God of Gods - Chapter 5
God of Gods - Chapter 5
Disclaimer : కొంచెం అడల్ట్ కంటెంట్ ఉంది. చిన్నపిల్లలు ప్లీజ్ Ignore this..
పిల్లవాడి ప్రపంచంలో అద్దెకి వచ్చిన దేవుడు ఒక్కొక్క అడుగు వెనక్కి వేసుకుంటూ ప్రతీ బంధాన్ని, జ్ఞాపకాన్ని నరుక్కుంటూ తిరిగి తన యధా మరణం లేని జీవితంలోకి వస్తున్నాడు. గడియారాన్ని ఎప్పుడు చూసినా సమయాన్ని చూపించినట్టు దేవుడి మోములో ఎల్లప్పుడూ చిరునవ్వు వికసిస్తూ ఉంటుంది.
అలా తనే సృష్టించిన తన ప్రపంచంలోకి వచ్చిన కొన్ని యుగాల తర్వాత....
దేవ లోకంలో అందరూ ఎవరి పనుల్లో వాళ్ళు "మునిగి తేలడం" అనే ఆట ఆడుతున్నరు. ఒకాయన పుట్టిస్తున్నాడు, ఇంకొకాయన చంపుతున్నాడు.ఒకరోజు నెమలి పిల్లలు గుడ్డులో నుండి బయటకి వచ్చే సమయానికి ఈయన పిల్లనగ్రోవితో వెళ్ళి వాటి ముందు కూర్చున్నాడు. పిల్లనగ్రోవి లోని రంధ్రాల లెక్క 8కి గుడ్ల సంఖ్య సరిపోయింది. గుడ్లు వరుసగా పేర్చి ఉన్నాయి. పిల్లనగ్రోవి నుండి శబ్ధం పుట్టడానికి వేళ్ళతో లయబద్ధంగా కొన్నిటిని మూసివేస్తూ కొన్నిటిని తెరుస్తూ ఊదాలి. ఈయన ఊదగా పిల్లనగ్రోవిలోకి గాలి గాలివెళ్ళినట్టే, ఆ పిల్లల్లోనికి ప్రాణం వెళ్ళిందా!! అన్నట్టు అనిపించింది. లోనికి వెళ్ళిన గాలి బయటికి వచ్చేద్దాం అని పరితపిస్తూ ఉండగా ఈయన వేళ్ళతో ఆపేస్తున్నాడు.అలా గాలితో పరిహాసాలు ఆడుతూ మొదటి రంధ్రాన్ని తన వేలితో మూసివేసాడు. రెండో దానినుండి ఆహ్లాద మురళీ ధ్వనిగా బయటకి వస్తూ ఉండగా సరిగ్గా రెండవ గుడ్డు నుండి పిల్ల బయటకి వచ్చింది. ఆతర్వాత మూడవ దానినుండి ధ్వని,నెమలి పిల్ల ఒకేసారి బయటకి వచ్చాయి. అలా లయకి అనుగుణంగా అన్ని పిల్లలూ వచ్చేసాయి.తల్లి నెమలి పిల్లల్ని దగ్గరకి తీసుకుని ప్రేమగా సాకింది.
పుట్టిన తన పిల్లలని చూపిస్తూ నీకన్నా వాటిలో ఎన్ని అందమైన రంగులున్నాయో చుశావా? అన్నట్టుగా తల్లి నెమలి ఆనందంతో గర్వంగా దేవుడికే చురక అంటించింది. తల్లికి దేవుడి కన్నా పిల్లలే ఎక్కువ కదా!! దేవుడు నవ్వి ఇంద్రదనస్సుని తెప్పించి ఏది ఇప్పుడు కూడా ఇదే మాట అంటావా అని నవ్వాడు.. తను ఆనందంతో పిల్లలను తన చేతిలో తీసుకోగా తండ్రి నెమలి దెవుని తలపైకి ఎక్కి పురివిప్పి నాట్యం చేయసాగింది. అమితానందంలో ఉన్న దేవుడికి అకస్మాత్తుగా "తను" కంట పడింది. తనేనా తను? అవును తనే!! తన చుట్టూ ఎల్లప్పుడూ వాళ్ళ చిట్టి తమ్ముడు ఉంటాడు.రాత్రయితే వాడు నిద్రమానుకుని మరీ వాళ్ళ అక్కకి కాపలాగా ఉంటాడు.ఎన్ని రోజులు అయిపోయింది తనని చూసి. ఏమి ఆ సౌందర్యం! ఇంద్రధనస్సులో కూడా అన్ని రంగులులేవు కదా!!ఆమె మేనిలో అన్ని రంగులు ఉన్నాయి.
ఒక్క "క్షణంలో కోటి కోట్ల వంతుల సమయంలో" తనకే తెలియకుండా అన్నీ మరచిపోయాడు. మురళీ మకరందం ఆగిపోయింది. ఇన్ని రోజుల నుండి చూస్తున్నాడే...తను ఎప్పుడూ ఇంత అందంగా కనపడలేదు ఏంటి? తను రెప్పవాల్చి చూసినా తను ఎంతో దురం వెళ్ళదు,ఇక్కడే ఉంటుందని తెలిసినా రెప్ప వేయలేదు. తను నగ్నంగా ఉంది.. అవును తను నగ్నంగా ఉంది..తన నగ్నత్వానికి వేగాన్ని కలిపి పరిగెడుతూ వెళ్ళిపోతుంది.అంత పరుగులాంటి నడకలో కూడా తన ఎదఫలకము పైనున్న కనుమలు ఏమాత్రం కదలలేదు.తననే చూస్తూ మళ్ళీ మురళీగానం మొదలుపెట్టాడు.ఆ మురళీమకరందం గాలితో కలిసి తాడులా మారి తనని కట్టేసిందా!! అన్నట్టు చేసేసింది ఆమె సోయగం. ఆమె ఆగకుండానే కంగారుగా వెళ్ళిపోయింది. తిను మాత్రం ఇక్కడే ఆగిపోయాడు. ఇంకొక్కసారి తనని చూడలనిపించింది. ఇంత అందాన్ని పుట్టించానా అని తనలోనే ఆశ్చర్యాన్ని పుట్టించింది తను. ఇంత అద్భుతాన్ని సృష్టించానా అని ఆశ్చర్యపోయాడు..ఆనందపడ్డాడు.
చీకట్లు కమ్మేశాయి. చీకట్లో తనని చూడటం ఎలా? తన దగ్గరకే వెళ్తే? అసలే కంగారు మనిషిలా ఉంది. ఎందుకులే రాత్రిపూట అని ఆగిపోయాడు.ఇంక అలానే తన్మయత్వంతో ఉండిపోతే ఎక్కడ తనని పెనవేసుకున్న వలపు తాడు మెడ మీదుగా వచ్చి ఉరితాడైపోతుందేమో అని తెరుకుని తిరిగి తన పనిలో లీనమయ్యాడు.ప్రతిరోజు ఒకే పని..పగలంతా తనని చూడటం. రాత్రంతా పగలెప్పుడవుతుందా! అని ఎదురు చూడటం.
తన కురులు మర్రె ఊడలు..తన జడ కొన్ని వందల అడుగులు ఉంటుంది.పక్షులు గూడు కట్టుకునే అంత అడవి.ఎంత దైర్యవంతురాలు అంటే ఆ జడని కత్తిరించుకోవడానికి వీలు పడక మంటతో తన జుట్టుని తనే కాల్చుకుని తగ్గించుకుంటుంది. మాములురోజుల్లోనే ఇంత బావుంటే నిండు పున్నమిలో తను ఎలా ఉంటుంది? తన నగ్న సౌందర్యాన్ని వెన్నెల వెలుతురులో ఎప్పుడెప్పుడు చూద్దామా అని ఆశగా ఎదురుచూస్తున్నాడు. పౌర్ణమికి ఎన్నో రోజులు లేవు ఇంక!!ఆరోజు రానే వచ్చింది. సాయంకాలమెప్పుడవుతుందా, ఎప్పుడు తనని వెన్నెల వెలుతురులో చుద్దామా! అని వేయి కళ్ళతో ఎదురుచూస్తున్నాడు. కానీ దురదృష్టం మబ్బులరూపంలో అడ్డొచ్చింది.వరుణ దేవుడికి నైట్ షిఫ్ట్ అని గుర్తొచ్చి ఢీలా పడ్డాడు.వెంటనే ఇంకొక అద్భుతమైన ఆలోచన వచ్చింది. వెన్నెల లేకపోతే ఏంటి! వర్షంలో తను తడుస్తూ ఉంటే చూడచ్చు కదా అని ఆనందపడ్డాడు. దురదృష్టంలో అదృష్టం అంటే ఇదే కాబోలు! మధ్యాహ్నవేళనే మబ్బులు కమ్మేసాయి.. పక్షులు గూళ్ళకి చేరాయి. వర్షం పడే ముందు ఎంత బావుంది తను..వాహ్..వర్షం మొదలయ్యింది.దొరికిన ప్రతీ వాన చినుకుని చేతబట్టి తాగేస్తుంది. చిన్నచిన్న తుంపర్లలో తను తడుస్తుంది.తన పైన పడీన ప్రతీ వాన చినుకు మస్తిష్కం నుండి కాలిపాదం వరకు ప్రతీ అవయవాన్ని తాకుతూపోయింది. నీరు పల్లం వైపుకి తన వంపులలో..నడుము వంపులలో పయనిస్తుంది. అది జఘనగంగ అయ్యింది...చీకటివల్ల కనపడదేమో అని మధ్యమధ్యలో మెరుపుల వెలుగులు తన మీద పడేలా చేసాడు.వర్షమింకా పెద్దదయ్యింది. ఈదురుగాలులు కూడా విజృంబించాయి. తన జుట్టు చెదిరిపోతుంది.కుండపోతగా మారింది. తను ఆ తుఫాను దాటికి తట్టుకోలేకపొయింది. దేవుడికి బాధ కలిగింది. కానీ ఏమి చేయలేకపొయాడు..వర్షం తగ్గేవరకు వేచిచూడటం తప్ప! వర్షంలో తను అందంగా లేదు..అందవిహీనంగా తయారయ్యింది. తను నెమ్మదినెమ్మదిగా కోలుకుంటుంది. వచ్చేది శీతాకాలం.. వర్షం వల్ల కలిగిన అనారోగ్యం నుండి కోలుకుంది.
చలికాలం లో తెల్లవారుఝామున నిద్ర లేచేసరికి సువాసనలు వెదజల్లే పూలతీగలు మరిముఖ్యంగా మల్లెతీగలు తన ఒంటికి చుట్టుకుని ఉంటాయి. తను ఇంకా అందంగా కనపడుతుంది. సువాసనలు తన తనువంతా వెదజల్లుతున్నాయి..అవి దేవుడికి మత్తెక్కిస్తున్నాయి.
వేసవికాలం రానే వచ్చింది.
సూర్యుని కిరణాలు సరిగ్గా తనలో మధ్యస్థలమైన జఘన ప్రాంతం పైన పడి బంగరువర్ణంలో మెరుస్తుంది. వేసవి కాలంలో తను 🔥🔥 లా ఉంది. తన తనువు వేడికి ఎవరైనా ఉడికి పోవాల్సిందే.
దేవుడు ప్రేమలో పడ్డాడు. తనని ప్రేమిస్తున్నాడు..
దేవుడు ముందు తన తమ్ముడితో పరిచయం పెంచుకున్నాడు, ఆ తర్వాత తనతో..కానీ తను దేవుడిని అని ఇద్దరితో చెప్పలేదు. తను ఎప్పుడూ ఒక పెద్దమనిషి చుట్టూ తిరుగుతుంది. అది దేవుడికి నచ్చదు. విధిని మార్చలేడు. మిన్నకుండాఉండలేడు. అడిగేసాడు ఒక రోజు. తను,తన తమ్ముడూ బ్రతకాలి అంటే అతనే దిక్కు అని చెప్తుంది. తన అందాలకి కారణం కూడా తనే అని అంటుంది. అతన్ని నాశనం చేసేస్తాను అని దేవుడు అంటే నవ్వి నీ వల్ల కాదు, అతను చాలా శక్తివంతుడు, తన దరికి కూడా నువ్వు చేరలేవని అంటుంది.లోలోపల దేవుడు అంటే తనకి కూడా ఇష్టమే.. దేవుడు శక్తితో కాకుండా యుక్తి ని వాడి ఆమె తమ్ముడి సహాయంతో ఆ పెద్దమనిషిని మాయం చేసేస్తాడు. ఆమె ఆశ్చర్యపడి తనమీద ఇష్టంతో అన్నంతపని చేసాడని గిలిగింతలు పడుతుంది.
ఆరోజు అమావాస్య. తన తమ్ముడూ దగ్గరలేడు..ఆ రాత్రికి దేవుడు ఆమె వద్దనే ఉన్నాడు. ఇద్దరిమధ్య మాటలు లేవు. దేవుడు తనని అలానే చూస్తున్నాడు...ఆమెకి దగ్గరగా జరిగాడు. ఆమె ఎర్రటి మోముని తన చేతుల్లోకి తీసుకున్నాడు. ఒక్కసారిగా ఆమె కంపించింది.దేవుడు మనిషిగా మారాడు.తను దేవుడికి తనలో చోటు ఇచ్చింది. తనలోని అందాలన్ని చూపించింది. ఇద్దరూ కలిసి సహజీవనం చేసారు. ఆమె ఎర్రటి దేహంపైన దేవుడు తన వేళ్ళతో గీతలు గీసి ఆమె నుండి దొరికే ప్రతి శక్తిని వాడి తనని తల్లిని చేసాడు.తొమ్మిది నెలల తర్వాత వారికి సంతానం కలిగింది..అది కూడా ఆరటి పంట రూపంలో...దేవుడు ప్రేమలో పడింది అమ్మాయితో కాదు...భూమితో!! ఎప్పుడూ తనతో ఉండే చిట్టి తమ్ముడు చంద్రుడు. తను ఎపుడూ చుట్టూ తిరిగే పెద్దమనిషే సూర్యుడు. సూర్యుడిని మాయం చేయడానికి యుక్తి ఎందుకు? సుర్యగ్రహణం రోజు సరిపొతుంది కదా!! దేవుడు చేసింది వ్యవసాయం...శృంగారం కాదు.. అవును దేవుడు భూమి మీద ప్రకృతితో ప్రేమలో పడ్డాడు..పడనిది ఎవరు? భూమి నగ్నంగా ఉండబట్టే మనమంతా ఇలా ఉన్నాము. We all love to see earth naked. పైగా ఫొటోస్,వీడియోలు తీసి గుర్తొచ్చినప్పుడల్లా చూస్తాము. Yes, Earth was/is/will be Naked. It won't hide it's ORIGINALITY. That's why it's Beautiful..
To be continued...
Thank You
Vamsikrishna Bazaru.
Comments
Post a Comment