ముఖ్యపాత్రలో శ్రీదేవి - Episode 1
చలికాలం... శ్రావణమాసపు కొత్త దంపతులకి పునరుత్తేజం వచ్చే ప్రాత: కాల సమయం
బెజవాడ రోడ్లన్నీ ఖాళీగా ఉన్నాయి. ఆ టైంలో రోడ్లు ఉంటే శ్మశాన నిశ్శబ్ధంతో ఉంటాయి లేకుంటే అతివేగంతో ప్రమాదలు జరిగే శ్మశానాలులా ఉంటాయి. పాల బళ్ళు, పేపర్ వాహనాలు పోతున్నాయి.
కళ్ళు తెరవగానే కాఫీ, లేచి ఒళ్ళు విరవగానే పేపర్ కావాల్సిందే కదా!!
అందు లేదని, ఇందు గలదని సందేహం వలదు అన్నట్టుగా మంచు రోడ్డుని కప్పేసింది.. దూరం నుండి ఏవో శబ్ద తరంగాలు మంచుపొరని చీల్చుకుంటూ వస్తున్నాయి. ఒక్కసారిగా ఆ తెల్లటి తెర నుండి ఒక పొడవాటి తెల్లని కారు డివైడర్ లైట్లలో మెరుస్తూ రాంగ్ రూట్ లో వేగంగా వస్తుంది. వస్తూ వస్తూనే పెద్ద పెద్దగా హారన్ మోగిస్తున్నారు ఎవరో కాని ఆ డ్రైవర్.ఫూట్ పాత్ పై బిచ్చగాళ్ళని చూడగానే అంత వేగంలో ఒక్కసారిగా బ్రేక్ వేస్తూ హారన్ మోగించారు. పెద్ద శబ్దం వచ్చింది. ఒక్కసారిగా ఉలిక్కి పడి యాచకులంతా ఒక్క ఉదుటున నిద్ర లేచారు. ఇద్దరు ముగ్గురు తప్ప..అతను ఇంకా హారన్ కోడుతూనే ఉన్నాడు. చిరాకుతో నిద్ర భంగమైన ఒకతను కోపంతో " నీ యమ్మని..." అని అంటుండగా డ్రైవెర్ సీటులో ఉన్న వ్యక్తి అద్దం దించుతూ తన చేతిలో ఉన్న వేయి రూపాయల డబ్బు కట్టలని నేల పైకి జారవిడుస్తున్నాడు. ".....దేవుడు చల్లగా చూడాలి..." అని ఆ కోపిష్టి బిచ్చగాడు తన మాటని పూర్తి చేశాడు. నిద్ర ఇందాక పోతే మత్తు ఇప్పుడు వదిలింది. కారుకి, బిచ్చగాళ్ళకి 25 అడుగులు దూరం ఉంటుంది.
ఎప్పుడూ గుడి బయటే యాచించే వీళ్ళకి సాక్షాత్తూ లక్ష్మీ దేవే వీళ్ళ దగ్గరకి వచ్చేసరికి వీళ్ళ ఏకైక పని అయిన కేవలం ఊపిరి పీల్చడాన్ని కూడా మరిచిపోయి డబ్బు కట్టల వైపు దూకారు.
కారు నుండి ఆ మనిషి కట్టలు జారవిడుస్తూనే ఉన్నాడు. వీళ్ళు ఏరు కుంటూనే ఉన్నారు. ఆనందంతో వాళ్ళు అరుపులు,కేకలు వేస్తున్నారు. ఆ వ్యక్తి ఇప్పుడు కట్టలుగా కాకుండ, నోట్లని వెదజల్లుతున్నాడు.వాళ్లు అలా ఏరుకోవడం అతనికి బాగా నచ్చింది.
ఆకాశంలోకి విసిరినది క్రిందే పడాలి, మా బ్రతుకులన్నాక ఇలానే తగలడాలి అన్నట్టుగా వాళ్లు డబ్బు ఏరుకుంటున్నారు. కారులోని వ్యక్తికి వీళ్లు కుక్కల్లాగా కనిపిస్తున్నారు. వికటాట్టహాసం చేస్తూ కారు అద్దం మూసివేసాడు. కొంతమంది ఏరుకుంటున్నారు..ఇంకొంతమంది లెక్కపెట్టుకుంటున్నారు.
ముందుకి వెళ్లిన కారు ఒక 50 అడుగులు వెళ్ళినట్టే వెళ్ళి ఆగింది. కిటికి నుండి చేయి బయటకి వచ్చి జాపి ఇంకో కట్టని విడిచాడు. ఒక్క యాచకుడు పరుగున వెళ్ళి తీసుకున్నాడు..ఇంకొక 30 అడుగులు వెళ్లి కారు మళ్ళీ ఆగింది. డబ్బు కట్టతో చేయి మళ్ళీ బయటకి పెట్టాడు. మళ్ళీ ఆ యాచకుడు పరిగెడుతూ వెళ్ళాడు.కానీ ఈసారి శ్రీదేవి భూదేవిని తాకలేదు. యాచకుడు ఏం అర్ధం అవ్వక ఆశతో గుటక వేస్తూ డ్రైవర్ ని చూస్తున్నాడు. డ్రైవర్ వదులుతున్నట్టే యాక్షన్ చేస్తూ ఆటలాడుతున్నాడు. వదులుతాడేమో అని చేతులు ముందుకు జాపడం..వదలకపోగా చేతులు మళ్లీ వెనక్కి లాక్కోవడం..ఇదే తంతు..కారు స్టార్ట్ చేసి ఒక్కొక్క నోటు జారవిడుస్తూ ముందుకు వెళుతున్నాడు. వీడు కారు వెనకే పరిగెడుతున్నాడు. కారు, యాచకుడు మంచులో మయం అయ్యారు.
ఇక్కడ చూస్తే ఒక నోటు కట్టని ముందు నేను పట్టుకున్నాను అంటే నేను అని ఇద్దరు గొడవ పడుతున్నారు..అమ్మా,అక్కా, అయ్యా,ఆలి అని భూతులు తిట్టుకుంటున్నారు. అలా అలా గొడవ పెరిగి పెరిగి కొట్లాటగా మారింది. ఈలోపు కారు వెళ్ళిన వైపు నుండి పెద్ద శబ్దం వచ్చింది. అందరూ పరిగెట్టుకుంటూ వెళ్ళి చూడగా రాంగ్ రూటులో పరిగెడుతున్న యాచకుడిని ఎదురు నుండి వచ్చిన వ్యాన్ గుద్దేసింది. స్పాట్ అంటున్నారు.
ఆ డబ్బు విసిరిన కారు ఎప్పుడో వెళ్లిపోయింది. ఒకటీ అరా జనాలు పోగయ్యారు. శవం చేతిలో ఉన్న డబ్బుని కొంతమందిపట్టుకుపోసాగారు. తమ వద్ద ఉన్న డబ్బుని కూడా తీసేసుకుంటారెమో అని భయపడి మిగితా వాళ్లు మళ్ళీ వాళ్ల ప్లాట్ ఫారం వైపు వచ్చేసారు.
వస్తూనే కళ్ళ ముందు సంఘటన చూసి భయపడ్డారు. ఇందాక డబ్బు కోసం కొట్టుకుంటున్న ఇద్దరిలో ఒకడు ఇంకొకడిని బండ రాయితో కొట్టి చంపేసాడు.చంపి రక్తం అంటిన చేతులతో డబ్బులు లెక్కపెట్టుకుంటున్నాడు.
అరగంటలో యాక్సిడెంట్, మర్డర్ గురించి తెలిసిన పోలీసులు వచ్చారు. కొందరు భయంతో పారిపోతుంటే పట్టుకున్నారు... ఎస్సై వీళ్ళందరిని బండిలోకి ఎక్కించండి అంటూ అసలు ఎందుకు కొట్టుకు చచ్చారు రా అని అడిగితే ఎవ్వరూ నోరు మెదపలేదు..డబ్బు దాచిన సంచులనే గట్టిగా పట్టుకుని నిల్చున్నారు. చెప్పకపోతే కుక్కల్ని కాల్చినట్టు కాల్చి పారేస్తా అని అరిస్తే ఒకడు భయపడి డబ్బు కోసం అని గొణిగాడు. ఏంటి అని ఎస్సై షాక్ అవ్వగా, ఏం లేదు,ఏం లేదు అని ఇంకో యాచకుడు ఏదో చెప్పబోతుండగా వాడి చెంప చెళ్ళుమనిపిస్తే జరిగిందంతా చెప్పేసారు. ఎస్సై ఆశ్చర్యంతో నోరు తెరిచి చెల్లని నోట్ల కోసం కొట్టుకు చచ్చారా? సన్నాసుల్లారా గవర్నమెంట్ పాత నోట్లని రద్దు చేసింది అని చెప్పగా అందరూ ఏం అర్ధం కానట్టు,అర్ధం అయ్యినోళ్ళు షాక్ తో నోర్లు తెరిచారు.
బాగా నల్ల డబ్బు ఉన్న ఒకడు చెల్లని నోట్లని తెచ్చి జల్లగా ఏమి లేని యాచకులు పిచ్చివాళ్ల లాగా ప్రాకులాడారు. నిజం వాళ్ళకి తెలీదు కదా!! చెల్లని నోట్లకి ఉన్న విలువ కూడా బ్రతికున్న యాచకులకి ఇవ్వలేదు ఆ వ్యక్తి. డబ్బు వెంట పరిగెత్తించాడు. రెండు ప్రాణాలని బలి తీసుకున్నాడు.వాడిలోని పైశాచికత్వానికి ఇద్దరు ఆహారమయ్యారు. కొందరికి శరీరంలో సహజంగా కొవ్వు పడుతుంది.ఇంకొందరికి డబ్బు కొవ్వుగా మారి పడుతుంది...
కారు నెంబర్ ఎవరైనా చూసారా అన్న ప్రశ్నకి యాచకులందరి నుండి చూడలేదనే సమాదానమే వచ్చింది. కానీ ఒకతను కారు నెంబర్ స్పష్టంగా చూశాడు...కానీ చెప్పలేదు... ఎందుకు చెప్పలేదో అతనికే తెలియాలి!!
To be continued...
Episode 2 in a short time... Watch this space😊
Please comment your review/opinion...😀😊
Thanks
Vamsikrishna Bazaru.
Well done my boy!!!... waiting for the next episode.
ReplyDeleteThank you so much 🙌
DeleteWill post EP-2 in a short time...