ప్రేమించేవాళ్ళు

సాయంసమయం.. ఆరున్నొకటి కావొస్తుంది. ఆరున్నొకటి అంటే ఆంగ్లములో సెవెన్(7) అని. కౌలుకి ఇచ్చిన పొలంలో తల కింద రెండు చేతులను తలగడలా పెట్టుకుని నక్షత్రాలతో మెరిసిపోతున్న ఆకాశాన్ని గడ్డిలో పడుకుని చూస్తున్నాను అచ్చం సినిమా చూస్తున్నట్టు. అంత పెద్ద కొండ కూడా నేనున్నాను అన్నట్టు కంటిలో ఒక మూల ఇరుక్కుపోవడానికి ప్రయత్నిస్తుంది. కీచురాళ్ళ గోలలు, మిడతల కిచ్ కిచ్లు ఈ చిమ్మచీకట్లో తోడున్నామన్నట్టు ఉన్నాయి. ఇంకా హీరో గారు తెర మీదకు రాలేదు.అదే చందమామ!!

చల్ల గాలి వీస్తుంటే విష్ణుమూర్తిలా పక్కకి తిరిగిపడుకోగానే ఇంతసేపు మూలన నక్కిన పర్వతం ముందుకు వచ్చింది. తీరా చూస్తే పక్కనే గడ్డిలో ఫోన్ ఎప్పటినుండో నిశ్శబ్ధంగా మోగుతుంది. ఎవరా అంటే? అమ్మ. ఎక్కడరా అంటే? చేలో(చేనులో) అంటే భయపడుతుందేమో అని గుడి దగ్గర ఉన్నా అని చెప్పాను. సరే అని రేపు మీరు పర్ణశాల వెళ్ళాలి అని అంది. నాకు విషయం భోధపడింది. అక్కడ ఉండేది మా ఫ్యామిలీ మిత్రుడు అయిన రామచంద్ర గారు. మా శ్రేయోభిలాషి ఆయన. ఆయన్ని ఎప్పుడూ కలవలేదు కానీ నా చిన్నప్పుడు ఎప్పుడో ఆయన పెళ్ళికి వెళ్ళినట్టు గుర్తు. పెద్ద పెద్ద వాళ్ళు కూడా వచ్చారు. ప్రత్యక్షంగా కలిసింది లేదు కానీ పరోక్షంగా సామాజిక మాధ్యమాల ద్వారా మా ఇద్దరికి మంచి సయోధ్యే కుదిరింది. కొంతమందితో అంతగా పరిచయం లేకపోయినా ఎలానో,ఏదో విధంగా మనకి మంచి సాన్నిహిత్యం ఏర్పడుతుంది. అలానే మా ఇద్దరికీ కూడా! ఆయన్ని మొదటిసారి కలవబోతున్నాను అంటే ఎంతో ఆనందంగా ఉంది. అదొక తెలియని సంతోషాన్ని అనుభవిస్తున్నాను. ఇంత చెబుతున్నాను అంటే ఆయనకి కూతుర్లు ఉన్నరేమో అనుకుంటే పొరపాటే!! ఇద్దరూ అబ్బాయిలే. అమ్మ వెళ్ళమని చెప్పగానే నేను ఇంత ఆనందపడిపోవడానికి ఇంకో కారణం ఆయన ఉండే ఊరిలోనే "తను" కూడా ఉంటుంది. తన గురించే ఆలోచిస్తూ గడ్డిలో నుండి లేచి ఆ చీకట్లోనే ఇంటికి బయలుదేరాను.

తెల్లవారగానే ఆ ఊరు బయల్దేరాము...

రామచంద్ర గారు ఉండే ఊరిలోనే "తను" కూడా ఉంటుందని చెప్పాను కదా!! తన గురించి చెప్పేముందు తనతో నాకున్న అనుభవాలు, అనుభూతి చెప్పాలి. ఇంతకు మునుపే నేను తనని చాలాసార్లు చూసాను,కలిసాను. వయస్సుతోపాటే తన మీద ఇష్టం పెరుగుతూ వస్తుంది. ఈ విషయం ఇంతవరకు ఎవరికీ చెప్పలేదు నేను. తనని చూడగానే నన్ను ప్రశాంతత ఆవహించేస్తుంది. అంత సోయగం తన సొంతం. అలానే చూస్తూ ఉండిపోతాను. తను మాత్రం నన్ను ఒక మాట కూడా అనదు. ఎంత అందంగా ఉంటుంది తను. ఆ ఒంపులు, తనని అంటిపెట్టుకున్న సౌందర్యాలు. ఏమని చెప్పేది? ఎన్నని చెప్పేది? నన్ను పిచ్చివాణ్ణి చేస్తుంది. మళ్ళీ ఏమీ ఎరగనట్టుగా పిచ్చివాణ్ణి చేసి మంచిగా మారుస్తుంది ఈ వయ్యారి. కోపమొచ్చిందా తనని ఆపతరమా మనం?? కోపంలో కూడా తను ఎంతో ఎంతో ఎంతో అందంగా ఉంటుంది. అంతకు పదిరెట్లు భయంకరంగానూ ఉంటుంది.
తనకి నాలానే రామచంద్ర గారు అంటే గౌరవం. ఆయనకి గౌరవం ఇవ్వని వారు ఎవరు? ఆయన పేరు చెప్పుకుని, అయన అండదండలు ఉన్నాయని చెప్పుకుని ఎన్నికలలో కూడా ప్రచారం చేసుకుంటారు కొందరు. ఆయన నాతో చెప్పిన ప్రతీ మాట నాకు గుర్తున్నాయి, చేసిన ప్రతీ పని నాకు ఆదర్శంగా అనిపించింది. ఇలా ఆలోచిస్తూ ఉండగానే ఊరు వచ్చేసింది. ఉరులోకి రాగానే ముందు "తనే" కనిపించింది. నేను తనని చూసి నవ్వగానే తనూ తిరిగి నవ్వింది. సంతోషమేసింది.

రామచంద్ర గారి మకాము

ఊరు మొత్తానికి ఎత్తైన ప్రదేశంలో కట్టినట్టుగా ఉన్నారు. బయటే కాళ్ళు శుభ్రం చేసుకుని నేరుగా ఆయన ఉండే గది వద్దకు వెళ్ళాము. ఏమి చిరునవ్వు..ఆహా ఏంటా ప్రశాంతత!! నేను చెప్పాలనుకున్నది చెప్పాను. అడగాలి అనుకున్నవి అడిగాను. మనస్ఫూర్తిగా చాలాసేపే మాట్లాడాను ఆయనతో. పరిపూర్ణంగా అనిపించింది. వచ్చిన పని అవ్వడం చేత అక్కడే భోజనం చేసి "తన" దగ్గరకి వెళ్దామని బయలుదేరాము.

తనని ఎప్పుడు చూస్తానా అనే ఆత్రం వీసమెత్తు కూడా లేదు. మామూలుగానే ఉన్నాను. అరగంట ప్రయాణించిన తర్వాత తను ఉండే చోటుకి చేరుకున్నాను. ఎక్కడా కనపడదే తను? కొంచెం దూరం నడిచి వెళ్తూ ఉండగా దూరం నుండి తను కనిపించింది. పెదాలపైన చిరునవ్వు వచ్చింది. తన వైపే నడుచుకుంటూ వెళ్తున్నాను. తనకి కోపం వచ్చి తగ్గినట్టు ఉంది. ఆ ఛాయలు ప్రస్ఫుటంగా చుట్టుపక్కల కనిపిస్తున్నాయి. ఇంకా దగ్గరకి వెళ్ళాను. ఇంకా ఇంకా దగ్గరకి రా అన్నట్టు ఉంది తను. ఇంకా ఇంకా దగ్గరగా వెళ్ళాను. ఇద్దరి మధ్య గాలి కూడా చొరబడలేనంత దూరం మత్రమే ఉంది. తనని ముట్టుకున్నాను. ఆ ప్రకంపనలు తనలో కనిపిస్తున్నాయి. తనేమి అనలేదు. అడుగు దూరం జరిగాను. తననే అలా చూస్తూ కూర్చున్నాను. నేను మాట్లాడుతుంటే తనూ అలా వింటూ నవ్వుతూ ఉంది. పైకి కనపడేంత మృదువు ఏం కాదు తను. గుంభనంగా ఉంటుంది అంతే!! ప్రేమగా ఉండి మర్యాద ఇచ్చావా? మంచిగా ఉంటుంది. లేదంటే ఇంక అంతే సంగతులు.

కప్పు లేని తన అందం, తొడుగు లేని తన నడవడిక చూస్తూ సరిగ్గా ముప్పావుగంట ఉన్నాను. ఇంక పొద్దుపోక ముందే బయలుదేరాలని తన వద్ద శెలవు తీసుకున్నాను. అదేంటో కానీ తన నుండి వచ్చేసే ప్రతీసారీ బాధ వేయదు సరి కదా ఎంతో అంటే ఎంతో తృప్తిగా ఉంటుంది, సంతోషంగా ఉంటుంది. ఇదేనేమో నిజమైన ప్రేమ అంటే!! దీనికి పదింతల తృప్తి రామచంద్ర గారిని కలిసి సంబాషించినప్పుడు కలిగింది. అలా నాకెంతో ఇష్టమైన ఇద్దరి నుండి శెలవు తీసుకుని సంతోషంతో, చాలా ప్రేమతో తిరుగు ప్రయాణమయ్యాము. నా "తను" గురించి ఇంకా చెప్పాలి అంటే "తను" గోదావరి. తనే గోదావరి. రామచంద్రగారే సాక్షత్తు శ్రీరాములువారు. నేను చూసిన ఆయన పెళ్ళే శ్రీ సీతారాముల కళ్యాణం.
ఆయన ఇద్దరి కొడుకులే లవకుశులు. అప్పుడు కళ్యాణం చూసి వచ్చేసాము కాని దర్శనం కుదరలేదు. పర్ణసాలలో గోదావరి అయితే భద్రాచలంలో ఉన్నది రాములవారు.

అయినా ఆయన ఉన్న చోట తను ఉంది. తను ఉన్న చోట ఆయన ఉన్నారు. వీరిద్దరూ ఉన్నచోట నేను కూడా ఉన్నాను. ❤️

గోదారి తీరాన కొలువైయున్న రాములోరి కన్నా ప్రశాంతమైందేది? రాములోరి పాదాల కింద పరిగెడుతున్న గోదారి కన్నా అందమైనదేది?


ధన్యవాదములు

వశిష్ఠ ✍️


Comments

Popular Posts