వాది

 

చెక్క కూర్చీలో కూర్చుని రీడింగ్ టేబల్ పైన కాళ్ళుజాపి ఊగుతూ తన పాదాల మధ్య నుండి సూర్యాస్తమయాన్ని చూస్తున్నాడు. చేతిలో సిగరెట్టు. లైటర్ ఎక్కడో దూరంగా ఉంది. సిగరెట్టుని సూర్యబింబానికి దగ్గరగా తీసుకుపోయి ఉంచి, వెలిగితే బావుండు అనుకున్నాడు. ఊహూ వెలగలేదు.!! గదిలో ఐతే తనొక్కడే ఉంటున్నాడు కానీ తనలో తనే ఉండట్లేదు. తన నిస్తేజానికి నిశ్శబ్దం తోడవ్వడంతో తన యెద లయ సరిగ్గా గోడ గడియారంతో సింక్(sync) అయినట్టుగా వినిపిస్తుంది. నిమిషానికి  అరవైసార్లు! ఆలోచనలు అయితే దూరంగా వెళ్తున్నాయి కానీ పనులు మాత్రం అక్కడక్కడే తిరుగుతున్నాయి. సరిగ్గా ఇలాంటి ఆలోచనలే తనకి గతంలో ఒకసారి వచ్చాయి.

 

గతం...

ఏంటిదసలు? వానా కాలంలో వానలేవి? కొల్లేరులో పక్షులేవి? తినడానికి తిండేది? ఉండటానికి ఇల్లేది? యువతకి ఉద్యోగాలేవి? అంటూ నాయకుడు ఉపన్యాసం దంచికొడుతున్నాడు. కుర్రకారు ఈలలు కేకలుతో ఆడిటోరియం మారుమ్రోగిపోతుంది. పనిపాటా లేకపోతే సరి!! నాకు మల్లే ధైర్యంగా చదవడానికి ఆసక్తిలేదని చెప్పకుండా అది లేదని ఇది లేదని కబుర్లేందుకంటా!! మనకి నిద్రాభంగం కాకపోతేను. హాలు పక్కనే వద్దని మా నాన్నకి వచ్చిన రెండో నెలకే చెప్తే విన్నారు కాదు. ఎప్పుడూ ఏదోక గొడవే అని నిట్టూరుస్తూ నా వైపే చూస్తున్నాడు గణపతి. వాడు చూస్తున్నాడని తెలుస్తున్నా నా ఆలోచనల్లో నేను పడిఉన్నా! వీడోమాలోకం అనుకుంటూ వాడు నిద్రపోయాడు. చేయాలనుకున్న పనులు చాలానే ఉన్నాయి. రేపు గణపతి వెళ్ళిపోయిన తరువాత ప్రశాంతంగా పట్టాలెక్కిద్దమని అనుకుంటూ లేచి వీధిలోకి నడిచాను. ఇంకా ఉపన్యాసం నడుస్తూనే ఉంది. అసలు వీళ్ళ గొడవేంటో నాకు అర్ధమేకాదు. దేవుడిపైన భారం వేసి ఎవరి పని వారుచేసుకోక ఏంటీ గలాటా!! అనుకుంటూ అలా పచార్లు కొట్టి గణపతికి చిన్న గిఫ్టు కొని రూముకి వచ్చి పడుకునిపోయాను.

నిద్రలేచేసరికి వాడు వెళ్ళిపోయాడు. అరగంటసేపు యోగా చేసి..ఆ తరువాత తయారయ్యి భాగవతం కొంచెంసేపు చదివాను. భాగవతం చదవగానే మనస్సు తేలికైపోతుంది, తేలిపోతుంది. అలా తేలిపోతూ పోతూ గాడి తప్పి అందోళనలోకి నెట్టేస్తుంది. తల తిరిగిపోతున్నట్టుగా ఉంటుంది. నాకు సరిగ్గా ఇదే కావాలి. ఇప్పుడు ధైర్యం వచ్చింది. పెన్నూ పేపర్ తీసుకున్నాను. ఎవరెవరికి ఉత్తరాలు రాయాలో అని అలోచిస్తూ ఒక లిస్టు పూర్తిచేసాను. పని లేనోడు పిల్లి తలగొరిగాడంట అనే నాన్న మాటలు గుర్తొచ్చాయి. కోపంతో ఆ చీటి నలిపేసాను. అయినా ఇప్పుడు కూడా నాన్న మాటని పట్టించుకోవడమేంటి అని ఆ చిత్తుకాగితం తీసుకుని మళ్ళీ ఆ చీటీలో పేర్లు అన్నీ చూస్తే, నిజంగానే అందులో చాలామందికి అక్కర్లేదనిపించింది. కారణలు వేరైనా నాన్న చెప్పేది నిజమై తీరుతుంది. అదే తనకి నచ్చట్లేదు. లిస్టు మొత్తం నుండి ఒక పేరు ఫైనల్ చేసి..ఆ ఒక్కరికి ఉత్తరం రాస్తే సరిపోతుందనిపించింది.

పూజ్యులైన నాన్నగారికి..నీ మొహానికి ఇంగ్లిషూ ఒకటినా?? వెటకారం చేసినవాళ్ళ మాటలు రివ్వున మ్రోగాయి. వికటట్టహాసం చేసి ఆత్మవిశ్వాసంతో

Dear Dad, అని మొదలుపెట్టి

I’m leaving home and I won't be coming back. Please don't look for me anymore. It’s waste of your time and our your money.

Please take care of my mom. I’m requesting you two, to plan for an another child. I know you both loved me so much and you didn’t feel to have another child. But please consider it now.

 Please take care of my mom. And plan for  I know you both loved me so much and you didn’t feel to have another child. But now please plan for an another child.( మాట రాస్తున్నప్పుడు నా వయస్సు పదిహేనేళ్ళు. ఇప్పుడు గుర్తొస్తే నవ్వొస్తుంది. నవ్వేసాను. నిజమే, నేను నవ్వి ఎన్నిరోజులైందని? నన్ను నేనే నవ్వించుకున్నానమాట!!)

                                                            Good Bye!!

                                                                                                                                       Yours Lovingly Son

పోస్టాఫీసులో ఉత్తరం పోస్ట్ చేసేసాను. చేసేవరకు రకరకాల ఆలోచనలు చుట్టుముట్టాయి సరైనదేనా, ఆనాలోచితమా? అని. కానీ ఇప్పుడు చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది. ఇకనుండి నేను స్వేచాజీవిని అనుకుని గంభీరంగా నడుస్తుంటే పెద్ద పెద్ద అడుగులు/అంగలు  పడుతున్నాయి..స్వేచ్చ తీసుకువచ్చిన ఆత్మవిశ్వాసంతో కాబోలు అనుకున్నాను. అంటే మన శరీరానికి లిమిట్స్ ని ఒంట్లో శక్తిని బట్టేకాక మన మనస్సుని బట్టి కూడా పెరుగుతూఉంటాయన్న మాట! మనసు చాలా తేలికైనట్టు అనిపిస్తుంది. (ఆనందంతో ఉన్న హృదయం నచ్చినవాళ్ళు ఎక్కడున్నారని వెతుక్కుంటుంది. వాళ్ళతో సంతోషాన్ని పంచుకోవలని ఉవ్విళ్ళూరుతుంది. కానీ తాను ఆనందం ఎవరితోను పంచుకోలేడు. పైగా తనకి ఉర్లో నచ్చినవాళ్ళెవరు కూడా లేరు. అంతా తన ఊరిలోనే ఉన్నారు) స్వేచ్చకి, ఆనందానికీ, అందానికి ప్రకృతిని మించిన ప్రతీక ఎవరున్నారని అప్రయత్నంగా అడుగులు పార్కువైపు పడ్డాయి. రోజూ చూసే చోటు కూడా కొత్తగా ఉందీరోజు.

 

వచ్చీరాగానే పక్కనే ఒక యువకుడు ఏడుస్తూ కనిపించాడు.పక్కనే ఇంకొకడు సమాదానపరుస్తున్నాడు. ఏటు చూసిన ఏడుపేంట్రా బాబు అనుకుంటూ విసుక్కున్నాను. నేను ఇప్పుడున్న స్థితి వలన లోలోపల విసుక్కున్నా బయటకి మాత్రం నవ్వే వస్తుంది. వేదనలన్నిటికీ కారణం కోరికేనని గురువుగారు చెప్పారు. ఆసలీ వ్యక్తి కోరిక ఏంటో తెలుసుకోవాలని అనిపించింది.(మామూలుగా అయితే ప్రేమ విఫలమో అనుకునేవాడిని. ఎన్ని అని చూడలేదు నేను పార్కులోనే. కానీ ఏడ్చేవాడిని మాత్రం ఎప్పుడూ చూసిందిలేదు). ఏమైంది అన్న? ఎందుకు ఏడుస్తున్నాడు అని పక్కనున్న అతన్ని అడిగాను. ఎగ్జాంలో మార్క్స్ గురించిలే తమ్ముడూ.. ఓహ్ అవునా!! భాదపడకండి. ఈసారి అంతా మంచే జరుగుతుంది అని చెప్పబోతుంటే, 100 కి 62 వచ్చినా రాలేదు రా అంటూ ఇంకావెక్కివెక్కి  ఏడుస్తున్నాడు. ఏడ్చేదేదో చదివి ఏడవచ్చు కదా!! అని మనసులో తిట్టుకున్నాను. నా ఈ ఆనందస్వేచ్చామృతాన్ని ఈ దుఃఖ గరళంతో మలినంచేయదల్చుకోలేను. కారణం ఏంటో తెలిసిన తరువాత ఇంక ఆ శోకసముద్రపు ఒడ్డున కూర్చోవాలనిపించలేదు. Bon voyage చెప్పి బయటపడ్డాను.


అలా మళ్ళీ వీధీలోకి పడ్డానో లేదో ఆనందాన్ని రెట్టింపు చేసేలా కాఫీ సువాసన చుట్టేసింది. దేవతలు, రాక్షసులు అమృతం వచ్చిన తరువాత ఆపేసిన క్షీరసాగర మదనాన్ని ఈ నాయరు పూర్తిచేసి కాఫీని పట్టుకొచ్చాడా!! అన్నంత రుచిగా ఉంటుంది. వస్తూ పోయేవాళ్ళని చూస్తూ కాఫీ తాగుతున్నాను. ఇక తన జీవితానికి తనే పెద్ద, ప్రతీ నిర్ణయం తనదే. చుట్టూ ఉన్న కుర్రోళ్ళు వదిలిన సిగరెట్టు పొగ ఇబ్బంది పెట్టినా దానినే నా స్వేచ్చావాయువులుతో కలిపి పీలుస్తున్నాను. ఒక దమ్ము లాగలని మనసు పీకింది. లేదు కాశీలోనె, అదీ సాధువుల దగ్గర తీసుకుని ఆకు కొట్టాలి.అదే నా మొదటిది, ఆఖరిది అవ్వలని నియమం గుర్తొచ్చి నవ్వేసాను. హుషారుగా ఒక కుర్ర గుంపు వచ్చి నా పక్క టేబుల్లో కూర్చున్నారు. వారిలో ఒక కుర్రోడు ఇది నా పార్టీ, అందరికీ నాదే బిల్. నేను పాస్ అయిన సందర్భంగా .ఒకే గంటలో రేండు వేరు వేరు పరిస్థితులు. ఒకరు పాస్ అయ్యి ఉద్యోగానికి , ఇంకొకరు ఫెయిల్ అయ్యి ఉద్యానవనానికి. ఇక్కడ ఉన్న కుర్రవాళ్ళందరిలో ఉత్సాహం ఉరకలెత్తుతుంది. అక్కడేమో నిస్తేజం. అంతులేని ఎనర్జీ వీళ్ళ మద్య ఉంది. నాకు కూడా ఏదో తెలియని శక్తి దాపురించింది/ఆవహించింది. ఫుస్తకాల్లో చదివిన Positive energy is contagious అనేది అనుభవంలోకి వచ్చింది. 100 కి 62 వచ్చిన వాడే ఫెయిల్ అయితే పాస్ మార్కు ఎంతో తెలుసుకోవాలి అనిపించింది. ముందు పాస్ అయిన అతనికి విషెస్ చెప్తూ ఎన్ని మార్కులు వచ్చాయని మన పాజిటివ్ ఎనర్జీ పార్ట్నర్స్ ని అడిగాను. ముప్పై ఏడు మర్కులు అని చెప్పారు వాళ్ళు. గోలలో సరిగ్గా వినిపించుకోలేదేమో అని డెబ్బై ఏడా? ఆని అడిగా. కాదు 37 అని చెప్పారు. నాకు ఏం అర్ధం కాలేదు. 62 వచ్చిన వాడేమో ఫెయిల్ అయ్యానని బాధపడుతున్నాడు, 37 వచ్చినవాడు పాస్ అని పార్టీ ఇస్తున్నాడు. ఎంత ఆలోచించినా తనకి అంతుబట్టడం లేదు. అలా తల తిప్పగానే పక్కనే పోస్ట్మాన్ కనిపించాడు.

 

ఇంకా చాలా ఉంది రాయాలి..

 

 

Comments

Popular Posts