కల చూపిన కల - Part 1 - భీమార్జునుడు
కల చూపిన కల - Part 1
ఆంధ్ర దేశపు పినాకినీ పరివాహక ప్రాంతం..
నదికి ఇరువైపులా అడవి దట్టంగా ఉంటుంది అచ్చం స్వాములోరి గెడ్డంలాగా. చుక్కలకి చాలా భయం పినాకిని అంటే, పైనుండి చూస్తుంటే మెలికలు తిరుగుతూ పచ్చికలో జర జర పాకుతున్న నల్ల త్రాచులాగా ఉంటుంది కాబట్టి. ఉత్తర గట్టున ఒంపులు తిరిగిన పినాకిని నదిని అంటిపెట్టుకునే ఉంటుంది హంసదామము, అచ్చం నిండు కడవని నడుమునపట్టిన పడతి వలె. దక్షిణపు గట్టున అడవి కాపలాకాస్తూ ఉంటుంది.
ఎన్నో ఏళ్ళ క్రిందట ఉత్తర గట్టున హంసదామం ఊరు స్థిరపడిపోయింది. పళ్ళు, కూరగాయలు, ధాన్యం, వడ్లు, రాగులు, శనగలు, పత్తి, కుమ్మరి, లక్క, తేనె, పిట్టలు, కంసాలి, కొలిమి, ఆయుర్వేదం, మంత్రసాని, కసాయివాడు, తోలు చెప్పులు కుట్టువాడు, ముగ్గు, పొగాకు అన్నిటి పైనా వ్యాపారం జరుగుతుంది. అన్నిటికి అడవే ఆధారం, కాయకష్టమే పెట్టుబడి. రాముడే అందరికీ దైవం. ఊరు మధ్యన ఒక పెద్ద వాడ. అక్కడే నవమికి కళ్యాణం వైభవంగా జరుగుతుంది. మిగిలిన రోజుల్లో వాణిజ్యమంతా ఈ వాడలోనే. పొగాకు గుల్ల ఆకు పాట పెట్టి రాములోరి ఉత్సవాలు జరిపిస్తారు. పొలిమేరన నది ఒడ్డున ఉగ్ర అంకమ్మ దేవత వెలిసింది. ఏడేళ్లకోసారి జాతర జరుగుతుంది.
మధ్యాహ్నవేళ అంతా నిర్మానుష్యంగా ఉన్నప్పుడు ఆహారం కోసం కలుగునుండి ఎలుక బయటకొచ్చింది. వెనకాలనే చుంచులు. వేళ కాని వేళలో అక్కడో ఆపద ఎదురుచూస్తుంది పాము రూపంలో. ఆహారం దొరికిన ఎలుక పాముకి ఆహారమవబోతుంది. పాము కళ్ళు తనపై ఉన్నాయని ఎలుకకి తెలీదు. అలానే పాముకి కూడా! పాము ఒక్క ఉదుటున ఎలుకని పట్టింది. వడగండ్లు వీపుని చరిచిన వేగాన అంతే ఉదుటున డేగ పాముని పట్టింది. విజయగర్వంతో పైకి ఎగరబోతున్న డేగ పైన వలొచ్చి పడింది. తన స్వేచ్చకై పోరాడుతున్న డేగ ముక్కున తన ప్రాణంకోసం పెనుగులాడుతున్న పాము, దాని నోటిన పిల్లల ఆహారానికై వచ్చిన తల్లి ఎలుక. జన్మతః వచ్చిన భయంతో జన్మనిచ్చిన తల్లికి దూరంగా వెళ్ళిపోయాయి చుంచులు. పరమేశ్వర విష్ణు వినాయక ప్రియ జీవుల పెనుగులాటలో రెక్కల విదిలింపులకి ధూళి, తల్లి రోదనకు జాలి కలిగాయి. ఆ దుమ్ముని చీల్చుకుంటూ గంభీరమైన వికటాట్టహాసం దూసుకువచ్చింది. అది భీమార్జునుడిది. అలాగే ఆ పెనుగులాటని చూస్తూ నిలుచున్నాడు. కొంతసేపయ్యాక డేగ పడిపోయింది. ఎలుక, పాము రెండూ అప్పటికే చనిపోయాయి. డేగ శక్తి అంతా హరించుకుపోయింది. వల విప్పి ముక్కు, కాళ్ళని బిగించి ఒంటిచేత్తో ఎత్తలేకపోయాడు. జాతి డేగ అది. నీకు చిక్కినా నేనీకు దాస్యం చేయనని డేగ తెగించి చెప్పినట్టుగా అనిపించింది.
భీమార్జునుడు ఇక్కడి వాడే. నాలుగు పుష్కరాలని చూసి ఉంటాడు. వ్యవసాయం, పాడి చేసుకుంటూ కొడుకు అడవిలో పట్టిన కొండ తేనె అమ్ముకుంటూ జీవనం సాగిస్తున్నాడు. వయసులో ఉన్నప్పుడు పిండి అమ్మే శెట్టి తూకంలో మోసంచేస్తున్నాడని పసిగట్టి అతని దగ్గరే ఒక ఐదు సేర్లు సరుకు కొని దానినే కొలమానంగా తీసుకుని ఆ శెట్టికి కావాల్సిన సరుకులు తూయించి ఇప్పించాడు. బేజారైపోయాడు శెట్టి. ఇన్నేళ్ళుగా శెట్టి తమని మోసం చేస్తున్నాడని తెలుసుకున్న జనాలు శెట్టిని ఊరు నుండి తరిమేశారు. భీమార్జునిడి మాటకి విలువ పెరిగింది. భీమార్జునుడు వరదొచ్చినా మునగడు, కరువొచ్చినా తహతహలాడడు. డబ్బు బాగానే వెనకేశాడు. కాలమేదైనా, సమయమెంతైనా ఆ ఇంటి గుమ్మంలో నిలబడి దేహీ అని యాచించిన చేయి ఒట్టిగా వెళ్ళదు. వయసొచ్చిన కొడుక్కి గుర్రమొకటిచ్చి చుట్టుపక్కల ఊళ్ళపైకి వదిలేశాడు. ఆ కొడుకు ఊర్లన్నీ తిరుగుతూ పన్నులు కట్టలేక, అప్పులు తీర్చలేక ఎంతోకొంతకి భూములను అమ్ముకునే అవసరార్ధులని వెతికి పట్టుకుని తండ్రికి చెప్తే చవకగా ఆ భుములని కొనేవాడు.
తాడి తన్నేవాడొకడుంటే వాడి తలని తన్నేవాడు ఇంకొకడు. వాడి తలని తన్నేవాడు భగవంతుడు. ఆయన అన్నిచోట్లా ఉండటం కుదరదు కనుక మీవంటి ధర్మాత్ములని పుట్టించి పడేశాడు అని అందుకున్నాడు భవన్నారయణ. అందరూ అతన్ని చెంచా..చెంచా అని పిలుస్తూంటారు. ప్రతీదీ అతిసయమే! ఏమిటీ పారేసాడు, విసిరేసాడు అని అగౌరవంగా మాటాడేసానని అనుకుంటున్నారా? వర్షం..వర్షం ఏమవుతుంది? పడుతుంది. గాలి?? చలి పెడుతుంది. సూర్య రశ్మి?? భువిపై పడుతుంది. విసిరిపారేయడం కాకపోతే ఇంకేంటంటా? హరిశ్చంద్రుడు అక్కడానూ, మీరు ఇక్కడానూ!!
అతని మాటలు లెక్కచేయక తదేకంగా డేగనే చూస్తున్నాడు. అది అలసిపోయినట్టుగా లేదు, చక్కగా నిద్దురపోతున్నట్టుగా ఉంది. తను కోరుకున్న డేగని పట్టిన సంతోషం ప్రశాంతతని తీసుకొచ్చింది. అతనికి ప్రశాంతత లభించిన మరుక్షణం మనస్సు లోతుల్లో ఏదో శూన్యం ఆవహించి అగాధపు అంచులవరకు తీసుకెళ్ళి ఆ ముందు క్షణంవరకు ఉన్న అనుభూతిని మరచిపోయేలా చేస్తుంది. డేగని బంటు చేతికిస్తూ ఉండగా అతని దృష్టి పెనుగులాటలో డేగ కాలి గోళ్ళతో బరకపడి/తవ్వబడి ఏర్పడిన లోతైన గొయ్యి/గుంటపైన పడింది. తన మనస్సులోని అగాధమల్లే అనిపించిందది. ఆ అగాధం వెనుకు ఆ గాధ ఏమిటో ఎవరికీ తెలియదు. భీమార్జునుడికి తప్ప! గొయ్యి లోతుగానే చేసింది డేగ. నిద్రగన్నేరు విత్తు తెప్పించి ఆ గొయ్యిలో పాతి కప్పివేశాడు. గొయ్యిలానే తన ఆలోచనలు పూడ్చివేయబడ్డాయి. అంత సామాన్యంగా బతకదు. కంటిపాపలా చూడమని పాలేర్లకి గట్టిగా చెప్పి గుర్రమెక్కి నదివెంబడి చేలల్లోకి వెళ్ళిపోయాడు. ఆ గుర్రంకూడా అడవిలోనుండి స్వయానా తనే లొందీసుకుని వచ్చిన మొండి గుర్రం. దాన్ని అదుపుచేయడం ఇతనొక్కడి తరమే.
ఒక రాత్రి...
కిటికీల గుండా వెన్నెలనాటి చల్లని గాలులు మొగలిపూల సువాసనలు మోసుకొస్తున్నాయి. రేతిరి కీటకాలు మోతమోగిస్తున్నాయి. భీమార్జునుడు మంచంపైన కూర్చుని కిటికీకుండా చూస్తూ శూన్యంలోకి తన ఆలోచనలను పంపిస్తున్నాడు. పెద్ద పందిరి మంచమది ముగ్గురికి సరిపడేంత! అతని తాతకి ఇద్దరు భార్యలు. అందుకే అంత పెద్ద మంచం. తాతల కాలం నాటిదైనా టేకు ఇంకా గట్టిగానే ఉంది. దాని పైన కూర్చుంటే కాళ్లు నేలకి అందనత ఎత్తు. చిన్న వయస్సులోనే పెళ్ళి అవ్వడం చేత పెళ్ళికూతుళ్ళు కొత్తలో ఆటగా ఎక్కి దుముకుతూ ఉండేవారు. వయసొచ్చాక ఎక్కగలిగీ ఎక్కలేనని మారాం చేస్తే భర్తలే భార్యలని రెండు చేతులతో ఎత్తుకుని ఆ మంచాన్ని ఏలేవారు. పాడు మంచమని అలక నటిస్తే ఎంత అలకకి అంత శిక్ష అన్నట్టు ప్రేమతో మంచంకోళ్ళు విరిగేవి. ఇప్పుడా గదిలో అలాంటివేమి లేవు, గోడలు నిశ్శబ్దానికి అలవాటుపడిపోయాయి. వాటికి తనకీ పెద్ద తేడా లేదనుకుంటాడు భీమార్జునుడు.
దీపపు బుడ్డి వత్తి చిన్నదిచేసి భీమార్జునుడు నిద్రకి ఉపక్రమించాడు. గాలి కొంచెం బలంగానే వీస్తుంది. సాయంకాలం పొలంపని వల్ల పులిసిన ఒళ్ళు, తర్వాత పుష్టిగా చేసిన భోజనం వీటికి తోడు చల్లనిగాలి నిద్ర పట్టకుండా ఎలా ఉంటుంది? సువాసనల మత్తుకి తెలియని మైకంలోకి వెళ్ళిపోతున్నాడు. నిద్రలో ఉన్నాడో మెలుకువతో ఉన్నాడో అర్ధమవడం లేదు. మంచంపైనుండి తేలుతున్న అనుభూతి. ఒకటి అయితే స్పష్టంగానే తెలుస్తుంది గాలి ఇంకా ఇంకా బలంగా వీస్తుంది. కళ్ళు తెరవాలని అనిపించట్లేదు. తేలిపోతున్నాడు. ఇంకా ఇంకా అని ఆశపడుతున్నాడు. కలలో అతనితో పాటే ఇల్లు కూడా తేలిపోతుంది. సావిట్లో గేదెలు బంధనాలు విడిపించుకోవడానికి తెగ గింజుకుంటున్నాయి. పాలేర్లని ఎక్కడ అని అరుస్తున్నాడు. ఎవరూ రాలేదు. కొడుకుని పిలిచాడు. ఏం సమాధానం లేదు. తనే అలా తేలుకుంటూ వెళ్లి అప్పటికే తప్పించుకుపారిపోయిన గేదెలని వెనక్కి తీసుకురావాలని అని నిశ్చయించుకున్నాడు. అలా కలలో తేలుతూనే గుమ్మంవైపు కదిలాడు. కొంచెం ముందుకు వెళ్ళగానే ఎవరో పట్టుకుని తనని ఆపేసినట్టు అనిపించింది. ఏంటా అని తిరిగిచూశాడు. అచ్చం గేదెలలానే తన మెడలో బంధనం బిగించి ఉంది. అహం గల మనిషికి అది చూడగానే ఉక్రోషం తన్నుకొచ్చింది. గట్టిగట్టిగా అరుస్తూ ఆ గొలుసుని మంచం నుండి వేరుచేసేలా తన బలాన్నంత ప్రయోగిస్తున్నాడు. ఊహూ అది తెగట్లేదు. కళ్ళముందే పాడి అంతా కళ్ళెం తెంచుకుని పారిపోతున్నాయి. కొడుకు, నౌకర్లు, పాలేర్లని అరుస్తూ పిలుస్తున్నాడు. ఏమి ప్రతిస్పందన రాలేదు. ఎంత వాటి వెనుక పరిగెడదామని ప్రయత్నిస్తున్నా మంచం కదలనివ్వడంలేదు. అలా బలంగా గుంజుతున్నప్పుడే ఒక్కసారిగా ఎవరో ఎప్పుడో చెప్పినది ఎద అంతరాల నుండి వినపడింది. అది "నువ్వు పరుగుకి అతీతుడవు. లాభనష్టాల దిగులు నీకు కలగనివ్వకు. ఒక పెద్ద తుఫానో లేక వరద వచ్చి మొత్తం కొట్టుకుపోయినా నీవు మళ్ళీ కొన్ని సంవత్సరాల తరువాత మునుపటి కన్నా ఇంకా ఎక్కువుగా సూర్యుని వలె ధగధగమని వెలుగుతావు. కష్టాలు నిన్నేమి చేయలేవు. వెర్రి పరుగు ఆపేయి". ఆ మాటలు తల అంతా చుట్టేయగానే మనస్సు తేలికపడసాగింది. మానవప్రయత్నం తప్ప ఇంకేం చేయగలడు. ఇవి పోయినా నేను మళ్ళీ సున్నా నుండి ధైర్యంగా మొదలుపెట్టగలను. దేనిమీద అత్యాశ లేదు అని అనుకోగానే ఇల్లూ, గేదెలు, గుర్రాలు మాయమైపోయాయి. దేని మీద తీపి లేదు అనుకున్నాడు. అనుకున్న వెంటనే మంచం గాలిలో తేలుతూ పైకి వెళ్ళడమారంభించింది. ఇతనికి ఏం జరుగబోతుందో అర్ధమైంది. కళ్ళు మూసుకుని ఏం జరిగితే అది జరుగుతుంది అని దృడనిశ్చయంతో నిలుచున్నాడు. మంచం అలా అలా ఆసాంతం పైకి వెళ్తున్న కొద్దీ ఇతని మెడకి కట్టిఉన్న గొలుసు ఉరిలాగా బిగించుకుని ఇతను అలా గాలిలోనే వేలాడుతున్నాడు. మంచం అలా పైపైకి వెళ్తూనే ఉంది. ఉరికంభం గాలిలో ఎగురుతున్నట్టుగా ఉంది. మనిషి మాత్రం ఏం జరగట్లేదన్నట్టుగా ప్రశాంతంగా ఉన్నాడు. తనకి తెలుసు తను భయపడిన మరుక్షణం నిజంగానే ఆ ఉరి పనిచేయడం మొదలుపెడుతుంది. అవును నాకు చనిపోతానని భయంలేదని గట్టిగా అరిచాడు. ఒక్కసారిగా మెడకి కట్టిన బంధనం ఊడివచ్చి కింద పడిపోయాడు. చావు తనని ఏం చేయలేకపోయిందని వెర్రి కేక అరిచాడు. అలా అరుస్తూనే ఉన్నాడు.
అరవడం ఆపి అన్ని దిక్కులా చూశాడు. చుట్టూ మైదానాలు. మనుషులేవరూ లేరు. అందంగా ఉంది ఆ ప్రాంతం. అలా చూస్తూ ఉండగా ఒక్కసారిగా అతని కళ్ళు మూసుకుపోయాయి. ఈదురుగాలులు బలంగా వీయడం మొదలుపెట్టాయి. అంతకన్నా బలంగా భీమార్జునుడు కళ్ళు తెరవడానికి ప్రయత్నిస్తున్నాడు. తెరుచుకోవట్లేదు. గాలి ఇంకా ఇంకా బలంగా వీస్తుంది. గట్టిగా అరుస్తూ ఇంకా ఇంకా బలంగా కళ్ళు తెరవాలాని ప్రయత్నిస్తున్నాడు. కానీ కనురెప్ప పైకి కదలదే!! ఏదో శక్తి తనలో పుట్టినట్టుగా ఆ బలాన్ని అంతా కూడగట్టి కనురెప్ప పై యుద్ధానికి వెళ్తున్నట్టుగా ఆ శక్తినంతా కనురెప్పపై ప్రయోగించాడు. ఒక్కసారిగా కనురెప్ప పైకి లేచింది. అయినా సరే అతనికి ఏం కనిపించట్లేదు. కనురెప్ప పైకి కిందకి కొడుతున్నాడు కానీ ఏందుకు కనిపించట్లేదు?? తన చేత్తో కంటిపైన తడిమిచూశాడు. ఒక్కసారిగా ఉలిక్కిపడ్డాడు. తన కంటిపైన ఇంకో కనురెప్ప ఉంది. గుండె వేగంగా కొట్టుకోసాగింది. మళ్ళీ బలంగా ఆ రెండో కనురెప్పని పైకి లేపాడు. ఈ సారి తేలికగానే పైకి లేచింది. కానీ మళ్ళీ అదే కథ. ఆ రెండు కనురెప్పల కింద ఇంకో కనురెప్ప. చుట్టూ వెలుతురు తెలుస్తూనే ఉంది. కానీ ఏం కనిపించట్లేదు. పిచ్చిపట్టిన వాడిలాగా కనురెప్పలని తెరుస్తూనే ఉన్నాడు. ఒకదాని తరువాత ఒకటి వస్తూనే ఉన్నాయి. వెర్రెత్తుకొస్తుంది. కొన్ని గంటలపాటు అలా చేస్తూనే ఉన్నాడు. శరీరం చెమటలు కక్కుతుంది. లాభంలేదు. అలా కనురెప్పలపైన కనురెప్పలు వస్తూనే ఉన్నాయి. ఆ గాలులకి ఇతని స్వేదం అక్కడక్కడే వలయాకారంలో అతని చుట్టూ తిరుగుతుంది. గతం గుర్తొస్తుంది. దుఃఖం, శోకం కలిసి వస్తున్నాయి. ఏడుద్దామంటే కూడా ఇప్పుడు కన్నీళ్ళు రావే! ఏంత దురదృష్టవంతుడిని అనుకుని నిస్సహాయతతో లోలోపల కుమిలిపోతున్నాడు. ఏముంది నా కళ్ళ ముందు? నిజమా? ఏం నిజం ఉన్నది నేను చూడలేకపోవడానికి? లేక దైవమా? లేక నిజాన్ని, దైవాన్ని మించిన శక్తి? ఆ ఆలోచన రాగానే చుట్టూ చీకట్లు అలుముకుపోయాయి. గాలి ఆగిపోయింది. ఒక్కసారిగా భీమార్జునుడికి ఏదో బావి/నూతిలో వచ్చి పడ్డట్టుగా అనిపించింది. చుట్టూ నీళ్ళే ఉన్నాయి. అతను ఆ నీళ్ళలోపలికి వెళ్ళిపోతున్నాడు. ఏంత ఈదుదామని ప్రయత్నిస్తున్నా పైకి రాలేకపోతున్నాడు. పైగా చిమ్మ చీకటి. అప్పుడే "నీకేం కాదు. నేను ఉన్నా కదా!! అని అశరీరవాణి వినిపించింది. ఎవరు నువ్వు? అని మనస్సులోనే ప్రశ్నించాడు. అశరీరవాణి నవ్వి ఊరుకున్నది. నాకెందుకు ఇలా అనిపిస్తుంది? నవ్వి ఇలా చెప్పడం మొదలుపెట్టింది. "నువ్వు ఎంతో సాధించావు, ఎందరినో సంపాదించావు. అయినా నీకు ఏదో లోటు అనిపిస్తూనే ఉంటుంది. అది పోయే మార్గమొకటి ఉంది. పినాకిని దక్షిణపు ఒడ్డున నీకు కావాల్సినది ఉన్నది. కానీ నువ్వు ఆ దక్షిణపు ఒడ్డుని చేరలేవు. ఒకవేళ నీవు చేరితే ధనము, గౌరవము తో పాటు నీకు కావాల్సిన కల్తీ కాని ప్రశాంతత లభిస్తుంది. కానీ మళ్ళీ చెబుతున్నాను నువ్వు ఆ దక్షిణపు ఒడ్డు చేరలేవు." ఎంతో శ్రద్ధగా వినేకొద్దీ ఈ గొంతు ఎక్కడో విన్నట్టుగానూ, చాలా సుపరితముగా ఉన్నది. ఆ అశరీరవాణి చెబుతున్న విషయం కన్నా ఆ గొంతు ఎవరిది? ఎవరిది?? అని అలోచించసాగాడు. తెలిసిపోయింది అన్నట్టే అనిపిస్తుంది కానీ ఎవరిదా అని గుర్తురాక చిరాకు మరింత ఎక్కువవుతుంది. అలా ఆ బావి/నుయ్యి లాంటి ప్రదేశంలో ఆ గొంతు ఎవరిది ? ఆ గొంతు చెప్పిన విషయాన్ని ఆలోచిస్తూ తర్జనబర్జనలు పడిపోతున్నాడు. చుట్టూ చీకటిలో పూర్తిగా నీటిలో మునిగిపోయి ఉన్న తనకి వెలుగు చూపుతున్న ఈ మనిషి ఎవరు?? తను ఆ దక్షిణపు ఒడ్డు చేరలేకపోవడం ఏంటి? చేరితే అష్టైశ్వర్యాలు, ప్రశాంతత కలగడం ఏంటి? అయినా ప్రశాంతత అక్కడే దొరకడం ఏంటి? ఈ అశరీరవాణి వెలుగు చూపుతుందా? లేక ఇంకా బాధల్లోకి తోస్తుందా?? నన్ను ఈ నీటిబావి నుండి బయటకు పంపించేయి అనుకుంటూ ఆ నీటిలో కాళ్ళు చేతులూ ఆడిస్తున్నాడు. "ఈ గట్టు అందరూ దాటతారు. ఆ గట్టు కొందరే దాటుతారు. నేను కలలోనైనా నీకు కీడు తలవలేను కన్న" అని అశరీరవాణి ఆగిపోయింది. వినగానే భీమార్జునుడు ఒళ్ళంతా కంపించింది. చుట్టూ చీకటి పోతూ వెలుగు ప్రశరిస్తుంది. భీమార్జునుడు ఆ నీటి బావిలో నుండి నెమ్మదినెమ్మదిగ బయటకివస్తున్నాడు. బయటకి వస్తూనే అతనికి ఆ గొంతు ఎవరిదో అర్ధమయ్యింది. అది తన తల్లి గొంతు. తనని "కన్న" అని పిలిచేది తన తల్లి ఒక్కటే!! అలానే తను ఇంతసేపు ఎక్కడున్నదీ అతనకి అర్ధమయ్యింది. నీ కన్నకొడుకు బాధని చూడలేక వాడిని ఆ నిస్సహాయ,నైరాశ్యపు బంధికానా నుండి బయటకు వచ్చే మార్గం చూపెట్టడానికి వాడినే నీ గర్భంలోనికి తీసుకుని మళ్ళీ ప్రసవించావా అమ్మా!! అనుకుంటూ పూర్తిగా వెలుగులోకి వచ్చేసాడు. అతని కళ్లు ఒక్కసారిగా తెరుచుకున్నాయి. పుట్టిన తరువాత పసిపిల్లల లాగా వెక్కివెక్కి ఏడ్చాడు కలలోకూడా మళ్ళీ తల్లిని చూడలేకపోయానేనని.
తల్లి చెప్పిన మాటలు గుర్తువచ్చాయి. ఈ గట్టు - గర్భం. దాటితే జననం. ఆ గట్టు - గమ్యం. అందరూ పుడతారు.కానీ గమ్యానికి చేరేది కొందరే!! అని చెప్పింది. కానీ దక్షిణం వైపు గట్టుపైన కాలుమోపే సాహసం చేసిన మనిషే లేడే! అసలు నదినే దాటద్దు అని ఆంక్షలు ఉన్నాయి కదా!!
ఇంతకి దక్షిణపు ఒడ్డు దాటిన తరువాత ఏముంది? పెద్ద అడవి. అంతకన్నా భయంకరమైంది ఏంటంటే ప్లేగు, కలరా సోకి చనిపోయిన వారందరినీ తీసుకువెళ్లి దక్షిణపు గట్టున అడవిలో పారేసేవారు. ఆఖరిసారి వ్యాధి ప్రబలి మూడువేల మంది దాకా మట్టిలో కలిసిపోయారు అంట!! వాళ్ళందరూ అటు వైపున దెయ్యాలై తిరుగుతున్నారని అన్నవారూ లేకపోలేదు. కలిసి బ్రతకకపోయినా, చచ్చినా కలవము అని బ్రతికినవాళ్ళు చచ్చాక దక్షిణ గట్టున కలవక తప్పలేదు. ఒకే జాతి, ఒకే శ్మశానం.
సాధనకే కానీ రోదనకి వేదనకి సమయం లేదని నిశ్చయించుకున్నడు. శోదించి సాదించాలి అని అనుకుని రోజు ప్రారంభించాడు.
ధన్యవాదములు
వశిష్ఠ ✍️
Comments
Post a Comment