P2 - నాకు తెలిసిన కళ్యాణ్

ఒంటరివై ఉలిని పట్టి వేవేల మదులు తట్టి రాకొండని తొలుచుట తలపెట్టిన ఓ మనిషి!!

రాకాసిగిరి వెర్రి విదిలింపునకు జారిపడినదీ నీ దేహం కానీ అదరనిదీ నీ ధైర్యం, చెక్కుచెదరనిదీ నీ ధ్యేయం!! 

నేలజారిన నిన్ను చూసి వెర్రినవ్వు నవ్వెనీ లోకం. నిన్ను చూసి నేనేడ్చాను. కానీ నువ్వు నవ్వుతూనే ఉన్నావు. నేనింకా ఇంకా ఏడ్చాను.


వయసున ఐదు పదుల పసివాడవు నీవు... 

మనిషి తనలో తను కోల్పోయిన మనిషివి నువ్వు!! నేనే నువ్వంటూ ఎదురొస్తావు!!

నీ శ్వాసని సైతం సంతోషంగా పంచగలిగిన ఋషివి నీవు!!

నీ నరమే వింటి శరమై చెడుపై గర్జించు పరశురాముడివి నీవు..

నా గొంతువి నువ్వూ, మా గొంతుక నువ్వు..

దాని మాటున దాగున్నది మహాసముద్రమని ఎరుగక విర్రవీగెనీ వెర్రి పర్వతం..నువ్వా సంద్రం పంపిన సందేశం.. ఐతే నువ్వు కూలదోస్తావు లేక ఆ సంద్రమే కొండని కులదోస్తుంది!! 


పడవ ముందుకే వెళ్తుంది... మరి తెడ్డు?? వెనక్కే కదా!!

మహావృక్షం భువిని చీల్చుకుంటూ తారలను ముద్దాడుతుంది. మరి విత్తు, వేరు పయనమెటు?? కిందకే కదా!!

రవి లేనిదే నీడ లేదు..కానీ ఎల్లపుడూ అవి ఎదురుఎదురుగానే తలపడతాయి కదా!!

పయనం మాత్రమే శాశ్వతం..నీ పయనం మాత్రమే శాశ్వతం..

కూలబడిన సమాజానికి వెన్నెముకవై నిలుస్తావని ఆశిస్తూ, సమసమాజపు కలలు కంటూ!!!


వశిష్ఠ✍️






Comments

Popular Posts