథ్ టేబుల్ వైపే చూస్తున్నారు. కాశీ మాత్రం పనిలో లీనమైపోయి ఉన్నాడు. పక్క టేబుల్ దినకర్ విశ్వనాథ్ గారూ వచ్చే శనివారం మన ఆడిటర్ గారి కుక్కకి బారసాల ఫంక్షన్..మీరు వస్తున్నారు కదూ!! అని అడిగాడు. ఫైల్లో నుండి తల లేపకుండానే కుదరదు దినకర్ గారు ఆరోజు నా పెళ్ళి ఉంది. నేను రాలేకపోవచ్చు అని రెండు సెకండ్స్ అయ్యాక తల ఎత్తి గడియారం వైపు చూసాడు. అమ్మో మూడు అయిపోయింది. తల దించిచూసేసరికి అందరూ కాశీనే చూస్తూ నవ్వుతున్నారు. సిగ్గుతో తలవంచుకుని అటెండర్ ని పిలిచి బస్టాండ్ కి ట్యాక్సి పిలిపించుకురమ్మన్నాడు. యుద్ధానికి లేటుగా వెళ్తే ఏలా గురూ? వచ్చాక బ్యాచిలర్స్ పార్టీ ఇవ్వాలి కాశీగారు. విష్ యూ ఏ వెరీ హాపి మేరీడ్ లైఫ్ కాశీగారు లాంటి కామెంట్స్ వింటూ అందరికి మరొకసారి తప్పకుండా తన పెళ్ళికి రావాలని చెప్పి బయలుదేరాడు. లగేజ్ తక్కువే ఉంది. కొన్ని జతల బట్టలు, కావాల్సిన సామాను ఎన్నో అవ్వలేదు. బస్సు ఎక్కగానే ఒకటికి పదిసార్లు అన్ని ఉన్నాయో లేదో చూసుకున్నాడు. బస్సు బయల్దేరగానే బ్యాగ్ లోనుండి తను రాసిన ఉత్తరాలు తీసి చదవడం మొదలుపెట్టాడు. 

కిటికీలో నుండి చల్లటి గాలి వీస్తుంది. ఆ గాలికి లేఖల్లోని అక్షరాలు ఎగురుతూ తనని చుట్టేస్తున్నాయి. కొన్ని అయితే మళ్ళీ మళ్ళీ తననే చదవాలని మారం చేస్తున్నాయి. అక్షరాలలో మునిగితేలుతున్నాడు. ఎక్కడికి?? నా పెళ్ళికి.. భళ్ళున నవ్వులు వినిపించాయి. ఊహల్లోంచి వాస్తవంలోకి వచ్చి పడ్డాడు. ఎదురుగా కండక్టర్. టికెట్ ఎక్కడికి? అని నవ్వుతూ అడిగాడు. పక్కనవాళ్ళు నవ్వుతున్నారు. ఏం తెలియనట్టు అక్షరాలన్నీ కాగితంపై పడుకున్నట్టు నటిస్తూ వెక్కిరిస్తున్నాయి. పెళ్ళి అవ్వగానే తనతో ఇది పంచుకోవాలి అనుకున్నాడు.

టికెట్ తీసుకుంటుండగా వెనకనుండి మొదటి పెళ్ళనుకుంట తెగ ఇదైపోతున్నాడు కుర్రోడు అని నవ్వులు వినిపించాయి. ఏడిసావు లేరా ముదనష్టపు ఎదవ అని వాళ్ళావిడ తిట్టు తోక తగిలించింది. ఈ మాట వినగానే ఆ శంకర్ గాడే గుర్తొచ్చాడు.. మొన్న మార్కెట్లో కనపడి ఏం గురూ క్రికెట్ ఆడటానికి రావట్లేదు అని అడిగి..ఏంటి పెళ్ళి కుదిరిందంట కదా!! అని వెకిలి నవ్వులు నవ్వాడు. తాను కొంచెం బిజీగా ఉంటున్నా అని చెప్పినా వినిపించుకోలేదే!! అలా బస్సు ముందుకి పోతుంటే తను మాత్రం ఆలోచనల్లో వెనక్కి వెళ్ళాడు.


మూణ్ణెల్ల కిందట

ఊరినించొచ్చిన ఉత్తరానికి ప్రత్యుత్తరంగా తానే పయనమయ్యాడు కాశీ. చూపులకని చెప్పకుండ మిల్లుపని చూడాలని చెప్పి సెలవుపెట్టి మరనాడు బస్సుకి బయలదేరాడు. అప్పటికే రెండు తప్పాయి, తప్పాయి అనడంకన్నా తప్పించారు అంటే రైట్ ఏమో!! పెదపట్నంలో మంచి ఉద్యోగం. అయినా ముందు వచ్చిన సంబందాలలో అమ్మాయి పేర్లు లక్ష్మీ, దుర్గ అవ్వడం వల్ల ఆఖరినిమిషంలో ఈ కాశీ విశ్వనాథుడికి వరస కుదరదన్నారు పెద్దోళ్ళు. పేరులో ఏముందిలే అని అంటే నీకేం తెలీదులేరా అని తీసిపారేసారు. భక్తి కలవాడవడం చేత తానూ ఏం మాట్లాడలేదు. తనకింక ఏ పార్వతో, గంగో ఉన్న అమ్మాయే వస్తుందని నిశ్చయానికొచ్చేసాడు. పెట్టేవాళ్ళు ఏ కృష్ణుడో, విష్ణువో అని పెట్టినా సరిపోయేదే అని మేనమామ దగ్గర బాధ పడితే దేన్నోదాన్ని లేవదీసుకుపోరా..వీళ్ళు నీ పెళ్ళి చేయరులేగానీ అని అనేవాడు. పైగా ఊరుకోక సుందరరావమ్మగారితో అక్కాయ్ బావ, నువ్వూ ఇలా ఏదో ఒక సాకుచూపి వచ్చిన ప్రతీదాన్ని వద్దంటుంటే ఇక వాడు ఏ కరణంగారమ్మాయినో, హెడ్ మాష్టర్ కూతుర్నో లేవదీసుకుపోతాడే అక్కా!! తరువాత ఇలా అయ్యిందేంటని,పరువని మీరు బాధ పడితే బాగోదక్కా అని బావగారైన లక్ష్మణమూర్తికి వినపడేలా అనేవాడు. నువ్వు ఊరుకోక వాళ్ళకి మళ్లీ ఇదొకనుమానం పెట్టావు కదయ్యా నా పైన అని కాశీ తిట్టాడు. నీకు తెలీదులేరా అని అనేవాడు. ఏదైతేనే ఇప్పుడొక సంబందం వచ్చింది. మరుసటిరోజు ఉదయాన్నే బండి కట్టించుకుని కాశీ, పిల్లోడి అమ్మానాన్న లక్ష్మణమూర్తి, సుందరరావమ్మ, మేనమామ,అత్త, ఇంకొంతమంది బయలదేరారు. 

పిల్లోళ్ళది పెదరామభద్రపురం. ఇంతకీ వాడికి అమ్మాయి పేరు చెప్పారు కాదూ!! పేరు గౌరీ మయూఖ శ్రీ. పెదపట్నంలోనే బి.ఎడ్ చేస్తుంది. ఊరవతల గుడివద్ద అరగంట కారాపి వర్జ్యంపోయాక ఇంటికెళ్ళారు. ఈ గ్యాపులో గుప్పుగుప్పని పొగలాగిన మేనమామ మీరు వెళ్తూండండి నేంకాలినడకన వచ్చేస్తాలే అని జామాకులు నముల్తూ నడుచుకొస్తానన్నాడు. బావమరిదిని తిట్టడానికి సాకులు వెతకక్కర్లేదు వాడే ఇచ్చేస్తాడని అనుకున్నాడు పెద్దాయన. కాళ్ళుకడిగి లోపలకి వెళ్ళి అల్పాహారాలు చేస్తూండగా ఊడిపడ్డాడు మేనమామ. హమ్మయ్య వచ్చావా!! అన్నట్టు ఇదైపోయాడు కాశీ. పిల్లని తీసుకొచ్చారు. చూపుల్లో చూపులు కలిసాయి. నవ్వాడు కాశీ. తనూ నవ్వింది. అమ్మాయితో ఏమన్నా మాటాడతావేటిరా అనగానే నిన్ను తీసుకొచ్చిన పనిచేసిపెట్టావు కదయ్యా మావయ్య అని సరే అని కూడ చెప్పకుండా లేచి నిల్చున్నాడు. కూర్చుని తగలడరా అన్నట్టు చూశాడు లక్ష్మణమూర్తి. కాశీ, తను మేడ మీదకి వెళ్ళారు.

మేడ పైన లతలల్లుకున్నాయి...

కాశీ ఇలా మొదలుపెట్టాడు.....నేను ఇక్కడికి ఏదో ప్రశ్నలడగాలని రాలేదు..మాట్లాడదామని వచ్చాను.. మీరు ఏమన్నా అడగాలి అంటే అడగండి అన్నాడు. నేను ఇంతకముందే మిమ్మల్ని చూసాను. పెదపట్నంలో మిమ్మల్ని ఎరుగుదును అని ఆమె అంటుండగా మనం లక్ష్మీటాకీస్ మొదటి ఆటలో వేసిన కోతి స్టెప్పులు కానీ చూడలేదు కదా!! అని లోలోపల అనుకున్నాడు. ఏం ఎరగనట్టు ఓహో అవునా!! ఎక్కడ ఉండేవారు మీరు అని అడిగాడు. విహార్ గార్డెన్స్ లో... అక్కడే సాయిబాబా గుడిలో మిమ్మల్ని చూసాను అని అంది. హమ్మయ్య అని అనుకుంటూ అవును ప్రతీ గురువారం స్నేహితులతో వచ్చేవాడిని..కానీ మిమ్మల్ని చూసినట్టు గుర్తులేదన్నాడు. నేను చూసిన ప్రతీసారి కళ్ళు మూసుకుని ధ్యానం చేస్తుండేవారు లేండి మీరు అని అంది. ఓహ్ అయ్యుండచ్చు. చదువూ, అవీ ఇవీ అన్నిలోకొన్ని మాట్లాడుకున్నారు. మీకు ఇష్టమైతే ఉద్యోగం చేయండి నాకభ్యంతరం లేదన్నాడు. ఏదో ఇంక జీవితాంతం ప్రతీసారీ మీరు,అండీ అనేటట్టు ఇప్పుడనడం ఎందుకు అని నవ్వుతూ అంది గౌరీ. అలా అని ఇప్పుడే నువ్వూ,అది ఇది అంటే వీడేంటి ఇలా ఉన్నాడు అనుకుంటారు కదా మీరు అన్నాడు. అంతే అనుకోండి అంది. అందుకే మీకు నచ్చుతుందని అనిపించినప్పుడు చనువు తీసుకోవడం ఉత్తమం. నవ్వి ఊరుకుంది. మీకు ఈ పెళ్ళి ఇష్టమేనా? అని అడిగాడు. ఇష్టం కాబట్టే కదండి కాశీగారు పెళ్ళిచూపులకి ఒప్పుకుంది అంది. ఈ సమాదానం కాశీకి నచ్చింది. నవ్వి..సరేకానీ మీకీ పేరు ఎవరు పెట్టారు? అని అడిగాడు. అర్ధంకానట్టు ఒక చూపు చూసింది. మీ పేరు బావుంది అంటాడేమో అనుకుంటూ మా తాతయ్యగారు పెట్టారు. ఊర్లో ఉంటారు. ఈరోజు రాలేదు అంది. ఏ ఎందుకలా అడిగారు అనే లోపు..నా పేరు కాశీ విశ్వనాద్.........అని మొత్తం చెప్పుకొచ్చాడు. తనేం అనుకుంటాడో అని పట్టించుకోకుండ ఇలా జరిగిందా అని నవ్వేసింది. తనూ నవ్వేసాడు. ఇంతకి ఇది మీకు ఎన్నో పెళ్ళిచూపులు అని అనాలోచితంగా అడిగేసాడు. రెండోది...మీకు మొదటిది ఏమయ్యిందో చెప్పాల్సిందే అని మొదలుపెట్టింది. హమ్మయ్యా మిస్ ఫైర్ అవ్వలేదని అనుకుని వింటున్నాడు. మొదట వచ్చిన వాళ్ళది పెదపట్నమే.. మిమ్మల్ని చూసినట్టే అతన్ని కూడా పెదపట్నంలో చూసాను. అదే చెప్పాను. అవునా ఎక్కడ చూసావు అని అడగగానే చెప్పాను. నన్ను అప్పుడు చూడగానే ఏమనుకున్నావు? నేను పెళ్ళిచుపులకి వస్తానని ఊహించావా?? అంటే లేదు అన్నాను. తనని, తన స్నేహితులని చూసినప్పుడు నేనేమనుకున్నాను, మా స్నేహితులేమనుకున్నారు అని అడిగాడు. నాకది నచ్చలేదు. తన లోకం 'నా' చుట్టూ తిరుగుతుందని అర్ధమయ్యింది. లేదు నేనేం అనుకోలేదంటే ఏ నాకేం తక్కువ?? అందంగా ఉంటాను, ఏదో ఒకటి అనుకోకుండా ఏలా ఉంటావు అని అడిగే బాపతు అని అర్ధమైపోయింది. కనిపించిన ప్రతీ అమ్మాయి వాడి గురించి ఆలోచిస్తుందేమో,ఆలోచించాలి అనుకునేవాడు వాడు చూడకుండా ఉంటాడా? అందుకే అందరి ముందు వద్దని చెప్పేసాను. అందరిముందూ చెప్పేసరికి ఇంట్లో వాళ్ళు కూడా నన్ను మళ్లీ ఒప్పించే ప్రయత్నం చేయలేదు..ఇది నా అనుభవం అని ముగించింది. నిజంగా మీకిది రెండో చూపులేనా?? అని అడిగేసాడు కాశీ..హాహా..అని నవ్వి స్మార్ట్ అంది. సరే మీ తాతయ్యగారికి ధన్యవ్..అని ఆపేసాడు. నేను చెప్తాలేండి ధన్యవాదాలు నా తరపున..మీ తరపున అని అంది. తనేం చెప్పాలనుకుందో  కాశీకి అర్ధమయ్యింది. కొన్ని రోజులాగితే ఇద్దరం కలిసి చెబుదాం అన్నాడు. ఒకసారి ఆమె అతని కళ్ళల్లోకి చూసింది. కాశీకూడా చూసాడు. ఒక్కసారిగా ఇద్దరూ ఈలోకంలోకి వచ్చారు.


కాశీకి అమ్మాయి నచ్చింది. ఇంకా తెలుసుకోవాలని ఉంది.కానీ సమయం లేదే!! ఇంక వెళ్దామా అని అనగానే సరే అంది తను. వెళ్తుంటే ఈ అమ్మాయి తన వాళ్ళతో ఇమడగలదా!! అని సందేహం కూడా వచ్చింది. గౌరీ వాళ్ళమ్మగారు మీ అత్తయ్య,మావయ్య గారి ఆశీర్వాదం తీసుకోమ్మా అనగానే వెళ్ళి వారి ఆశీర్వాదం తీసుకుంది. ఇమడగలదు అనిపించింది.

ఎంత చీకటున్నా దొంగోడు బీరువా వద్దకే వెళ్ళినట్టు,ఆటల్లో పడి అటుతిరిగొచ్చి, ఇటుతిరిగొచ్చి పిల్లలు తల్లిని వెతుక్కున్నట్టు కాశీ, మేనమామ ఎక్కడున్నా ఒకరిదగ్గరకింకొకరు చేరిపోతారు. 

కులాసాయేనా అని కళ్ళతోటే అడిగాడు మేనమామ. ఇంకొక మేనమామ ఉంటే బావుండేది ఇంకొకసారి మాట్లాడేవాడిని తనతో అని చిన్నగా నవ్వాడు. ఓరి తుంటరి.. అని మేనమామ కూడా నవ్వాడు.. ఈ తోడుదొంగలిద్దరూ ఒకచోటజేరి ఏం చేస్తున్నారా అని ఇటే చూస్తున్నాడు లక్ష్మణమూర్తి. మీనాన్న మీ అమ్మకి విడాకులిచ్చేసి నన్ను చేసుకుని రాచిరంపాన పెట్టేద్దామన్నట్టు చూస్తున్నాడు, మా అక్కయ్య జీవితాన్ని పాడు చేయలేను గానీ ఇంటికి వెళ్ళాక మాటాడుకుందాం ఇక అని అన్నాడు. కట్నకానుకలు, లాంచనాలు, పెట్టిపోతలు అప్పటికే మాట్లాడుకున్నారని అర్ధమయ్యింది. అవి మాట్లాడుకుంటూనే చూపులు పెట్టించారనమాట. 


వాళ్ళు వీళ్ళింటికి రావడం, నిశ్చితార్దం, పప్పన్నాలు అవీ ఇవీ, ముహూర్తం పెట్టించడం అన్ని చకచకా జరిగిపోయాయి. పరీక్షలైపోవడంతో తను ఇంటివద్దనే ఉండిపోయింది. రెండూర్ల మధ్యన వారధి కట్టేటన్ని ఉత్తరప్రత్యుత్తరాలు నడిచాయి. ఇదుగో ఇంకొక వారంలో పెళ్ళి. ఇదుగో కుర్రాయన మీ ఊరొచ్చింది దిగు అనేసరికి ఒక్క ఉదుటన లేచి బయటపడ్డాడు. దారమ్మట అందరూ ఇదేనా రావడం పెళ్ళికొడకా?? అని అడగటమే.. ఇంటికిజేరి కొంచెంసేపైన విశ్రాంతి తీసుకోకుండానే బెల్లం మూటలు కొనడానికి ఈరాత్రే మేనమామ ఇంటికి బయలుదేరిపోయాడు.


పెళ్ళి...

వేసంకాలం ఒక రాత్రి లగ్గానికి ముహూర్తమెట్టించారు. పెళ్ళి బాగా జరిగింది. ఆరోజు వర్షం కురిసింది కూడాను!! తర్వాత రోజు సిమ్మాచలమెళ్ళొచ్చి ఆ సాయంత్రం ముచ్చటకి ముహూర్తమెట్టించారు.


మొదలేగా కొత్త కొత్త కథలు...

అయిదోనెలలో కొత్తకాపురం పెట్టారు. ఈలోపు ఇల్లు చూసి కావాల్సినవన్నీ అమర్చిపెట్టాడు. కూతుర్ని వెంటబెట్టుకుని సామానుతో పాటు గౌరీ వాళ్ళ అమ్మానాన్న అన్నపూర్ణ, వరాలరామయ్య పెదపట్నం వచ్చారు. ఇంకొన్ని రోజులు ఉండమని కూతురూ,అల్లుడూ చెప్పినా వినకుండా మరసటిరోజు తెల్లవారుఝామునే బయలుదేరి వెళ్ళిపోయారు. ఇల్లు పెద్దదే..పైగా ప్రశాంత వాతావరణంలో.. ఇప్పుడిప్పుడే వర్షాలు పడటం మొదలయ్యాయి. గౌరీకి బాగా నచ్చింది. ఇక్కడన్నీ ఒక దారయ్యేవరకు చదువుకి విరామం ఇవ్వాలని అనుకుంది. ఇది ఇద్దరూ అనుకుని తీసుకున్న నిర్ణయం. పెందలకాడనే పడిపోతున్న ఇంటి గుమ్మం గడియ బాగా పొద్దెక్కాక కానీ తెరుచుకోవట్లేదు. పడకగది గడియది ఇంకో తంతు. ఆ ఇంట్లో ప్రతీ గది,ప్రతీ చోటు, ప్రతీదిక్కు వీరి ప్రేమకి సాక్ష్యమే!! అంతపెద్దిల్లు కూడా చిన్నదైపోయింది. బిడియం స్థానే చనువు వేగంగా ఆక్రమించుకుంటుంది. అప్పుడపుడూ తన స్నేహితురాళ్ళొచి వెళ్తూండేవారు. వారిలో కొందరు ముచ్చట్లు చెప్పమని తెగ అడిగేవారు. మీరూ పెళ్లి చేసుకోవచ్చు కదే నన్నెందుకు ఇలా చంపడం అనేది. వినిపించుకుంటే కదా!! చెబితేకానీ వదిలేవారు కాదు... వాళ్ళు వచ్చి వెళ్ళిన తర్వాత సిగ్గుతో ఇదైపోయేది. ఆకలి వేసేది కాదు. ఆ రాత్రి ఇంక పడకగది గడియ కూడా పడేది కాదు. దేహాలు స్వేదాన్ని చిందించే కర్మాగారలు అయ్యేవి. గదిలో అద్దాలు నిశ్శబ్దంగా వింతలు చూస్తూ చూపిస్తున్నాయి. నవజంట ఒకరిలోఒకరు ఐక్యమైపోగా శీతాకాలం వర్షాకాలాన్ని తరుముకుంటూ వచ్చేసింది. 


మధ్యమధ్యలో గౌరీ వాళ్ళ పుట్టింటికొకసారి, మెట్టింటికొకసారి వెళ్ళొచ్చారు. నెలకొకటి రెండుసార్లు గౌరీ వాళ్ళింటి నుండి ఉత్తరాలు వస్తుండేవి..మీరు క్షేమమా? మేము క్షేమం..ఏమన్న అవసరం ఉంటే సంకోచించకుండా అడగండి. ఏమన్నా విశేషమా? మీ రాక కోసం వేచి చూస్తున్నాము అని. ప్రతీసారి ఇంచుమించు ఇలానే ఉండేది ఉత్తరం. చలికాలం కదా అని స్వెటర్స్ కుడుతుంది. అయినా చలి ఎక్కడ తెలిసేది?? చలికాలమంతా ఇంట రసాగ్ని రగులుతూనే ఉంది. స్వేదానితో చేస్తున్నారు వలపుల సేద్యం... వీళ్ళకి కావాల్సినప్పుడు కాలం నెమ్మదిగాను, వేగంగాను కదులుతుంది. అలా అలా పెద పండగ వచ్చేసింది.


కొత్తల్లుడుకి అత్తారింట్లో మొదటి పండగ. మర్యాదలు బాగా జరుగుతున్నాయి. ఒక రోజు సాయంత్రం గౌరీ వంటగదిలో కూర్చునుండగ పని చేసుకుంటూ వాళ్ళమ్మగారు ఇలా అన్నారు.. ఏమ్మా..అందరూ చదువుకున్నోళ్ళలానే అల్లుడుగారూ అప్పుడే పిల్లలు వద్దు..కొన్ని రోజులాగుదాం అని అనట్లేదు కదా!! అంటే చెప్పు... ఒకమాట మీ నాన్నగారికి చెప్పి నేమీయత్తగారికి చెబుతాను అని అంది. ఒక ధీర్ఘశ్వాస తీసుకుని వదిలి గౌరీ.. లేదమ్మా కాశీ ఏం అలా అనలేదు అంది. మీయత్తగారేమన్నా ఉత్తరాల్లో అడిగారా? అని అంది.. లేదు..నువ్వు అడగడమే కానీ ఆవిడ ఇప్పటివరకు ఈ ఊసేత్తలేదు..ఆవిడ మనసులో ఏముందోలే అని అంది. 


నువ్వు చదువుకి విరామం ఎందుకు తీసుకున్నట్టు..నేను అడిగాను అని కాదు..మీ అత్తగారు అడుగుతారేమో అని.. ఇప్పుడు చదువు ఆపి వచ్చే యేడు మొదలెడితే పిల్లల్నెప్పుడు కంటారు అంటారే!! అని తనలోపలున్నది చెప్పేసింది. ఇంక చదువంటావా!! పెళ్ళి అయ్యాక వ్రతాలు, పూజలు, పుణ్యక్షేత్రాలకి వెళ్ళిరావడమే సరిపోయింది కదమ్మ!! తొలిసూరబ్బాయి కదా అని మావాళ్ళు ఎన్నెన్ని మొక్కులు మొక్కారో నీకు తెలియంది కాదు. ఇంక ఎక్కడ నేను వెళ్ళి చదువుకునేది?? అయినా చదువుతుండగా నెల తప్పానంటే మళ్ళీ చదువుకి బ్రేక్ పడినట్టే. పిల్లల కోసం చదువు ఆపేస్తాను కానీ చదుకోసం పిల్లల్ని ఆపమమ్మా!! ఇది మా ఇద్దరి మాట!! అని అంది. సరే తల్లీ అని ఆ మాటలు అక్కడే ఆగిపోయాయి. మళ్లీయేడు పాతల్లుణ్ణయిపోతానని కాశీ కూడా చూట్టాలింటికి వెళ్ళడానికి మంచి ఉత్సాహం చూపించాడు. ఇద్దరిని చూసి అందరూ సంతోషపడిపోతున్నారు. మనవడ్నో,మనవరాలినో ఇచ్చేస్తే ఆడుకుంటామని అడగడమే అందరూ!! పండగంతా చాలా సరదాగా అయ్యింది. పెదపట్నం వెళ్ళేముందు కాశీ వాళ్ళూరు వెళ్ళారు. పెదకొడుకు, కోడలు ఇంటికి రావడం, చిన్నోడు కూడా ఇంటికి రావడంతో పెద్దోళ్ళిద్దరూ సంతోషపడ్డారు. మాటల్లో అత్తగారు ఆరోగ్యమెలా ఉంటుంది..ఏమన్నా ...?? అని అడిగింది. బావుంది..ఇంకా ఏం లేదత్తయ్య అంది గౌరీ.. అలా అక్కడ రెండ్రోజులుండి పెదపట్నం బయల్దేరిపోయారు. ఇంటికొచ్చిన తర్వాత అందరికి కృతజ్ఞతలు తెలుపుతూ, క్షేమంగా చేరాము అని ఉత్తరాలు రాసింది. తల్లికి అత్తగారు అడిగిన విషయం కూడా రాసింది. తనకి నచ్చినట్టుగా ఇల్లు సర్దుకుంటుంది. రోజు కాశీ వచ్చేసరికి ఇల్లూ, ఇల్లాలు కొత్తగా కనిపిస్తున్నారు. పూలమొక్కలు నాటింది, కొన్ని పుస్తకాలు తెప్పించుకుని చదువుతుంది..ఇదే తనకి కాలక్షేపం. అలా అలా మొదటి వార్షికోత్సవం వచ్చేసింది. ఊటి వెళ్ళొచ్చారు. కాశీ ఒక బంగారు నెక్లేస్ తీసుకున్నాడు. చాలా ఉల్లాసంగా గడిపి ఉత్సాహంగా తిరిగొచ్చారు. 


జూన్ నెలలో కాలేజిలో మళ్ళీ జాయిన్ అయ్యింది. ఉదయాన్నే లేచి వంటచేసి ఇద్దరికి బాక్స్ కట్టి కాలేజికి వెళ్ళడం అంటే పరుగు పరుగుగా పని చేయాల్సివస్తుంది. కాశీ ఏమో తెల్లగతెల్లారితేగానీ లేవడు ఇంక ఏం పనిలో సాయపడతాడు. ఏదో చేయందిచ్చచ్చు కదా అని గౌరి అడగదు. ఏమనుకున్నాడో ఏమో ఒకరోజు ఉదయాన్నే లేచాడు. తను బాత్రూంలో ఉంది. చొక్కా తగిలించుకుని పాల పాకెట్ తెచ్చాడు. కాశీ చేతులో పాలు చూసి ఏంటి అప్పుడే లేచారు కాశీగారు గడియారం తప్పు చూపెట్టిందా అని అంటూ పాలబ్బాయి త్వరగా వచ్చేసాడేంటో..ప్రతీరోజు ఇదే టైం కి వస్తే బావుండు అంటే...ఏంటి..పాలబ్బాయా??? అర్ధమయ్యింది. నేను తెచ్చానంటే ఏమంటదో అని ఊహించుకుంటుండగా వీధిగుమ్మంలో పాలబ్బాయి అలికిడి అయ్యేసరికి గౌరీకి విషయమర్ధమయ్యి వెంటబెట్టుకుని వెళ్ళి వాకిట్లో పాల పాకెట్లని చూపించి భళ్ళున నవ్వేసింది. ఇల్లెలా నడుస్తుందో కూడా తెలియరాలేదన్నమాట అని వెక్కిరించింది.సతికి సాయపడదామని వచ్చిన పతితో పరిహాసాలేంటి, పైన అభాండాలేంటి.. నాకేం పని..రేపటి నుండి అర్ధగంట నిద్ర కలిసొస్తుంది అన్నాడు. లేదులే రేపటి నుండి అబ్బాయిని మానిపించేస్తాను మీరు మీ సాయాన్ని కొనసాగించండి నెలకి పన్నెండ్రూపాయలు మిగుల్తాయి అంది. ఏదో చెద్దామనుకుంటే ఇంకేదో అయ్యిందనుకుని మా మగాళ్ళం తెలివైనవాళ్ళం అని పొనీలే పాపం కదా అన్నట్టు మీకు అందగత్తెలు అనే టైటిల్ ఇద్దామనుకుంటాం. నిజానికి తెలివైనవాళ్ళు, అందగత్తెలు ఇద్దరూ మీరే!! అని అన్నాడు. అలా ఆరోజు నుండి పనిలో సహాయపడుతుండేవాడు.


ఒక నెలలో కాశీ వాళ్ళ అమ్మానాన్న పెదపట్నం వచ్చారు. బీచ్ కి, గుళ్ళకి, సర్కస్ కి వెళ్ళారు. వాళ్ళున్నన్ని రోజులు వీళ్ళకి ఏకాంతం దొరకలేదు. ఒకరోజు ఇలానే... ఏంటి నీరసంగా ఉన్నావు?? అదా?? అని అడిగాడు కాశీ..లేదు వారం పైనే అయ్యింది అంది. నలతగా ఉందా అని కౌగిట్లోకి తీసుకుంటూ ఈరోజు అమ్మ విడిగా పడుకుంటుందిలే కానీ మనం మన గదిలోనే అని అంటుండగా సుందరరావమ్మ గారు ఒక్కసారిగా కిచెన్లోకి వచ్చారు. దొరికేసాన్రో దేవుడా అనుకుంటూ కాలు కాలిన పిల్లి లాగ తిరిగేసాడు. పెద్దోళ్ళకి తెలియకుండా బతిమాలుతూనే ఉన్నాడు. వారిద్దరూ ఒక గదిలో ఉంటే మావయ్యగారికి మంచమిబ్బంది అని వద్దని వారిస్తుంది. భోజనాలయ్యాక చేయి, మెడ లాగుతుంది వచ్చి మర్దనా చేయచ్చుకదా అనే సాకుతో అడిగాడు. సరేమ్మా.. లేట్ అవుతుందిగా మీ మామగారిక్కడే పడుకుంటారులేమ్మా అని అత్తగారన్నారు. మొత్తం చూసేసిందా ఏంటి అమ్మా అనుకుని లోపల ఆనందపడిపోతున్నాడు కాశీ. నేనా..నాకీమంచం కుదరదు. లేట్ అయినా అక్కడే పడుకుంటా అన్నారు మామగారు. నీకేమో ఆ గదిలో గాలిరాదంటావు పోనీ నువ్వాగదికి రా అంటే అమ్మో ఆ ఉడుకులో అస్సలు నిద్రపట్టదు మీరే ఇటు రండి అని గట్టిగా చెప్పింది సుందరరావమ్మ గారు. అత్తమామల కలహాన్ని చూసిన గౌరీ ఒక చురుకైన చూపు విసిరింది కాశీ పైన. భార్య కోపాన్ని గ్రహించిన కాశీ సరేలే నేనే మర్దనా చేసుకుంటాలే... పదండి నాన్న వెళదాం అని వెళ్ళిపోయారు. అత్తగారున్న రోజుల్లో కోడలితో ఒక వ్రతం పట్టించింది. పదిరోజులున్న తర్వాత బయలుదేరారు. 


తెలియకుండానే ప్రేమగా,సరదాగా రెండున్నరేళ్ళు గడిచిపోయాయి. గౌరీ పాసైపోయింది. నాలుగు నెలల్లో ఇంటర్వూలో సెలెక్ట్ కూడా అయ్యింది. కాశీకి ప్రమోషన్ వచ్చింది. ఒక దాని తర్వాత ఒకటి  శుభవార్తలే.. వీటికి కొనసాగింపుగా కాశీ వాళ్ళ తమ్ముడుకి చూపులు జరగడం. అది కుదరడం, ముహూర్తం పెట్టించడం చకచకా అయిపోయింది. దూరపు చుట్టాలమ్మాయే!! కాశీ తమ్ముడు మల్లికార్జున పెళ్ళి పనులకని పెదపట్నమే వచ్చాడు. అన్నావదినలే షాపింగ్, బంగారం, ఇతరత్రా పనులు, శుభలేఖల అచ్చు మొదలైనవన్నీ దగ్గరుండి చూసుకున్నారు. 

అమ్మాయోళ్ళ ఊరు విజేవాడలో పెళ్ళి బాగా జరిగింది. ఇంట్లో  పనులన్ని పెదకోడలి చేతిమీదనే చేయించింది అత్తగారు. రెండ్రోజుల తర్వాత వీళ్ళింట్లో వ్రతం. కొత్తజంటతో పాటు వీళ్ళ జంట కూడా సిమ్మాచలం వెళ్ళొచ్చారు. వ్రతం బాగా జరిగింది.. ఊరందరికి పిలుపు వెళ్ళింది. అందరూ బాగా చేసారంటే..బాగా చేసారనడమే!!! తమ్ముడి పెళ్ళి భలే జరిపించారయ్యా మీరిద్దరు అని పెదనాన్న అంటే మరి ఎవరిదగ్గరుండి చదువుకున్నాడేంటి...నా దగ్గర..అని మీసం మెలేసాడు మేనమామ.. వీడూ వీడి కోతలు అని ఒక చూపు చూసాడు పెద్దాయన. 


చుట్టాలందరూ వెళ్ళిపోయారు ఒకరిద్దరు తప్ప!! వ్రతమైన తెల్లారి గౌరీ కిందకి వచ్చి వంటగదిలోకి వెళ్తుండగా అత్తగారు, చిన్నత్తగారి మాటాలు వినిపిస్తున్నాయి... అలా ఆగిపోయింది గౌరీ.. వాళ్ళ మాటలు ఇలా ఉన్నాయి...


అక్కా!! పెద్దోడికి పెళ్లై మూడేళ్ళవుతున్నా ఇంకా పిల్లల్లేరేంటని అడుగుతున్నారే అందరూ... అమ్మాయి చదువుకుంటంది కదా!! అనె చెప్పాను. ఇంకేం చేయమంటావు.. నన్నూ అదే అడుగుతున్నారే!! ఏమని చెప్పను నేనైనా!! పెద్దోడు పిల్లల్లు అపుడే వద్దనుకుంటున్నాడేమో కనుక్కోకపోయావా?? అంది చిన్నత్త. తమ్ముడితో అడిగించానే అదేం లేదు..ఆగట్లేదని చెప్పడంట అంది...ఆ చెబితే..నువ్వు నమ్మావు?? వాళ్ళు చదువుకున్నోళ్ళు..వాళ్లంత తెలివి మనకి తగునా!! అయినా చదువెందుకంటా కోడలి పిల్లకి?? ఏ ఉద్యోగాలు చేయాలా?? ఊర్లు ఏలాలా? మేడలు, మిద్దెలూ కట్టాలా?? ఉన్నవి చాలవూ?? మనకి లాగా ఇంట్లో పనిజేస్తు పిల్లల్ని చూసుకుంటే చాలదూ?? అని అంది చిన్నత్త... ఈరోజుల్లో ఇల్లు గడవాలంటే ఇద్దరూ ఉద్యోగం చేయాల్సిందే అంటే చెల్లి అని అత్తగారు అంది. ఊరుకోవే.. పెదబాబుది పెద్దుద్యోగమే అంట!! జీతం బాగా వస్తది అంట .. మా రెండోవాడు నాకు చెబితేనూ... అయినా నాకీ జీతాలు అవి తెలీదే..అవన్నీ ఆయనకే తెలియాలి అని సమాదానమిచ్చింది అత్తగారు. చిన్నత్త ఇలా చెప్పుకుంటూ పోయింది... అందుకే చెబుతూనే ఉన్నాను..చదువుకున్న అమ్మాయి వద్దూ అని..నువ్వు వింటేనూ?? చూస్తూ ఉండు.. పెదకోడలికన్నా..వెనకొచ్చిన నీ చిన్నకోడలే ముందు నీళ్ళోసుకుంటుంది అనేసింది. ఏంటే ఆ మాటలు అంటూనే అత్తగారికి ఆందోళన పడిపోయింది నిజంగా అలానే జరిగితే ఏంటి అని...బయట ఉన్న గౌరీకి ఒక్కసారిగా మేకు దిగినట్టయ్యింది...చిన్నత్త నిదానంగా వేరే ఉద్దేశ్యంతో అనేలదక్కా! నీ మీద, పెదబాబు మీదున్న ప్రేమతోనే అన్నాను అంది. 


అంత ఉదయాన్నే ఆ మాటలు వినేసరికి గౌరీ బాధ తనుకొచ్చేస్తుంది. అమ్మగారు అని పనిమనిషి మాటవినబడగానే ఇంక అక్కడే ఉండలేని స్థితిలో అప్రయత్నంగానే వంటగదిలోకి వచ్చింది. గౌరీని చూసి అత్త,చిన్నత్తగారు ఉన్నపళాన ఇదైపోయి ఏం జరగనట్టు ప్రవర్తిస్తున్నారు. ఇదిచాలదన్నట్టు వంటగదిలోకి అడుగుపెట్టిన గౌరీకి అదే గదిలో తోటికోడలని చూడగానే మీద పిడుగు పడినట్టైంది. వచ్చి రెండ్రోజులు కూడా కాని పిల్లముందు పెదకోడలని ఇలా అంటున్నారా? శాపాలు పెడుతున్నారా?? మెదడు మొద్దుబారిపోయింది. ఏటు కదలలేకపోతుంది. లోలోపల తన్నుకొచ్చిన దుఃఖాన్ని కళ్ళకవతలే ఆపేసే ప్రయత్నం చేస్తుంది. బయట నుండి గౌరమ్మగారు అని వినపడగానే ఈ కుంపటి నుండి బయటపడేయటానికి లోకభాందవుడిని పిలుపు వినపడినట్టుగా హా..వస్తున్నా అని ఒక్క ఉదుటున బయటపడింది. అలానే ఏటూ చూడకుండ పైన గదిలోకి వెళ్ళిపోయింది.హా..వస్తున్నా అనే మాట తన గొంతు దాటి బయటకి రాలేదు. తను నడుస్తూ వెళ్ళానని తను అనుకుంది.అది నడక కాదు పరుగని బయటనుండి చూస్తున్న పనిమనిషికి మాత్రమే తెలుసు. వాళ్ల గది తలుపు తెరవగానే గదిలో కాశీ లేడు. ద్వారాలకి, విస్తరాకుల కోసం తోటకి వెళ్ళాలి అని గుర్తు. వేగంగా వచ్చి మంచంపైన కూర్చుని వలవలా ఏడ్చింది. బాధ పెరిగిందే కానీ తీరలేదు. కొంచెంసేపయ్యాక ఓపిక చేసుకుని లేచి మొహం కడుక్కుంటుండగా తలుపు చప్పుడయ్యింది. కాశీ ఏమో అనుకుంది..కాదు తోటికోడలు..రా.రా..కూర్చో...ఏంటి వచ్చావు అంటే... మీ గదిలో బోషాణంలో చీర మిమ్మల్ని అడిగి కట్టుకోమన్నారు అత్తయ్యగారు అని చెప్పింది. అడగడం ఎందుకు నీకు అంతే హక్కుంది కదా అని నవ్వు తెచ్చుకుని సమాధానమిచ్చింది. తన నెమ్మది, బొంగుర గొంతుమాత్రం తన బాధని చెప్పేస్తుంది. గౌరీకి తన తోటికోడలు మరీ చిన్నపిల్లగా కనిపిస్తుంది. మీరు వాళ్ళన్న మాటలు విన్నారు కదా అక్క!! అని అంది. గౌరీ ఏం మాట్లాడలేదు.. మంచి వాళ్ళకే కష్టాలు అక్క!! అని అంది. ఈ పిల్ల మాట్లాడుతుంటే చిన్నపిల్లలు  మాట్లాడుతున్నట్టు ఉంది. అందులోను ధైర్యం చెబుతున్న మాటలు వింటే ఇంత బాధలోనూ ఆమె అమాయకత్వానికి గౌరీకి లోలోపల నవ్వొచ్చింది. చీర తీసిచ్చి ఎలా కట్టుకోవాలో, ఏం మ్యాచింగ్ కట్టుకోవాలో చెప్పి, బావుంటదని తన నెక్లెస్ ఇచ్చి పంపించింది. వెళుతూ ఆ పిల్ల మీరు విన్నారని వాళ్ళకి కూడా తెలుసు అక్కా!! అని అంది. గౌరీ ఆత్మాభిమానం కలది..అందులోను ఆడపిల్ల. అంత సామాన్యంగా వేరే వాళ్ళ వద్ద తన బాధని చెప్పుకోదు. సరే నువ్వెళ్ళు అంది గౌరీ. ఏం తెలియనట్టు రెడీ అయ్యి పనుల్లో మునిగిపోయింది. కాశీ వచ్చాడు. మొహం చూడకుండా,చూపించకుండా తిరిగింది. ఎక్కడ అందరిలో బాధపడిపోతానేమో అని. పూజలో తను ఇచ్చిన నెక్లేస్ తోటికోడలు పెట్టుకోలేదు. పెట్టుకోవద్దన్నారని అర్ధమయ్యింది.


మరుసటిరోజు సాయంత్రం పెదపట్నం బయలుదేరారు. బస్సులో కిటికీ పక్కన దిగులుగా కూర్చుంది. ఏంటి అలా ఉన్నవు? ఏమైందని కాశీ అడిగాడు. తనేం మాట్లాడలేదు. కాశీ భుజం పట్టుకుని వాలిపోయింది. ఏదో అయ్యిందని కాశీ గ్రహించాడు. ఏం అయ్యింది అనడిగేలోపు తన భుజం పైన షర్టు భాగం తడిచినట్టు తెలుస్తుంది. ఏం అయ్యింది అని కళ్ళలోకి చూస్తూ అడిగాడు. కళ్ళలో అప్పటికే నీటి సుడులు తిరుగుతున్నాయి. కాశీని చూసింది. చెప్పకూడదని అనుకుంది. ఆగలేక, ఉండబట్టలేక చెప్పేసింది. కాశీ చేతుల్లోకి తీసుకుని సర్దిచెప్పాడు. తను మాట్లాడతానంటే ఈ విషయం ఎవరివద్ద మాట్లాడద్దు అని చెప్పింది. ఇంటికి వచ్చిన తర్వాత కొన్ని రోజులు అదే బాధలో ఉంది. తనకి ఉద్యోగమొచ్చిన విషయం కూడా ఇప్పుడు ఆనందమివ్వట్లేదని చెప్పింది. ఏదో అన్నారని నువ్వు సాదించింది ఆనందమివ్వట్లేదని అంటావు ఏంటి?? అని అనేసరికి నిజమేకదా అనుకుంది. పాఠశాలలో జాయినవ్వాల్సిన టైం కి జాయిన్ అయ్యింది.


తనకిష్టమైన పని కాబట్టి ప్రశాంతంగ, ఆనందభరితంగా సాగిపోతుంది. అలా ఉపాద్యాయురాలిగా రెండేళ్లు పూర్తిచేసుకుంది. కాశీ, గౌరీ ఇద్దరూ అయిదవ సంవత్సరాల పెళ్ళి జీవితంలోకి అడుగుపెట్టారు. ఆయుర్వేద పద్ధతిలో తెలిసిన వాళ్ళు చెబితే ఆ చూర్ణాలు వాడుతున్నారు.ఈలోపు ఒక శుభవార్త తెలిసింది. తోటికోడలు నీళ్ళోసుకుంది అని. చాలా ఆనందపడ్డారు. చిన్నత్త అన్న మాటలు గుర్తొచ్చాయి. ఇది గుర్తుతెచ్చుకోవాల్సిన, బాధపడాల్సిన సమయం కాదని అనుకుంది. సీమంతానికి వెళ్ళారు. నేను చెప్పిందే నిజమయ్యిందని చిన్నత్త పొగరుగా చూస్తుంది. కొందరూ బాధతోనూ, కొందరు ఎగతాళితోను మాట్లాడుతున్నారు. ఇలాంటివన్నీ ఉంటాయని తెలిసినా తన ఇంట్లో శుభకార్యమని వచ్చింది. ఇది తోటికోడలి సీమంతం కాదు తన క్షేమసమాచారాల విచారణ మరియు సంతాప వేడుకలా అనిపించింది. అత్తగారు పూర్తిగా దూరం పెట్టినట్టే ప్రవర్తించింది.

అందరూ వెళ్లిపొయారు ఏదో ఒక నిప్పుకణిక పడితే చాలు పెద్దతగువైపోతుంది అన్నట్టు ఉంది వాతావరణం. ఆ క్షణం రానే వచ్చింది. అత్తగారు మొదలుపెట్టింది. నీ తోటికోడలు కూడా నీళ్ళుపోసుకుంది. నువ్వెప్పుడు? అని అడిగింది. మా ప్రయత్నం మేం చేస్తున్నాము అని గౌరీ అంటే..ఏంటి పిల్లల్ని వద్దని ఆపడానికి ప్రయత్నమా అని రెట్టించింది. ఆవిడ ఇలా అంటుంది... పెళ్లైన మూడేళ్ళు అంటే చదువు, ఉద్యోగం అనుకోవచ్చు. పైగా ఇప్పటికి రెండేళ్ళు ఉద్యోగం కూడా చేసావు కదా!! ఇంకేం ఉన్నాయి చేయాల్సినవి. పెళ్ళై ఆరేళ్ళవుతున్నా పిల్లల్ని వద్దంటున్నావు అంటే నిన్నేమనాలి? అంది. నేను వద్దనడం ఏంటత్తయ్యా?? అని అంటే.. వాడొక పిచ్చోడు..నువ్వేమన్నా దానికి తలూపుతున్నాడని వాడిని తండ్రి అయ్యే భాగ్యం లేకుండా నీకిష్టమొచ్చినట్టు చేస్తున్నావు. పైగా వాడికి నా మీద లేనిపోనివి చెప్పి నన్నే అనేలాగా తయారుచేసావు నువ్వు అంది అత్తగారు.నేనేమని చెప్పాను అంటే చిన్నోడి పెళ్ళయ్యాక నేను, మా చెల్లి నిన్ను అంట అనరాని మాటలన్నామంట.. ఏరోజు నన్నేమనని వాడు నీ వల్ల, నువ్వు వచ్చాక నన్ను అన్నాడు అని కన్నీళ్లు పెట్టుకుంది అత్తగారు. అంటే కాశీని అడగద్దు అన్నాకూడా వీళ్ళని అడిగాడన్నమాట. తను చెప్పింది చేయకపోయినా తనని సపోర్ట్ చేస్తూ మాట్లాడాడు అని లోలోపల కొంచెం ఆనందపడింది గౌరీ. తెలియకుండనే నవ్వు మొహంలోకి వచ్చేసింది. అది అత్తగారికి ఇంకా కోపం తెప్పించింది. అసలు వాడిని సరిగ్గా చూసుకుంటున్నావా?? నాకళ్ళతో నే చూసాను...పని చేసొచ్చి చేయి లాగుతుందని నూనె మర్దనా చేయమంటే చేసావా నువ్వు?? నేనున్నప్పుడే చేయలేదంటే నేలేనప్పుడు ఇంకేం చూస్తావు వాడిని ప్రేమగా అంది. అసలు మీకు ఆరోజు జరిగింది తెలియదత్తయ్యా...కాశీని నేను ఎంతలా ప్రేమిస్తానో మీ అబ్బాయినే అడగండి. హా..వాడు అవుననే అంటాడు. వాడు మంచోడు కదా!! ఇంతలా కొడుకుని వెనకేసుకొస్తుందని ఆశ్చర్యపోయింది గౌరీ. ముమ్మాటికి నీకు పిల్లలప్పుడే కావాలని లేదు..అందుకే వాడు నూనె రాయడానికి రమ్మంటే నువ్వు వెళ్ళలేదు.వెళ్ళలేదు.. అని గట్టిగా అంది అత్తగారు. గౌరీకి కోపం నషాలానికి అంటుతుంది. ఆ ఒక్క సంఘటన చూపించి నేనే వద్దన్నాను..నాకు పిల్లలు అప్పుడే వద్దనుకున్నానని మీరు ఎలా అంటారని అరిచింది గౌరీ.. అత్తగారు ఏం మాట్లాడలేదు..మళ్ళీ అరిచింది గౌరీ. పలుకులేదు అత్తగారికి. గౌరీకి ఇంకా కోపం పెరిగిపోతుంది. మళ్ళీ అరిచింది. అత్తగారు ఎందుకంటే...నేను ఆ రోజు మీరు వంటగదిలో మాట్లాడుకున్నది విన్నాను కాబట్టి. ఆరోజుల్లో కలిస్తే నీకు పిల్లలు కలుగుతారని..అది నీకు అక్కర్లేదు కాబట్టి..వాడు ఎంత రమ్మన్నా నువ్వు వెళ్ళలేదు. ఆరోజుల్లో పిల్లలు కావాలి అనుకున్న ఏ ఆడది అయినా భర్త రమ్మంటే రాకుండా ఉంటుందా... నేనారోజే గ్రహించాను నీ బుద్ధి అని అరిచింది అత్తగారు. అంటే అత్తగారు ఆరోజు పెదపట్నంలో వాళ్లింట్లో కిచెన్లో తమ మాటలు విని, ఆ రాత్రి జరిగింది చూసి ఇలా అర్ధంచేసుకుందనమాట. మాటామాట అనుకున్నారు. మధ్యలో చిన్నత్తగారిని దులిపేసింది. 


అత్తగారు ఒకమాట అనేసరికి గౌరీ వచ్చి రూంలో కూర్చుంది.. గంట తర్వాత కాశీ వచ్చాడు. బట్టలు సర్దమంటావా అని అడిగింది. ఏ? ఎక్కడికి? మనమింకా రెండ్రోజులు ఉంటున్మాము గా అంటే!! గౌరీ ఇలా అంది... పెళ్ళికి.. మీకు మళ్లీ పెళ్లి చేస్తుందంట మీ అమ్మ... ఆవిడని నానమ్మ అవడంకోసం కాదు..మిమ్మల్ని మాత్రం తండ్రిని చేయాల్సిందేనని మీకో సంబందం చూసింది అంట.. వెళ్లి చేసుకోండి అంది. ఈలోపు కింద నుండి సుందరరావమ్మ గారు మొదలుపెట్టింది. అదీ ఇదీ అయ్యి.. అక్కడనుండి తర్వాత రోజే బయటపడ్డారు. కాశీ తమ్ముడుకి మగపిల్లాడు పుట్టాడు. అలా అలా ఒక్కొక్క సంవత్సరం గడిచిపోతుంది. కాశీ, గౌరీ డాక్టర్ని కలిసి మందులు వాడుతున్నారు. యేళ్ళు గడిచే కొద్దీ గౌరీకి ఆత్మవిశ్వాసం సన్నగిల్లిపోతుంది. ఒకప్పుడు ఎంతో నచ్చిన ఉద్యోగంలో ఇప్పుడు రోజుకొకసారైనా స్కూల్లో పిల్లల్ని చూసి పిల్లలు ఉంటే బావుండేది, తమకి పుట్టి ఉంటే వాళ్ళు కూడా ఇంత ఉండేవారు అనుకుంటుంది. ధైర్యం చెప్పీచెపి తాను కూడా ఇప్పుడు ఏదో ఒక క్షణంలో నిరాశలో కూరుకుపోతున్నాడు. కొన్ని సార్లు గౌరీని చూసి ఏమైపోతుందో అని భయపడుతున్నాడు. కాశీ వాళ్ళ తమ్ముడికి ఇంకొక పాప పుట్టింది. వాళ్ళకి మాటలు, నడక వచ్చేసాయి.. వాళ్ళకి పెద్దమ్మ, పెదనాన్న అంటే చాలా ఇష్టం. వీళ్ళకి కూడా వాళ్ళంటే ప్రాణం. యేళ్ళు గడిచేకొద్దీ చుట్టాలు కొంతమంది దూరం పెట్టడం మొదలు పెట్టారు. తమ్ముడిని పిలిచి కాశీని పిలవట్లేదు. ఆ విషయం తెలిసి కాశీ తమ్ముడు కూడా వెళ్ళడం మానేస్తున్నాడు. మనమెందుకు మానేయడమని భార్య అడిగితే ఒక గొడవ కూడా అయ్యిందంట. 



ఒకరోజు గౌరీ కళ్ళుతిరిగి పడిపోతే హాస్పటల్లో జాయిన్ చేసారు. తనకేమైపోతుందోనని కాశీ తెగ భయపడిపోయాడు. టెస్టులన్నీ చేసి ఏం పర్లేదన్నారు. స్పృహలోకి వచ్చి కళ్ళుతెరిచేసరికి కాశీ ఎదురుగా ఉన్నాడు..పట్టుకుని ఏడ్చేసింది..కాశీ కూడా... నా వల్ల అవ్వడం లేదు కాశీ..అవ్వడం లేదు.. పిల్లలు కావాలి కాశీ మనకి...పిల్లలు కావాలి... ఒత్తిడి, మాటలు నేను తట్టుకోలేకపోతున్నాను. నెలసరొచ్చే టైం కి భయమేస్తుంది. ఈనెల రాకపోతే బావుండు..రాకపోతే బావుండు అని అనుకోని నెల లేదు..అది రాకుండా మారదు!! స్వామీ పిల్లలని ఇవ్వకపోయిన పర్లేదు కనీసం ప్రశాంతత ఇవ్వు దేవుడా అని వేడుకుంటున్నాను. ఎందుకు ఇంత నరకంలో ఉన్న మనల్ని వీళ్ళు ఇంకా ఇంకా ఎందుకు చిత్రహింసలు పెడుతున్నారు కాశీ..ఆరోజుల్లో వీళ్లే కనుక ఉండుంటే పెళ్ళై పద్నాలుగేళ్ళైనా పిల్లలు కలగలేదని సీతాదేవిని కూడా గొడ్రాలు అనేవారేమో కాశీ అని లోపల బాధ కూడా బాధపడేలా ఏడ్చింది. 

నువ్వు నిన్ను మాత్రమే కాదు అంతకన్నా ఎక్కువ కాశీని బాధపెడుతున్నవు అని స్నేహితులంటే..నిజమే కదా అని అలోచించి కలిగినప్పుడు కలుగుతారు. కాశీ కోసమైనా ధైర్యంగా ఉండాలని నిర్ణయించుకుంది. అలా ధైర్యంగా ఉండాలి అంటే పిల్లలు కావాలన్న కోరికని కాలానికే వదిలేసి ప్రాశాంతంగా ఉండటమే ఏకైక మార్గమని అనుకుంది. 


వాళ్ళ పదమూడవ పెళ్ళిరోజున ఒక ఆడపిల్లని దత్తత తీసుకుందామని నిర్ణయించుకున్నారు. ఒక అనాధశరణాలయంలో మాట్లాడి ఆర్నెలల్లో పూర్తిచేయవలసినవన్నీ పూర్తి చేసి ఒక పాప ని ఇంటికి తీసుకువచ్చారు. సహస్ర తన పేరు. ఆరోజు వాళ్ళ తమ్ముడు, కొంతమంది స్నేహుతులు వచ్చారు. పాపకి వీళ్ళంటే ప్రాణంగా ఉంటుంది. పాప వచ్చాక కాశీ, గౌరీ ఇద్దరూ పునరుత్తేజం వచ్చిన వారిలా ఉన్నారు. కలిసొచ్చే కాలంలో నడిచొచ్చే కుతురిలా పాప వచ్చిన పదవనెల తర్వాత గౌరీ నెల తప్పింది. ఆ వార్త తెలియగానే పాపంటే ఇంకా ఇంకా ఎక్కువ ప్రేమ కలిగింది ఇద్దరికీ...

కొన్ని నెలల తర్వాత...

గౌరీ కవలపిల్లలకి జన్మనిచ్చింది... ఒక పాప, ఒక బాబు..ఇంక వారి ఆనందమెంతో మీరే ఊహించండి. అదే ప్రశ్న వాళ్ళనడిగితే సహస్ర వచ్చినప్పుడే మాకు పిల్లలు లేరన్న బాధ పోయింది. ఇక  అన్ని బోనస్ అని నవ్వేసారు.


ఈ వయసులో పిల్లల్ని కని ఏం చేస్తారు?? వాళ్ళు పెద్దయ్యేసరికి వీళ్ళకి వయసైపోతుంది అని లోకులు పెదవి విరిచారు. వాళ్ళంతే మారరు అని నవ్వుకుని వదిలేయడమే....


ఎందుకంటే పిల్లలు ఎలా కలిగినా, లేటుగా కలిగినా బంగారమే.... ఆలస్యం అమృతం అమృతం....

శుభం భూయాత్...


ధన్యవాదములు

వశిష్ఠ  ✍️

వంశీకృష్ణ బాజారు





Comments

  1. I liked your writing style and the use of language, in places like - ఇక్కడన్నీ ఒక దారయ్యేవరకు, మేడ పైన లతలల్లుకున్నాయి etc. Authentic charecters and loveable narration. Enjoyed reading something authentic after a long time! Keep writing.

    ReplyDelete
    Replies
    1. Thank you sir for your words... Sure, I will keep writing sir.. 😊

      Delete

Post a Comment

Popular Posts