వశిష్ఠుని కలలు
నా చిన్నప్పుడు ఇంకొక అమ్మానాన్నని చూసాను. నిద్రలేచి అదే చెప్పాను.. అది కల కన్నయ్య అని ముద్దుపెట్టి నిద్రపుచ్చారు.
మళ్ళీ కలలోకి వచ్చారు. మీరు నాకు అక్కర్లేదు వెళ్ళిపోండి అన్నాను అమ్మానాన్న మీద ప్రేమతో.. వాళ్ళకి కోపమొచ్చినట్టు ఉంది. అమ్మానాన్న ఇంక కనపడరని చుట్టూ ఉన్నవాళ్లు చెప్పారు.
కలలో వాళ్ళు మళ్ళీ వచ్చారు. ఈసారి నే పొమ్మనలేదు. అమ్మానాన్నని వాళ్ళే చంపేసారని తెలిసినా నేనేమనలేదు. పెద్దయ్యాక మాత్రం వచ్చిన దాన్ని పొమ్మనకూడదని తెలుసుకున్నాను.
నెమ్మదిగా బాల్యం నాపైన తన మాయని చూపెట్టి ఆవహించుకుంది.
కౌమారపుదశ కలలు ఆనందాన్నిచ్చేవి.
మొక్క చెట్టు అయ్యింది. వయసు యవ్వనంలోకి వచ్చింది...
ఇన్నాళ్ళు కలలు వచ్చేవనుకున్నాను. ఇప్పుడు నేనే నాకు నచ్చిన కలలని పుట్టిస్తున్నాను...
ఇంకా ఇంకా ఆనందాన్ని సంపాదించుకుంటున్నాను. నాకు తెలియనిదేది లేదు.
ఒక్కసారిగా నే కన్న కలలన్నీ రద్దయ్యాయి...
మీసాలు రాని నేను వేదాంతపు భాష్యాలు చెప్పాను. బాధాసంఘటిత కల్పనలు కంటూ వాటితో ఆనందంగా గడిపాను.
వయసుతో పాటు తర్కం భోదపడింది. నాకే వేదాంతం తెలియదని తెలిసింది. అది తెలుసుకోవటమే వేదాంతమని అర్ధమయ్యింది.
జ్ఞానార్జన మొదలుపెట్టాను.. సమాజాన్ని చదువుతున్నాను..
కొందరికి ఆకలి కల..దీనులకి అది తీరుట కల... ఆర్తులకి వేకువ కల.. వయసుకి వలపుల కల, కామాందులకి మోహపు కల, తల్లికి కుటుంబం కల.. భక్తులకి దేవుడి కల..కొందరికి డబ్బుల కల. మరికొందరి ప్రతిష్ట కల.. ప్రజలకి మంచి పరిపాలన కల.. రాజకీయవేత్తలకి అన్నీ కావాలని కల..
పరులకోసం పాటు పడటం నాకొక కల.. అది చేస్తే నిదురే ఉండదు..ఇంక కల ఏం మిగులుతుందని విరమించుకున్నాను..
ఇంకాస్త వయసొచ్చింది..
కలలు పుట్టేవి మాత్రమే కాదు..మనం కట్టేవి కూడా...
కలల్ని తరుముకుంటూ వెళ్ళాను. అపజయం పలకరించింది. పక్క గదిలో విజయం నీకొసం ఎదురుచూస్తుందని వెళ్ళమంది.
అక్కడా అపజయమే ఎదురుపడింది. నాతో ఆటలాడింది.
కలలకి వరుస క్రమమిచ్చాను... ఒకటి పొందేలోపు ఇంకొకటి చేజారిపోయింది. పిచ్చివాడిని!!
కలలను కంటూ కాలాన్ని తింటూ అడుగులేస్తున్న కలకాలపు కలికాలపు ఆశాజీవిని.
కాలాన్ని తిట్టాను, సమాజాన్ని నిందించాను... ఈసారి నిస్పృహ నన్నావహించింది.
ప్రతీ దానికి సాకు వెతుకుతూ పోయాను. అవి సులభంగానే దొరికాయి.
నన్ను బద్దకం ఆవహించుకుంది... అంతరాత్మ నన్నసహ్యించుకుంది.
నా దేహం, బుద్ధి కొట్టుకుని దేహం బుద్ధిని వదిలేసింది. వినాశ'కలే' విపరీత బుద్ధి.
కలల కాడెని వదిలేసాను. నా కలలన్నీ కారాగారంలో బందించేసాను. తాళం విసిరేసాను.. ప్రశాంతంగా ఉంది. కలలే లేని కల అతీతుడిని. అదృష్టవంతుడిని.
లోకాన్ని గెలిచానన్న ఆనందంతో నిద్రలోకి జారుకున్నాను..
ఓ కలలు లేని కబోది ఇంకెందుకు నీ బ్రతుకని, ఉనికని కల వెక్కిరించింది.
నే వెతికిన ప్రతీ సాకు తప్పని..అసలు సాకు 'నువ్వే' అని కల అరిచింది. ఉలిక్కిపడిలేచాను...
నేవదిలినా నన్నొదలదీ కలనుకుని వెర్రెత్తిపోయాను. దాని అంతం చూద్దామని నిదురే లేకుండా బతికాను.
నిదుర(గమ్యం) లేని బతుకొకటేనా??
నాలానే వెర్రి కలలు కంటూ చనిపోయిన నా మిత్రుని పాడె మోసాను.. కలలు తీరక వెళ్ళిపోయిన మనిషి దేహం మరింత బరువే కాదా..గుండె బరువే కాదా!!
కోపమొచ్చింది. బాధేసింది..భయమేసింది.. రెండూ కలిసి ప్రశ్నించాయి.
నే చేసిందేమిటి?? వదిలేసి పారిపోవడం.. ఎంత పారిపోయిన నాకెదురయ్యేది అశాంతే!! అక్కడే నిలబడిపోయాను. నా కలలకి నా కాళ్ళే కదా అడ్డు!!
కలల జీవితంలో నిజాన్ని వెతుకుతూ నిజజీవితంలో కలల్లో బ్రతికాను.
శక్తినంతా కూడదీసుకుని ధైర్యం చేసి తల పైకి ఎత్తాను... నే కన్న కలలు అన్నీ పెను తుఫానులా నా మీద పడ్డాయి. మనసు తేలికపడింది..
ఎదురుగా గుర్రం వెర్రిపట్టి పరుగుదీస్తుంది. నా ఏడుపునే సకలింపులుగా అరుస్తుంది.. దాని వెంటే ఉరకలేసాను... కుమ్మిపడేసింది. అలసిపోయాను...
అయినా వదలలేదు... దెబ్బలు తిన్నాను.. చివరాఖరికి కళ్ళెం చేతపట్టి లొంగదీసుకుని పిచ్చివాని వలె వెర్రి అరుపులు అరిచాను...
నాపై నే జరిపే యుద్ధానికి సమరశంఖం పూరించిన మాధవుడిని నేను!!
నే కన్న కలలు సాధించే కలెగ్జాండర్ ని నేను. నన్ను నేను జయించబోయే జగజ్జేతని నేను... అని అరిచాను
నన్ను నేను జయించబోయే జగజ్జేతని నేను...
ధన్యవాదములు
వశిష్ఠ ✍️
(వంశీకృష్ణ బాజారు)
భాషా ప్రయోగం చాలా బాగుంది. నీ కలానికి కాలం కలిసి రావాలి అని,నీ పద ప్రయోగం మరింత మందిని పలకరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నీ ముద్దుల మావయ్య.
ReplyDeleteThanks puri 😊😊
DeleteIdi prati yuvata gaada la undi ,Padaprayogam....vadakam chaala bagundi. శుభాశీస్సులు
ReplyDeleteThank you andi 🙏. Subham bhuuyath 😊
Delete