సత్య & Satya's Dairy - Part1

స్కూల్... జ్ఞానాన్ని విడివిడిగా గంటల్లో పంచుతున్న చోటు.

ఈసారి మీరు గాలిలో విమానంలో ఎగురుతున్నప్పుడు కిటికీలో నుండి బయటకి చూడండి. పక్కనే మేడలు, కోటలు, శిఖరాలని, మేఘాలని దాటిపోయిన పిల్లల ఉత్సాహం మీకు కనిపిస్తుంది. అలాంటివారందరూ ఉన్న విద్యాఉద్యానవనం.

అది మద్యాహ్నవేళ...

తొమ్మిదవ తరగతి...గణితం క్లాస్ అప్రతిహతంగా సాగిపోతుంది. లెక్కల టీచర్ ఆనందరావు అంటే విద్యార్థులందరికి భయం,గౌరవం. సరళ రేఖలు ( // lines) ఏవిధంగా కలవవో అలానే ఆయన పాఠం చెప్తుంటే విద్యార్థుల పెదవులు మెదలవు. పేరుకి సౌమ్యుడే అయినా క్రమశిక్షణ విషయంలోకి వస్తే మాత్రం కఠినంగానే ఉంటాడు. స్నాక్స్ బాక్సులు తెరుచుకోని ఒకేఒక్క క్లాస్. ఓపికలేమి అంటే తెలియని విద్యార్థులు శ్రద్ధగా వింటున్నారు. ఆఖరు బెంచీ గుసగుసలాడుతోంది. చిన్న చిన్న చిలుకపలుకలు వినపడుతున్నాయి. మాష్టారు వెనక్కి తిరిగి ఆఖరు వరుస వైపు చూసారు. మాష్టారుతో పాటే క్లాసులో ఉన్న నలభై మంది తలలు అటే తిరిగాయి. పాపం వాళ్ళకి ఏం జరుగుతుందో అర్ధంకాక చివరి బెంచీ చిరంజీవులు బెదిరిపోయారు. వాళ్ళు శ్రద్ధ గానే వింటున్నారు అని నమ్మకం కుదిరిన తర్వాత క్లాసు కొనసాగింది. 

టీనేజ్ పిల్లలని అల్లరి చేస్తూ కానీ,తప్పు చేస్తూ కానీ పట్టుకోవాలంటే అస్సలు దొరకరు. వాళ్ళంతట వాళ్ళే దొరికిపోతారు.అదే వింత!! మీరు పట్టుకుంటే మేము దొరకడం ఏంటి అనుకున్నారేమో!! ఆనందరావు బోర్డు వైపు తిరిగిన వెంటనే చిన్న చిన్న  వినపడుతున్నాయి. ఓపిక నశించి వెనక్కి తిరుగుతుండగా ఒక పెన్ను వచ్చి దొర్లుకుంటూ ఆనందరావు దగ్గర్లో పడింది. ఒక్కసారిగా నిశ్శబ్దం కమ్మేసింది. మొదటి బెంచీ అమ్మాయిలు ఆఖరు బెంచీ అబ్బాయిల వైపు ఒక హీనమైన చూపు చూసారు. కానీ వెనుక వరుసలోని అందరికీ తెలుసు పెన్ను ఎటు వైపు నుండి వచ్చిందో. మాష్టారు ఆఖరు బెంచీ అమ్మాయిలని నిలబెట్టారు. వరుసలో శ్రావ్య,మిథున,సత్య లేచి నిల్చున్నారు. లాస్ట్ బెంచ్ అబ్బాయిలు గర్వంతో ఒక చూపు విసిరారు. ముగ్గురూ తెలివైనవాళ్ళే. ఏం చేస్తున్నారు అని అడిగారు ఆనందరావు. లెక్క గురించి చర్చించుకుంటున్నాం సార్ అని ముగ్గురూ ఒకేసారి అన్నారు. పెన్ను ఎవరిది? నాది సార్ అంటూ శ్రావ్య చేయి పైకి లేపింది. నోట్సు తీసుకుని వచ్చి ముందు బెంచీలో కూర్చో అన్నారు. సత్య ఏదో చిన్నగా గొణుగుతున్నా వినకుండా,ఏం మాట్లాడకుండా శ్రావ్య ముందు బెంచీలో కూర్చోవడానికి వెళ్లిపోయింది. 

శ్రావ్య వచ్చి కూర్చుంది. నోట్స్ రాశావా? రాస్తున్నాను సార్...ఏది చూపించు.. శ్రావ్య చూపించింది..మాష్టారు ఇప్పుడు చెబుతున్న లెక్క ఆల్రేడీ  చేసేసింది. లోలోపల బ్రతికిపోయాను అని ఆనందపడుతుంది. కింద పడిన బ్లూ పెన్ను నీదైతే మరి నీ బుక్ లో ఉన్న బ్లూ పెన్ను ఎవరిది? అని సార్ నుండి ప్రశ్న వచ్చింది. ఒక్కసారిగా ఖంగుతింది. ఇందాక సత్య గొణిగిన మాటలు ఇప్పుడు స్పష్టంగా వినిపించాయి. నీ పెన్ను ఇక్కడే వదిలివెళ్ళు అని చెప్పింది. ఏం చెప్పకుండా అలానే నిలబడిపోయింది. సరిగ్గా అప్పుడే కరెంట్ పోయింది. క్షణాల్లో పంఖా(ఫ్యాన్) చప్పుళ్ళపై నిశ్శబ్ధం పైచేయి సాదించింది. నిన్నే అడుగుతున్నాను ఆ పెన్ను ఎవరిది? కరెంట్ పోవడం వల్ల అనుకుంట ఈసారి మాష్టారి మాట కటువుగానూ,పెద్దదిగాను ఉంది. శ్వాస కూడా వినిపించేంత నిశ్శబ్దం. ఇంత నిశ్శబ్దంలో భయం దాక్కోవడానికి నిలువనీడలేకుండా పోయింది. ఎనభై కళ్ళు ఏం జరగుతుందా అని అయోమయంతో తదేకంగా చూస్తున్నాయి. గాలి లేకపోవడం వల్లనేమో వేడిగా ఉక్కపోయడం మొదలయ్యింది. ప్యూన్ వచ్చి మిమ్మల్ని ప్రిన్సిపల్ సార్ పిలుస్తున్నారు అని ఆనందరావు మాష్టారుని తీసుకువెళ్తే బావుండు అని ప్రార్ధనలు చేస్తుంది శ్రావ్య. ఈలోపు వెనుక బెంచీలో నిదానంగా సత్య మళ్ళీ లేచి నిల్చుంది. ఇప్పుడు సార్ తో పాటు అందరిచూపు సత్యపైనే ఉంది. పెన్ను నాదే సార్ అంది. ఆనందరావుకి కోపం వచ్చింది. చెక్క స్కేలు తీసుకుని సత్య అరచేతి పైన ఒక దెబ్బ వేసారు. తరగతిలో ఉన్న ఇంకొక ఇరవయ్యొక్క మంది ఆడపిల్లలందరూ వాళ్ళకే దెబ్బ తగిలినంతగా 'స్' అన్నట్టు ప్రతిస్పందించారు. అసలే ఆడపిల్ల, పైగా కౌమారదశ, అందులోనూ తరగతిలో అందరిముందూ పైగా తను చదివే అమ్మాయి...మాష్టారు కొట్టేసరికి తట్టుకోలేకపోయింది. అంతర్లీనంగా ప్రవహించే సరస్వతీ నది ఈ చదువుల సరస్వతి చెంపలపై పారుతుంది.

పైనల్ లాంగ్ బెల్ మోగింది. మిథున సత్యని ఏడవద్దు అని సర్ది చెబుతుంది. శ్రావ్య ఇద్దరి దగ్గరకి వచ్చింది. సారీ అని చెప్పింది. అయినా సత్య మొహంలో బాధ, కోపం తగ్గలేదు. ఒక్కసారిగా ఉండబట్టలేక శ్రావ్య సత్య మొహం మీదే నవ్వేసింది. మిథున కూడా!! నన్ను చూస్తుంటే మీ ఇద్దరికి నవ్వొస్తుందా? మీకు తన్నులు పడి ఉంటే తెలిసేది అని అరుస్తూ సత్య కూడా నవ్వేసింది. కానీ అందరి ముందూ తనని దండించినందుకు ఆనందరావు మాష్టారు పైన కోపంగా ఉంది.

గేటు బయటకి వచ్చేసరికి సత్య వాళ్ళ నాన్నగారు స్కూటర్ పైన ఎదురు చూస్తున్నారు. ఏం మాట్లాడకుండా ఎక్కి కూర్చుంది. సత్య వాళ్ళ నాన్నగారు ఏదో అడుగుతున్నారు. ఆయన హెల్మెట్ పెట్టుకుని ఉండడం, పైగా ట్రాఫిక్ శబ్ధాల వల్ల సత్యకి ఏం వినిపించలేదు. నిజం చెప్పాలి అంటే బాధ,కోపం తో ఏం వినాలనిపించలేదు. డైరెక్ట్ గా ఇంటికి వెళ్ళకుండా మూడు వీధులవతల వైపుకి వెళ్తున్నారు. స్కూటర్ పానీపూరీ బండి ముందు ఆగింది. నాకేం వద్దు..నేను తినను అని అంది సత్య. సరే అని ఇంటికి వచ్చేసారు. ప్రతిరోజు రాగానే అమ్మా అని పిలిచే సత్య ఆరోజు పిలవలేదు. నేరుగా తన రూం లోకి వెళ్ళిపోయింది. అంటే స్కూల్ లో ఏదో అయ్యిందనమాట. వెనకే వచ్చిన వాళ్ళ నాన్నతో ఏంటి అది అలా ఉంది? అని గిరిజ అడిగింది. ఏమో నాకూ తెలీదు. పానీపూరీ కూడా తిననంది అని చెప్పారు. అవునులే తండ్రికి ఏం తెలుస్తాయి పిల్లల గురించి!! తల్లిని కాబట్టి నాకే తెలుస్తాయి అని అంది. ఏం అయ్యిందమ్మా?? అని అడిగింది. సత్య నుండి ఏం సమాదానం రాలేదు.. ఒంట్లో బాలేదా? డేట్ వచ్చిందా? ఉహు..లేదు.. మరి? మా లెక్కల టీచర్ కొట్టారు అమ్మ అని ఎర్రగ వాచిన చేయి చూపించింది. అసలే పాల రంగులో ఉండే అరచేయి ఎర్రగా మారే సరికి వాళ్ళ అమ్మకి బాధ, కోపం కట్టలు తెంచుకుని వచ్చాయి. అసలు ఇలా ఎర్రగా కందేలాగా మీరు పిల్లని ఎందుకు కొట్టారు? అని చాలా గట్టిగా అరిచింది. హాల్ నుండి ఏ స్పందనా రాలేదు. మిమ్మల్నే పిల్లని ఎందుకు కొట్టారు అన్న ప్రశ్న పూర్తయ్యేలోపు కొబ్బరినూనె డబ్బా తీసుకుని రూంలోకి వచ్చాడు. వస్తూనే 'సారీ' అని సైలెంట్ గా మిన్నకుండపోయాడు.

చేతికి కొబ్బరినూనె రాసిన తరువాత సత్య వాళ్ళ నాన్నతో పద పానీపూరీ తినడానికి వెళ్దాము అంది. ఇందాకే కదా తిననన్నావు!! అంటే. అప్పుడు నువ్వు అడిగావు కదా తింటావా అని!! అందుకే వద్దన్నాను. ఇప్పుడు నాకు తినాలనిపించింది. నేను అడుగుతున్నాను. పదా వెళ్దాం అని లేచి బయటకి వచ్చి చెప్పులు వేసుకుని గేటు తీసి బయట నిల్చుంది. వాళ్ళ అమ్మ అయితే వాళ్ళ నాన్న మొహం మీదే నవ్వేసింది. గడుసుదాన్ని చేసుకుంటే గడుసుదే పుడుతుంది కదా అని ఒక చురక వేసి మరీ ఆనందరావు గారు బయటకి వచ్చేసారు. 

ఆరోజు రాత్రి నిద్రలో మెలుకువ వచ్చి లేస్తే హాల్లో నుండి అమ్మానాన్న మాటలు వినపడుతున్నాయి. ఇలా వినడం తనకి కొత్త కాదు. వాళ్ళు వందమాటలు మాట్లాడితే అందులో అరవై తన అల్లరి,తన భవిష్యత్, ఇంటి మీద తీసుకున్న లోను, దాస్తున్న పొదుపుగురించే ఉంటాయి. ఎంతో ఇష్టం ఇలా వాళ్ళ మాటలు వినడం. తన కోసం అమ్మానాన్న చేస్తున్నవన్నీ తెలుసు కాబట్టి సత్య కూడా అలానే తగ్గట్టుగా  ఉంటుంది. అయినా దాన్ని మీరు అలా కొట్టి ఉండాల్సింది కాదు అండీ అంది. లేదే! నేను చూసేసరికే ఆ పెన్ను ఒకమ్మాయి పక్కగా వచ్చింది. పొరపాటున పక్కకి తిరిగి ఉంటే కంటికి తగిలే ప్రమాదం.శ్రావ్యని మందలించి వదిలేద్దాం అనే అనుకున్నాను కానీ ఆ ఘనకార్యం చేసింది మన క్వీన్ విక్టోరియా గారే చేసారని తెలిసీ కొట్టాను. నేను మన మిస్సమ్మని ఒక దెబ్బ వేస్తే మాష్టారు అల్లరి చేస్తే బాగా చదివే అమ్మాయి పైగా సొంత కూతురినే కొట్టారు అని క్లాస్ లో అందరూ గీత దాటకుండా ఉంటారు. అసలే ఈ రోజుల్లో పిల్లలు ఎలా ఉంటున్నారో నీకు తెలియంది కాదు. నాకు ఒకింత శ్రమ తప్పించినట్టే మన అమ్మాయి అని నవ్వాడు. సర్లే ఇంకెప్పుడూ అలా చేయద్దు అని అంది. అంటే బాగా అల్లరి చేస్తుంటే దారిలో పెట్టడానికి అవసరం అయితే కొట్టచ్చనమాట!! సత్య తనలో తను ఇలా అనుకుంటుంది. ఆరోజు నాకది నచ్చలేదు, అర్ధం కాలేదు!! తర్వాత కొన్ని రోజులు నాన్నతో మాట్లాడలేదు. ఇప్పుడు నా కోడుకు కూడా నాతో మాట్లాడటం మానేస్తే? కొట్టానని బాధలో ఉన్న సత్యకి ఈ ఆలోచన ఇంకా బాధ పెట్టింది. అప్పుడు నాన్న ఎంత బాధ పడి ఉంటారో అనుకుని ఇంకా కుమిలిపోతుంది. ఒక్కసారిగా కళ్ళు తుడుచుకుని అయినా నేనేం చేసానని! నాన్న చేసిందే కదా!! నాన్న ఎప్పుడూ తప్పు చేయరు. అంటే నేను ఇప్పుడు చేయనట్టే!! అని తన చిన్నప్పుడు జరిగిన సంఘటనని గుర్తుచేసుకోగానే తనకి ఊరట కలిగింది. ఒక్కసారిగా కరెంట్ పోవడంతో సత్య ప్రపంచంలోకి వచ్చింది. తన ఒడిలో నిదురపోతున్న తన కొడుకుని చూసింది. అమాయకత్వమంతా వాడి మొహంలోనే ఉంది. వీడినా నేను కొట్టింది అని చెంపలపై జారుతున్న కన్నీళ్ళని తుడుచుకుంటూ కొవ్వొత్తి వెలిగించడానికి లేచింది. ఇప్పుడు తనకి కొంచెం ప్రశాంతంగా అనిపిస్తుంది. థ్యాంక్స్ నాన్న అని మనసులో చెప్పుకుంది. తర్వాత రోజు ఉదయాన్నే నాన్నకి ఫోన్ చేసి ఆ విషయం తప్ప అన్నీ చెప్పింది.



ఇంకా ఉంది...ఇంకా ఉంది...ఇంకా ఉంది...ఇంకా ఉంది... 

To be continued...


ధన్యవాదములు

వశిష్ఠ ✍️



Comments

Popular Posts