ముఖ్యపాత్రలో శ్రీదేవి - Episode 3
ఎపిసోడ్ 1: నోట్ల రద్దు చేసిన మరుసటి రోజు వేకువజామున... ఒంటికి డబ్బు పట్టిన ఒక వ్యాపారి విపరీత బుద్ధికి ఇద్దరు యాచకులు హరీ!!
ఎపిసోడ్ 2: తన గత జీవితం కాలమనే చితిలో కాలిపోగా ముప్పైఐదేళ్ళకి ఆ మంటల్లో నుండి మళ్ళీ కొత్త మనిషిగా జన్మించి, తనే తన చేతులతో తన వాళ్ళని చంపేసాను అని తెలుసుకుని తిరిగి మండుతున్న ఆ చితిలోకి వచ్చి పడుకున్న వ్యక్తి. తెలియకుండానే యచకుడికిగా మారి బెంజ్ సర్కిల్లో బతుకుతున్నాడు. అతనే క్రాంతి...
ఆ ఇద్దరి యాచకులు చనిపోయినప్పుడు తను అక్కడే ఉన్నాడు..దుర్మార్గం అనిపించింది.. చెల్లని నోటుకి ఉన్న విలువ కూడా ఒక మనిషికి దొరకట్లేదు అనుకున్నాడు. ఎవరో వస్తారు,ఏదో చేస్తారు, లోకభాందవుడు అసలు లేకుండా పోడు కదా!! అని అనుకోవడం కన్నా ఆ పని తనే చేద్దాం అని నిశ్చయించుకున్నాడు..తనలో తను ఇలా అనుకున్నాడు... వాడిని చంపేయాలి...చంపుతున్నాను..చంపేస్తున్నాను...
'చంపు ' అనే పదాన్ని భూతభవిష్యత్ వర్తమాన కాలాల్లో చెప్పినంత సులువు కాదు కదా మనిషిని చంపడం. ఆ విషయం తనకి కూడా తెలుసు..కార్ నెంబర్ తప్ప ఇంకేం తెలీదు. ఏపి16 టిజెడ్ ****
అతను ఎవరు? ఎక్కడ ఉంటాడు?
చంపేద్దాం అనుకున్నాక మీద పడ్డ ఏదో భారం తీరినట్టు, కోల్పోయినది ఏదో తిరిగొచ్చినట్టు తేలికైపోయాడు. నూతనోత్తేజం వచ్చింది. హుషారుగా అయిపోయాడు. కృష్ణానదీ తీరాన చల్ల గాలి మహిమేమో!! సమయాన్నంత కేవలం ఈ పనికే వెచ్చించడం వద్దనుకున్నాడు.వేరే ఏమైనా వ్యాపకం పెట్టుకోవాలనుకున్నాడు. అదేంటో తేలే వరకు ముందడుగు వేయకూడదు అనుకున్నాడు.ఏ డబ్బు విసిరి ప్రాణాలు తీసాడో వాడిని చంపడానికి ఒక్క పైసా కూడా ఖర్చు పెట్టకుండా చంపేద్దాం అనుకుంటున్నాడు.
తల తిప్పి చూస్తే ఎవరో కుర్రోళ్ళు కెమేరా పట్టుకుని ఎదో షూట్ చేస్తున్నారు. వాడెవడో కృష్ణానదిరా మామా కృష్ణానదిరా మామా సినిమానే లైఫుర మామా..లైఫ్ అంతా సినిమా మామా అని పాడుతున్నాడు.సినిమా పిచ్చోళ్ళేమో అనుకున్నాడు. ఇంకో పక్క ప్రేమ జంటలు..కొందరు చేతుల్లో చేతులేసుకుంటే,ఇంకొంత మంది మూతుల్లో మూతులేసుకున్నారు. చూడలేక కళ్ళకి గంతలేసుకున్నాడు.
రోజులు గడుస్తూనే ఉన్నాయి..ఆ కార్ మళ్ళీ ఇటు వైపు రాలేదు...వస్తుందో లేదో తెలీదు... ఏ ఊరో తెలీదు..ఇన్ని రోజులు బాధలో ఉండి ప్రపంచాన్ని పట్టించుకోలేదు...మనిషిగా మారతాడు అనుకున్నాడు..కానీ క్రాంతి ఇప్పుడు మృగంగా మారాడు...కాదు కాదు మార్చారు.
హాస్పిటల్లో ఉన్నప్పుడు పేపర్లో చదివినట్టు గుర్తు ఈ వాహనాలు,రిజిస్ట్రేషన్లు వగైరా వగైరా,కానీ గుర్తు రావట్లేదు. తోటి యాచకులని అడుగుదాం అంటే అందరూ నిషానీలే, నాలుగు అక్షరం ముక్కలు తెలిసిన ఉపేంద్ర ఎక్కడికి పోయాడో తెలీదు.మొదట్లో ఉపేంద్ర సినిమా పోస్టర్లు చుట్టుకుని తిరిగేవాడని వాడికి ఆ పేరు వచ్చింది. పిల్లల్ల్ని అడుగుదాం అంటే ఆడపిల్లలు క్రాంతిని చూస్తేనే భయపడుతున్నారు. ఒక సాయంకాలం కూర్చుని ఉండగా ఎవరో కుర్రోడు క్రాంతి వైపుకే వస్తున్నాడు. తన వైపుకి అయ్యుండదులే అనుకున్నాడు. అ కుర్రోడు క్రాంతివైపే వస్తున్నాడు. ఖచ్చితంగా క్రాంతి వద్దకే..చూడటానికి సన్నగా, లేలేత మీసాలు..చొక్కా పైబొత్తాలు తీసేసాడు. వస్తూవస్తూనే అగ్గిపెట్టె ఉందా! అన్నాడు..
క్రాంతికి వినపడలేదు.. మళ్లీ చిరాగ్గా అగ్గి పెట్టి..అగ్గిపెట్టె..అన్నాడు.
క్రాంతి తీసి ఇచ్చాడు...తీసుకుని సిగరెట్ట్ బయటకి తీసి వెలిగించి గుప్పుగుప్పుమంటూ దమ్ము కొడుతున్నాడు. ఫోన్ మోగింది..ఎత్తగానే బూతులు దండకం ఎత్తుకుని మాట్లాడుతూ దమ్ము కొడుతున్నాడు. వీడిని రిజిస్ట్రేషన్ నంబర్ అడుగుదామని నిన్ను ఒకటి అడగాలి అన్నాడు.వాడు విని పొగరుగా ఒక చూపు చూసి అగ్గి పెట్టె విసిరి వెళ్లిపోయాడు. యవ్వనస్తుల పిల్లతనం...
తెల్లవారగానే కారు వస్తుందేమో అని చూస్తున్నాడు.. కొన్ని రోజులుగా ఒక కుర్రోడిని గమనిస్తున్నాడు. వస్తున్నాడు...ఎవరికోసమో ఎదురు చూస్తున్నాడు..ఎవరికోసమో ఎమిటిలే అమ్మాయ్ కోసమే...ఆ అమ్మాయి రాగానే చూస్తాడు. ఏం మాట్లాడడు..ఆ అమ్మాయి ముందు ఉన్న కాలేజ్ లోకి వెళ్లిపోతుంది. ప్రతిరోజూ ఇంతే...మాటలు ఉండవు...వన్ సైడ్ ప్రేమికుడు అని అర్ధమయ్యింది.ముచ్చటేస్తుంది వాడిని రోజు చూస్తే.. వన్ సైడ్ లవర్స్ అనే ఒక కొత్త మతం పెడితే ప్రపంచంలోనే అతి పెద్ద మతం అవుతుంది కదా! అని అనుకుని నవ్వుకున్నాడు. వీడితో పని అవుతుంది అనుకున్నాడు క్రాంతి.
ఆ అమ్మాయి బస్ ఇంకా రాలేదు. వెళ్ళి వాడి పక్కన నిల్చున్నాడు. తెలిసినవాడిలా ఒక నవ్వు నవ్వాడు. వాడు అసలు ఈలోకంలోనే లేడు.. వాడి పనయ్యాక అడుగుదాం అని వచ్చేసాడు. బస్ రావడం, అటెండెన్స్ వేయించుకోవడం,వీడు మళ్ళీ వెనక్కి తిరిగి వచ్చేయడం చకచకా ఐపోయింది. వెళ్ళి పక్కన నిల్చున్నాడు.సూటిగా ఎంటి ప్రేమా? అన్నాడు. వాడు పట్టించుకోలేదు."ఆ అమ్మాయి పట్టించుకోవట్లేదా?" అంటే మొదటికే మోసం..
క్రాంతి మొదలుపెట్టాడు..
రోజూ ఇంతమందిని చూస్తున్నా..నిన్నుకూడా..దమ్ము కొట్టవు, ప్రతీ అమ్మయి వెనుకపడవు...అసలు ఆ అమ్మాయి నిన్ను ఎందుకు చూడాట్లేదు అనే కదా!! నీ సందేహం...
ఇది చాలదన్నట్టు "అంత ఇష్టమా!! ఒప్పుకుంటే పెళ్లి చేసుకుంటావేంటి?" అని అడిగాడు.
పొగడ్తకి పడని మనిషి, ఆ అమ్మాయి అంటే అంత ఇష్టమా,సీరియస్ ప్రేమా అంటే సమాదానం చెప్పని టీనేజ్ కుర్రోళ్ళు అరుదుగా ఉంటారు. ఒక రకమైన వీక్ పాయింట్.
"అంత ఇష్టమా!! ఒప్పుకుంటే పెళ్లి చేసుకుంటావేంటి?"అని వినగానే ఒకింత సిగ్గుతో అవునని తల ఊపి..అందుకే కదా ప్రేమించేది!! అన్నాడు. పదిహేడేళ్ళ పెద్దరికం పరిమళించింది.
ముందు ఉన్న బస్ ని చూస్తూ ఇలా చెప్పుకుంటూ పోతున్నాడు క్రాంతి.. అదుగో ఆ బస్ ఉంది..దాని పైన కొండపల్లి అని స్పష్టంగా రాసి ఉంది. అలా ఉండటం వల్ల ఎక్కాలా?వద్దా? అని జనానికి ఒక స్పష్టత..క్లారిటీ ఉంది. నువ్వు ఆ క్లారిటీ ఇస్తున్నావా? లేదు..ఇవ్వట్లేదు.. ఉడికించడానికి ఇవ్వలేవు కూడా అన్నాడు. కుర్రకుంక కంకిలా కాలిపోయాడు. క్రాంతి ఆపకుండా చెప్తూనే ఉన్నాడు...ఏది ఆ కార్ ని చూసి చెప్పు ఆ కార్ వ్యక్తిది ఏ ఊరో!! చెప్పలేవు..ఎందుకంటే స్పష్టంగా రాసిలేదు కాబట్టి..నువ్వు కూడా అంతే స్పష్టంగా లేవు...కార్ లాగా..ఏది ఆ కార్ ఏ ఊరో చెప్పు,ఈ కార్ ది ఏ ఊరో చెప్పు... చెప్తే నీ ప్రేమ గెలుస్తుంది అని నమ్ముతాను... కుర్రకంకి పేలడానికి సిద్ధపడ్డాడు..పూనకం వచ్చినవాడిలా కనిపించిన ప్రతీ కార్ రిజిస్ట్రేషన్ నంబర్ ని బట్టి ఇది 09 అంటే హైదరాబాద్ కార్..అది 31 అని ఉంటే వైజాగ్..16 కృష్ణ..07 గుంటూర్..అని చెప్పుకుంటూ పోయాడు..క్రాంతి అన్నీ గుర్తుపెట్టుకుంటున్నాడు.
తనకి కావాల్సింది వచ్చేసిన తర్వాత నటిస్తూ వాహ్..వాహ్...నీ ప్రేమ తప్పకుండా గెలుస్తుంది బాబూ అనగానే..వాడు ప్రపంచాన్ని గెలిచిన చిట్టి అలెగ్జాండర్లా ఉన్నాడు.
నేను చెప్పేదేంటంటే కొన్ని రోజు కనపడకు..ఈ గూర్ఖాగిరి మానేయ్.నువ్వొకడివి రావట్లేదు అని ఖచ్చితంగా ఆ అమ్మాయి అనుకుంటుంది. నిన్ను మిస్ అవుతుందా లేదా అనేది సెకండరీ. ఒక నెల తర్వాత ధైర్యంచేసి చెప్పు...ఏం చెప్పాలనుకుంటుందో తన ఇష్టం ఇంక. అని చెప్పి వచ్చేసాడు.
మనం బలంగా కోరుకుంటే ఆ పని జరగడానికి కాలం,లోకం సహకరిస్తుంది అన్నట్టుగా... ఒక రోజు ఉపేంద్ర తిరిగి బెంజ్ సర్కిల్లో ప్రత్యక్షమయ్యాడు. క్రాంతికి తోడు దొరికింది. మూడు రోజులు గడిచాక ఒకరోజు మధ్యాహ్నం క్రాంతి,ఉపేంద్ర ఫూట్ పాత్ మీద కూర్చుని ఉండగా...చూడు హిందీగా...ఆ పోలీసోడు ఫోన్ లాంటి దాన్లో నెంబర్లు నొక్కేస్తున్నాడు అన్నాడు..క్రాంతి ఏమో జనలా దగ్గర డబ్బు తినేస్తున్నాడు కదా!! కొత్త ఫోన్ అయ్యుంటది అన్నాడు..లేదు లేదు..అది ఫోన్ కాదు అంట!! అందులో బండి నెంబర్లు కొడితే బండి ఎవరిది? ఎప్పుడు కొన్నారు? బండి గురించి ఉంటదంట!! మొన్న ఒక పిల్లోడు చెప్పాడు నాకు అన్నాడు. మరి కార్లు? భలే వాడివిరా నువ్వు హిందీగా కార్లు కూడా వస్తాయి అంట!!
క్రాంతికి ఎలాగో కారు నెంబర్ తెలుసు..ఎలా అయినా వివరాలు తెలుసుకుందాం అని అనుకున్నాడు. ఇంటర్ పిల్లకాయ్ ని బురిడి కొట్టించినంత సులువు కాదు పోలీసోడితో వ్యవహారం...ఎలాగూ ఆ పోలీసోడికి ఉపేంద్రానే హుండీ కాబట్టి (డైరెక్ట్ గా కానుకలు తీసుకోని మంచోడు ఆ పోలీసు) పనవ్వచ్చు అనుకున్నాడు. అనుకున్నదే ఆలస్యం..ఉప్పిని ఎహే ఊరుకో..అంత చిన్న దాంట్లో అయన్ని ఉంటాయంటే నమ్మడానికి నేనేమన్నా వెర్రిబాగులోడినా...అబద్ధాలాడకు..అని కవ్వించాడు..మాటా మాటా పెరిగింది.. ఉప్పి ఉడికిపోతున్నాడు..ఎలాగైనా నిరూపించాల్సిందే అనుకుని పదరా హిందీగా ఇయ్యాల నేను సెప్పింది ఒప్పని నీకు తెలియాలి అని క్రాంతిని పోలిసు దగ్గరికి తీసుకువెళ్ళాడు.
పెద్ద ట్రాఫిక్ లేదు, జూనియర్ నిలబడితే ఇతను షెడ్లో కూర్చున్నాడు. జరిగినదంతా చెప్పారు..ఏంట్రా ఇటొచ్చారు..ఎవడైనా తేడాగా కనపడ్డాడా? అన్నాడు.మంచి మూడ్ లో ఉన్నట్టు ఉన్నాడు పోలీసు..వెళ్ళీవెళ్లగానే మీ చేతిలో ఉన్న ఫోన్లో వివరాలన్ని వచ్చేత్తాయ్ కదా బాబు అంటే అవునురా అన్ని వస్తాయి అన్నాడు. అమ్మో అన్నీ ఎట్టోస్తాయి..మీరు ధర్మప్రభువులు బాబు..పెద్దోళ్ళు అందుకే మీరు కూర్చుని పనులు చేయిస్తున్నారు అంటే..అంటే పని చేయట్లేదు అంటున్నావారా ఉప్పిగా అని అనగా లేదు లేదు అయ్యా రాజు కూకునే కదా ఉండేది..అలానే మీరు కూడా..అంటే ఇంక గొప్పలు మొదలుపెట్టి సి.సి కెమేరాలు రికార్డ్ చేస్తుంది టివీల్లో చూపించాడు. అయ్యా ఈడికి ఆ వాహనాల వివరాల పెట్టె కూడా చూపిస్తే ఇంక పోతాం అయ్యా!! సరే అని అతని బండి నెంబర్ కొట్టి చూపించి ఇదిగో ఇది నా పేరు..నా బండి పేరు..ఎప్పుడు కొన్నాను..అన్నీ ఉన్నాయి అని చుపించాడు...అయ్యా అన్నీ కనపడతాయా? ఏదైననా అంటే ఆంధ్రలో ఉన్న అన్నీ కనపడతాయి అని చెప్పాడు. మేము ఒక పాలి కొడతాము ఇవ్వండయ్యా అంటే...ఏం రా? ఆటలా? అంటే..పోనీ మేము చెప్తాము అయ్యా మీరు కొట్టండి అన్నాడు క్రాంతి. సరిసరే ఇదే ఆఖరు అని చెప్పండి అన్నాడు. క్రాంతి ఉప్పికి అవకాశం ఇవ్వకుండా నోటికొచ్చింది చెప్తున్నట్టుగా తను చంపాలనుకునేవాడి నంబర్ చెప్పాడు... పోలీసు ఒ.కె. బటన్ నొక్కాడు...స్క్రీన్ మీద ఎదో తిరుగుతుంది. క్రాంతికి ఏం అర్ధం కావట్లేదు.. ఊపిరి ఆగిపోయినట్టు ఉంది..కాలం పదోవంతు వేగంతో చాలా చాలా నిదానంగా కదులుతున్నట్టుగా అనిపిస్తుంది. ఆ వచ్చాయ్ రా...ఎవరో రాజకుమార్ అంట..సరే ఇంక మీరు పోండి.. నాకు చాలా పని ఉంది అని చెప్పి వెళ్ళిపోయాడు. ఉప్పి గెలిచాడు అని ఎగురుతున్నాడు.
క్రాంతి మళ్లీ శూన్యంలోకి వెళ్లిపోతున్నాడు...తనకి తను చంపాలనుకునే పావుకి దూరం తగ్గిపోతుంది.ఎందుకో ఉన్నట్టుండి డీలా పడిపోయాడు..అప్పుడే మిధున వచ్చింది. పది రూపాయల నోటు ఇచ్చి నవ్వింది. అంత నిస్పృహలో మనసు తేలిక పడింది. నీకు హిందీ వచ్చు అన్నావ్ కదా! పది పరీక్షలు ఎందుకు రాయకూడదు? అని అంది... నవ్వి ఊరుకున్నాడు. తనలో వేరే మనిషిని చంపే మృగం ఉంది..కానీ ఈ మిధున పాప తనలో ఒక మంచివాడిని చూస్తుంది. భయంవేసింది...తర్వాత మిధున వెళ్ళిపోయింది.
తనలో వేరే మనిషిని చంపే మృగం ఉంది..కానీ ఈ మిధున పాప తనలో ఒక మంచివాడిని చూస్తుంది. భయంవేసింది...తర్వాత మిధున వెళ్ళిపోయింది. ఇప్పుడు తన దగ్గర తన శత్రువు పావు పేరు ఉంది, కారు నెంబర్ ఉంది. ఎక్కడ ఉంటాడో, అసలు మళ్లీ ఇటు వస్తాడో లేదో తెలీదు..
సరిగ్గా మూడు వారాల తర్వాత ఝూమ్మని దూసుకుంటూ వెళ్లిపోయింది. ఒక రకమైన ఉద్వేగానికి లోనయ్యాడు. వెంటనే రోడ్డుకి అటువైపు వెళ్లి కూర్చున్నాడు. మళ్లీ ఇటు వైపే తిరిగి వస్తుందేమో అని!! గంట,పూట గడిచిపోయాయి. కాలేజ్ నుండి విలేజ్ కి తిరిగి వెళ్ళిపోతున్నారు విద్యార్ధులు. రాత్రి అయింది. గంట వరకు కుర్రకారుతో హుషారుగా ఉన్న రోడ్డు ఖాళీ ఐపోయింది. దూరం నుండి వస్తున్న కార్లనే చూస్తున్నాడు. మళ్లీ అదే కారు..తిరిగి వెళ్ళిపోతుంది.మనిషి కనిపించలేదు. రెండు,మూడురోజులు ఇదే తంతు. ఉదయాన్నే బెజవాడ లోపలకి,రాత్రి బయటకి వెళ్తుంది. మనిషి మాత్రం తెలియట్లేదు. నాలుగో రోజు కార్ వచ్చే సమయానికి సిద్ధంగా ఉన్నాడు.కార్ వస్తుంది.దూరం నుండే గుర్తు పట్టాడు..అది దగ్గరకి వచ్చేసిన తర్వాత ఒక్కసారిగా రోడ్డు మీదకి దానికి అడ్డంగా పరిగెత్తాడు.కార్లో ఉన్న వ్యక్తి ఒక్కసారిగా బ్రేక్ వేసాడు. పెద్ద శబ్దం. ఉన్న అతికొద్ది మంది ఏం జరిగిందా అని ఉలిక్కిపడి చూసారు. కారు క్రాంతిని తాకలేదు. ఒక్క ఉదుటున లోపల ఉన్న అద్దం దించి బయటకి వచ్చాడు. ఇతనే అతను..వస్తూనే బండ బూతుల శతకం ఉటంకించాడు.క్రాంతి లోలోపల వికటాట్టహాసం చేస్తూ తప్పు చేశావ్ నువ్వు, చంపేస్తున్నా నిన్ను త్వరలో అని మెల్లగ నసుగుతూ పైకి మాత్రం దండం పెట్టి పక్కకి వచ్చేశాడు. అతనే అని వంద శాతం రుజువయ్యింది. ఇంక నిర్భయంగా ముందుకు వెళ్ళచ్చు అని అనుకున్నాడు.
ఇంక ప్రతీరోజు ఆ రాజకుమార్ ఈ రూట్లోనే వెళ్తున్నాడు. కానీ ఎంత దూరం వెళ్తున్నట్టు? ఎక్కడికి వెళ్తున్నట్టు?
ఒక రోజు ఉదయాన్నే కార్ వచ్చే సమయానికి ఒక గంట ముందు బయలుదేరి ఆ కారు వెళ్లే దారిలోనే రెండు కిలోమీటర్లు నడుచుకుంటూ వెళ్లి ఒక పెద్ద జంక్షన్లో ఆ కారు కోసం ఎదురు చూస్తున్నాడు. కొంతసేపటికి కారు వచ్చి,వెళ్లిపోయింది. మరుసటిరోజు ఇప్పుడు ఎక్కడైతే ఆగిపోయాడో అక్కడ నుండి కొంత దూరం నడిచి కారు కోసం ఎదురుచూశాడు. కారు అదే రూటులో వచ్చివెళ్ళింది. మూడవరోజు రెండవ రోజు ఎక్కడైతే ఆపేసాడో అక్కడ నుండి మొదలుపెట్టి ఇంకొంత దూరం నడిచి ఎదురుచూసాడు. కారు అదే రూటులో వచ్చివెళ్ళింది.ఆదివారాలు కారు వచ్చేది కాదు.ఇలానే పాయింట్లు పెట్టుకుంటూ 9 రోజులు పాటు మొదలయ్యిన చోటు నుండి 16 కిలోమీటర్ల దూరం వచ్చాడు. పదవ రోజు ఉదయాన్నే తొమ్మిదవ రోజు ఆగిపోయిన చోటుని దాటి ముందుకు నడుచుకుంటూ వెళ్లి ఆగాడు...ఆ రోజు ఉదయం కారు రాలేదు. వెళ్ళిన దారిలోనే వెనక్కి నడుచుకుంటూ వచ్చి తొమ్మిదవరోజు అపేసిన చోట కూర్చున్నాడు. రోజంతా అక్కడే ఉన్నాడు. రాత్రి అయ్యింది...కారు కోసం ఆతృతగా చూస్తున్నాడు. టైం అయ్యింది. ఈలోపు ఒకతను 20 రూపాయలనోటు ఇచ్చి రెండు రూపాయలు తీసుకుని మిగిలిన చిల్లర ఇమ్మంటున్నాడు. చిల్లర వెతికి ఇచ్చే టైంలో కారు వెళ్లిపోతుందేమో..అసలే చీకటి వద్దులే వెళ్లిపో అన్నాడు... చిల్లర ఇచ్చి నోటు తీసుకోవయ్యా అని మళ్ళీ మళ్లీ అడుగుతున్నాడు.పోనీ ఇరవై నోటు మొత్తం తీసేసుకుంటావా? ఆస్థి రాసేయన పోనీ? చిల్లర ఇచ్చి నోటు తీసుకోవడానికి నొప్పి ఏంటిరా నీకు? అని తిడుతున్నాడు.వద్దు బాబు అని వారిస్తున్నా వినకుండా విసిగిస్తున్నాడు. విసిగి విసిగి చిరాకుతో వంద నోటు తీసి ఇదిగో నా దగ్గర ఇదే పెద్ద నోటు ఉంది ఇది తీసుకుని ఇక్కడనుండి వెళ్లిపో బాబు అని అందరూ చూస్తుండగా క్రాంతి ఇచ్చాడు.
ఎదుటివాడికి చిర్రెత్తుకొచ్చింది. చేయెత్తి కొట్టబోయాడు. క్రాంతి లేచి ఎడమ చేత్తో మెడ మీద, కుడి చేత్తో చెంప మీద కొట్టాడు. తాగి ఉన్నట్టు ఉన్నాడు.. కింద పడిపోయాడు.
ఐదు నిమిషాల తర్వాత కారు వచ్చి,వెళ్లిపోయింది.
ఉదయం పదవ పాయింటు దాటని కారు, రాత్రి తొమ్మిదవ పాయింటు నుండి వచ్చింది అంటే తొమ్మిది,పది పాయింట్ల మధ్యలో ఎక్కడో ఒక చోట లోపలకి వెళ్తుంది అన్నమాట. అలా మరుసటి రోజు తొమ్మిది,పది పాయింట్ల మధ్య నిల్చుని ఎక్కడ రూటు మారుతుందో చూసి ఇంకొక మూడు రోజులు అలానే చేసి ఆఖరికి ఆ కారు ఎక్కడ ఆగుతుందో అక్కడికి చేరుకున్నాడు. పెద్ద భవనం..వారం పైగా రెక్కీ వేసాడు. మొత్తం సెక్యూరిటీ..ఇక్కడ ముట్టుకోవాలన్నా కష్టం అనిపించింది.. మళ్లీ నడుచుకుంటూ బెంజ్ సర్కిల్ వచ్చేసాడు... ఆఫీసు అడ్రస్ తెలిసినా కష్టం అని అనుకున్నాడు. ఇంటి దగ్గర రెక్కీ వేద్దాము అనుకున్నాడు. మళ్లీ అలానే చేసి ఈసారి ఇంటి అడ్రస్ కనుక్కున్నాడు. రెక్కీ వేసాడు. చంపేయచ్చు నిర్భయంగా అని నిశ్చయించున్నాడు.
తీరికగా తరువాయి భాగంలో ఎలా చంపాలో ప్లాన్ చేసుకుందాం!!
"జీరో బడ్జెట్ కిల్లింగ్స్" చదవటానికి సిద్ధంగా ఉండండి.
ధన్యవాదములుతో
🖋️ వశిష్ఠ
వంశీకృష్ణ బాజారు

Comments
Post a Comment