బొమ్మాబొరుసు - BommaBorusu
చిన వెంకన్నబాబు గుడిలో కూర్చుని ముందుకుపోతున్న కాలంలో ఆలోచనల్లో వెనక్కిపోతున్నాను. నాకు పక్కగా ఇద్దరి మాటలు వినిపిస్తున్నాయి. మళ్ళీ నా ఆలోచనల్లో మునిగిపోదామని ప్రయత్నంలో ఉండగా ఇంకో పక్కగా చంటి పిల్లాడుపేడుపు వినిపిస్తుంది. ఏడవకూడదు అమ్మా స్వామి గుడికొచ్చినప్పుడు. తప్పు. అడుగో స్వామీ. దణ్ణం పెట్టుకో అనగానే దేవుడు నిజంగా దిగొచ్చాడా అని ఆత్రంతో కళ్ళు తెరిచి వెతకసాగాను. కళ్ళ ముందు ఆ చిన్నపిల్లాడు ఏడుపాపి నన్నే చూస్తున్నాడు. నేను వాడినే చూస్తున్నాను. పసి పిల్లల నవ్వుల్లోనే దేవుడు ఉంటాడు కదా అనిపించింది!! వాడు నన్ను చూసి చామీ..చామీ అని చేతులతో కొడుతున్నాడు. కళ్ళు మూసుకుని ధ్యానం ఇంట్లోనైనా చేసుకోవచ్చు బయటకొచ్చి కళ్ళు మూసుకోవడం ఎందుకు అనిపించింది. నాకు తెలియకుండానే నాకు పక్కగ కూర్చుని మాట్లాడుకుంటున్న వారి మాటలు వింటున్నాను.
(C1 - మొదటి మనిషి, C2-రెండో మనిషి)
C1: ఏ? ఎందుకు చేర్పించలేదు? డబ్బు ఏవన్నా ఇదా!! కాదే??
C2: వద్దంటున్నార్రా ఆడోళ్ళు. తెలియందేదీ లేదు. రోజులు బాలేదూ కదరా!! దీంచదువు అంతంతమాత్రవేనూ!! పైగా పిల్లోడూ కాలేజికి వస్తున్నాడు.
C1: అయితే ఇంటో కుర్చోబెట్టి ఏం చేత్తావు?? పెళ్ళా??
C2: లేదు..
C1: ఏం మాట్టాడవే ?? ఇంకేం ఆలోచించలేదన్న మాట. ఇంకేం ఆలోచించడానికి లేకపోతే మొదట ఆలోచన చేసేది పెళ్ళే కదా!!
C2: అన్నిసార్లు పెళ్ళి..పెళ్ళి అనకురా!!
C1: మరీ? పిల్లని ఓ మాట అడిగావా?
C2: అడిగితే ఏవంటదీ మీరేవంటే అదే నాన్న అంటది..
C1: నిన్ను కాదు దాన్ననాలి..అసలు నీ మనసులో ఏముంది?
C2: మా పెదనాన గారి మనవరాలు ఏం చేసిందీ తెలీయందా?? తలెత్తుకు తిరిగాడా మా అన్న?? దీన్మీద నమ్మకంలేక కాద్రా!! అబ్బాయిల్మీద లేక!!
C1:నీకూ ఓ కొడుకున్నాడు కదరా!!
C2: ఆడ్ని సూసే భయవేత్తంది!!
C1: నీ పెంపకవే తప్పైతే!!
C2: అవునవును... కొడుకుల కలోడివి ఎన్నైనా అంటావు..
C1: కొడుకుని చూత్తే భయవేత్తందని నువ్వే అంటావు..కూతురేమో నేను చదవనంటంది. మరేం చేస్తది అంట!!
C2: మా అవిడైతే భయమేట్టేసుకుంది ఇదేం చేస్తదో అని. మంచి సమ్మందం చూసీ చేసేద్దాం అంటుంది.
C1: నువ్వేం చేత్తనావు మరి? చెప్పకపోయావు!
C2: నేనే అప్పుడే చిన్న పిల్లకి పెళ్ళేంటని ఆపాను. పైగా దాని చదువులకి అయ్యేది ఏ తృణమో,పణమో బంగారం కొనచ్చు. పిల్లోడి చదువులకి మిగుల్తది!!
C1: ఆడిమీద పెడితే తిరిగొత్తదంటావు!! చెప్పేదినూ, ఇయాలా రేపు ఆడపిల్లలు చదువుకోవాలి, ఉద్యోగాల్జేయాలి, ఆళ్ళ కాళ్ళ మీదాళ్ళు నిలబడాలి.
C2: ఉద్యోగం చేసి నువ్వు గొప్పంటే నేను గొప్పని తగువాడడానికా??
C1: అంత గుణం లేనోడికి కట్టబెడతావ ఏంటి? కాదుగా?? ఊరోళ్ళ మాటలు తలకెక్కించుకున్నావు బాగా!! వాళ్ళ భయాలు నీలో నాటి ఆడి కూతురిలా చేసింది...ఈడి కూతిరిలా చేసింది అని నీళ్ళు పోస్తూ నిన్నొక వెర్రోణ్ణి చేస్తున్నారు. నీకు చెప్పి నాకిసుగొచ్చింది. ఇంక నావల్ల కాదు!! ఏవైతే అది!!
C1 అక్కడనుండి లేచి వెళ్ళిపోయాడు.కొంత సేపటి తర్వాత ఒక పదిమంది గుంపు ఇటుగా వస్తున్నారు. వాళ్ళతో C2 కలిసిపోయాడు. మధ్యవయస్కులు, ఆడవాళ్ళు, పిల్లలు అందరూ ఉన్నారు. సాయంకాలం దర్శనానికి వేళ అవ్వడం చేత లైన్లో నిలబడటానికి వెళ్తున్నారు. నేను కూడా వెళ్దామని సిద్ధమవ్వగా పెద్దగా మాటలు వినపడుతున్నాయి. ఏంటా అని చూడగా ఒక కుర్ర గుంపు నవ దంపతులతో నవ్వుకుంటూ వస్తున్నారు. అందరూ వాళ్ళ వైపే చూస్తునారు. నూతన వధూవరులు డైరెక్ట్ శీఘ్ర దర్శన లైన్లో వెళ్ళిపోయారు. అంతా కుర్రగుంపు అవ్వడం చేత వారిది ప్రేమ వివాహమని అర్ధమయ్యింది. ముందు వెళ్ళిన ఫ్యామిలీ బృందం ఆగిమరీ ఏంటిదీ అని చూస్తున్నారు. C2 రియాక్షన్ ఏంటా అని చూస్తున్నాను. ఎక్కడా?? నాకు కనపడితే కదా!! ఆ వ్యక్తి.
చూస్తే లైన్లో పిల్లల్ని, భార్యని పట్టుకుని వెళ్తున్నాడు. వారి వెనకాలే ఈ కుర్రవాళ్ళ గుంపు వెళ్తుంది. చూస్తుంటే అందరూ 22-24 వయస్సు గల వాళ్ళే ఉన్నారు. వెళ్ళి C2 కుటుంబం వెనకనే నిలబడ్డారు.
ఆత్రుతతో నేను వారి వెనకాలే నిలబడ్డాను. భార్యాపిల్లలు ముందు నిల్చున్నారు.ఈయన వెనుక ఉన్నరు. ఈయన వెనుక కుర్రోళ్ళు ఉన్నారు. కుర్రోళ్ళు కబుర్లు చెప్పుకుంటూ నవ్వుకుంటున్నారు. నా కాలేజి రోజులు గుర్తొచాయి వాళ్ళ మాటలు వింటుంటే.
లైన్ నెమ్మదిగా కదులుతూ ఆగుతూ వెళ్తుంది. వాళ్ళలో కొంతమంది ఈ ఫ్యామిలీ కన్నా ముందు నడవాలని అనిపించి ముందుకి దారి అడిగారు. అంకుల్ ఫ్యామిలీ దారి ఇచ్చారు. ముందు ఉన్న కూతురిని మధ్యలోకి, మధ్యన ఉన్న కొడుకుని ముందుకు ఆ కుర్రవాళ్ళ వెనుకకి పంపింది వాళ్ళ అమ్మ. దీని పేరు జాగ్రత్త!!?? ముందుకు వెళ్ళిన కుర్రోళ్ళకి అర్ధమయ్యి ఇంక వెనుకకి తిరిగి చూడలేదు దర్శనమయ్యే వరకు. ముందు అబ్బాయిలున్నారని తమ కొడుకుని ముందుకు పంపిన వాళ్ళని చూడగానే నాకొక ఆలోచనవచ్చింది. వెంకన్న బాబుకి నేను చెప్పాల్సినవి చెప్పి బయటకి వచ్చేసాను. వస్తూనే C2 కి నేను అనుకున్నది అడిగేద్దమని నిశ్చయించుకున్నాను.
ఆయన(C2), C1 ఇద్దరూ ప్రసాదాల కౌంటర్ వైపు వెళ్తున్నారు. నేను కూడా ఆ పని మీదే వెళ్తున్నా.. మాట్లాడదామా వద్దా!? అనిపిస్తుంది. లేదు మాట్లాడాల్సిందే అని అనుకున్నాను. ప్రసాదాల కౌంటర్ వెలుపల కావడం చేత దూరమే వెళ్ళాలి. వారిద్దరూ ముందు వెళ్తున్నారు. పక్కగా వెళ్లి బాబాయి గారు ఇందాక లైన్లో మీ అమ్మాయిని
అబ్బాయిల వెనుక ఉన్నదని వెనక్కి పిలిపించి మంచి పని చేసారు. వీడెవడు ఇదంతా మాట్లాడ్తున్నాడని చూస్తున్నారు ఇద్దరూ. ఏ ఊరు బాబు మీది అని అడిగారు. విజయవాడ అని చెప్పాను. మంచిది అన్నారు. అమ్మాయిని వెనక్కి రమ్మని మీ అబ్బాయిని ఆ కుర్రవాళ్ళ పక్కకి పంపించారు కదా మీ ధైర్యం మీ అబ్బాయిని వాళ్ళేం చేయరు అనా!? నేనన్నది వాళ్ళకి అర్ధం కాలేదు. మీది జాగ్రత్తే అనుకుందాం. గుడిలో అమ్మానాన్న ముందు ఎవరైనా అమ్మయిని అల్లరి చేస్తారా? అబ్బాయిలంటేనే వెధవలన్నట్టు చేసారు మీరు. ముందున్న కుర్రవాళ్లు నొచ్చుకుంటారని ఆలోచించలేదా? ఎవరు నొచ్చుకుంటే నాకేమి
అన్నట్టు చూస్తున్నాడు అతను. C1 మాత్రం అవన్నీ నీకెందుకు బాబు. మా పిల్లలు మా ఇష్టం అంటున్నాడు. నేను ఆపకుండా అలా చెప్పుకుంటూ పోతున్నాను. మీరు మీ అమ్మాయిని వెనక్కి పిలిచింది ఏ చేయో,కాలో పొరపాటున తగులుతుందని కాదు. మాటలు ఎక్కడ కలుస్తాయో అని. కాదు అని అన్నాడతను. నమ్మకం ఉంటే మీ అమ్మాయిని అక్కడే ఉంచేవారు. మీకు ఏం జరుగుతుందో అని అతి భయం. మీ అబ్బాయిని ముందుకి పంపించారు కదా!! అబ్బాయి అనే కదా!! ఏమో మీ అబ్బాయి వాళ్ళతో మాటలు కలిపి వాళ్ళలో ఏ అబ్బాయితో ఆకర్షణకి లోనవ్వడని మీ నమ్మకమా!!?? అసలే ఇది కలికాలం సార్. ఏదైనా జరగచ్చు!!
దేవుడి గుళ్ళో ఏంటా మాటలబ్బాయ్ అన్నాడు C1.. మొహం కోపంగా పెట్టి మౌనంగా వింటున్నాడు C2. మీ అమ్మాయి వేరే అబ్బాయితో మాట్లాడేస్తే కొంపలంటుకుంటాయని భయపడే మీరు మీ అబ్బాయి గురించి ఎందుకు భయపడట్లేదు సార్. అమెరికాలోని ఒక విశ్వవిద్యాలయం మన దేశంలో జరిపిన సర్వేలో వందకి ఎనిమిది మంది అబ్బాయిలు స్త్రీలని కాకుండా అబ్బాయిలని ఇష్టపడుతున్నారని తేలింది. పైగా ఆశ్చర్యం ఏంటి అంటే ఒక మగాడు ఇంకో మగాడిని తనతో ప్రేమకి ఒప్పించడానికి ప్రయత్నిస్తే నూటికి డెబ్బై ఎనిమిది శాతం మంది లొంగిపోతున్నారు అంట. అదే అమ్మాయి అబ్బాయి ప్రేమలో పడటానికి ఉన్న అవకాశం నలబైమూడు మాత్రమే!
ఇప్పుడు చెప్పండి. ఎక్కువ రిస్క్ ఎందులో ఉంది?? అని నోటికి వచ్చిన పుక్కిటి లెక్క చెప్పేసాను.
నాకు కోపం తగ్గట్లేదు. ఏమో మీ అబ్బాయి పైన మీ నమ్మకం తప్పు అయ్యిందనుకోండి... ఒకవేళ మీరు భయపడినట్టే మీ కూతురు ఎవరినో ప్రేమించి పెళ్లిచేసుకొస్తే... తెల్లారి గదిలోనుండి కూతురు, అల్లుడూ వస్తే బానే ఉంటుంది కానీ మీ అబ్బాయి గదిలో నుండి ఇంకో అబ్బాయి (కోడలులాంటి అల్లుడు) బయటకి వస్తే అది చూసి మీరు తట్టుకోగలరా??
మీ పేరేంటి అని అడిగితే ఏదో ఆలోచిస్తూ వెంకటేశు అని చెప్పాడు. చుడండి వెంకటేశు గారు జాగ్రత్తగా చూడాలంటే ఇద్దరిని జాగ్రత్తగా చూడండి. అంతేకానీ ఆడపిల్లని అతిజాగ్రత్తగా, అబ్బాయిని స్వేచ్చగా వదిలేయద్దు. ఇలా అతి జాగ్రత్తే మీ అబ్బాయి విషయంలో చేయండి, చేసి చూడండి. మీ అమ్మాయి 'ఊ' కొట్టినట్టు వాడు ఉండడు. మిమ్మల్ని ప్రశాంతంగా ఉంచడు. అందుకని కూతురంటే పెళ్లి చేసి పంపేస్తే సరి, కొడుకంటే చదువు అని, సంపాదన అని అనుకోవద్దు. కూతురు చూసినట్టు ప్రేమగా కొడుకు చూడడు అని మా అమ్మ ఎప్పుడూ చెబుతుంది. చిన్నవాడిని ఎక్కువ మాట్లాడి ఉంటే క్షమించండి. నాకెందుకో వణుకు మొదలయ్యింది. సరే ఉంటాను అని చెప్పి ప్రసాదం కూడా తీసుకోకుండా వచ్చేసాను.
మాట్లాడేటప్పుడు ఏం అనిపించలేదు. ఇప్పుడు గుండె వేగంగా కొట్టుకుంటుంది. ఎక్కువ మాట్లాడానా? చెప్పాల్సిన పద్దతి ఇదేనా అనిపించినా బుర్ర ఏమి పనిచేయట్లేదు. అలా నడుచుకుంటూ బస్టాండ్ కి వచ్చి విజయవాడ బస్సు ఎక్కేసాను. అలా ఎక్కానో లేదో బస్సు వాడు పోనిచ్చేసాడు. ఉరు దాటేవరకు ఎదో తెలీయని వణుకు. ఊరు దాటిన తర్వాత కొంచెం ప్రశాంతత వచ్చింది.
విజయవాడలో బస్సు దిగి బండి తీసుకుని ఇయర్ ఫోన్స్ పెట్టుకుని ఇంటికి బయల్దేరాను. అలా వస్తుంటే ఎవరో బండికి అడ్దంగా వచ్చారు. సర్ర్..అని బ్రేక్ వేసాను..ఆయన కిందపడిపోయారు..బండి ముందు ఆపి దిగి వచ్చేలోపు ఆయన్ను లేపుతున్నారు. నా మంచినీళ్ళ బాటిల్ ఇవ్వబోతుంటే ఒక పెద్దమనిషి బుద్ది ఉందా? ఇయర్ఫోన్స్ పెట్టుకుని నడుపుతున్నావు..ఫ్యాషన్ అనుకుంటున్నావా?? అని కోప్పడిపోతున్నారు. నాకు కూడా పెద్ద గొంతు ఉంది. కంగారొద్దు అని రెండు జేబులు బయటకి తీసేసాను...జేబులో ఫోన్ లేదు. అర్ధమయ్యిందా?? ఇయర్ఫోన్సే ఉన్నాయి ఫోన్ లేదు..కేవలం హారన్లు, ధూళి వెళ్ళకుండా ఉండటం కోసం పెట్టుకున్నాను. మీరు ఇంక దయచేయండి అని గట్టిగానే సమాదానం చెప్పాను. విషయం తెలుసుకోకుండా విజ్ఞాన ప్రదర్శనలు చేసే వాళ్ళు ఎక్కువైపోయారు. కిందపడిన పెద్దాయన కల్పించుకుని తప్పు తనదే అని చెప్పారు. ఆయన్ని క్షేమంగా వాళ్ళ ఇంటి దగ్గర దింపి ఇంటికొచ్చేసాను. ఇంటికొచ్చిన తర్వాత ద్వారకా తిరుమలలో జరిగింది అమ్మ కి చెబితే తిక్క వెధవ అని తిట్టి నవ్వింది. నేను అన్నదాన్లో నాకేం తప్పు అనిపించలేదు. అమ్మకి కూడా!!
బొమ్మాబొరుసూ రెండిటి విలువ ఒకటే!! గోడు సంగతి అప్రస్తుతం!!
గమనిక: పైన రాసిన సర్వేలు, పరిశోధనలు అంతా హంబగ్.
ధన్యవాదములు
వశిష్ఠ ✍️
Comments
Post a Comment